కొత్త రూట్లో జగన్ ను గిల్లుతున్నాడుగా?

అదేంటో ఒకరిని తిట్టాలంటే వారి ప్రత్యర్ధులను గట్టిగా పొగిడితే చాలు. డోస్ బాగా సరిపోతుంది. ఈ లాజిక్ తోనే ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం [more]

Update: 2020-07-14 08:00 GMT

అదేంటో ఒకరిని తిట్టాలంటే వారి ప్రత్యర్ధులను గట్టిగా పొగిడితే చాలు. డోస్ బాగా సరిపోతుంది. ఈ లాజిక్ తోనే ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు రెచ్చిపోతున్నారు. ఆయన కళ్ళకు ఇపుడు అర్జంట్ గా పవన్ కల్యాణ్ గుర్తుకువచ్చారు. పవన్ లో నిజాయతీపరుడు కూడా ఆయనకు కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అయితే ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారన్నది రాజు గారి తాజా వాక్కు. పవన్ని సీఎం చేయని ప్రజలకు న్యాయం కోరే హక్కు కూడా లేదు అంటూ రాజు గారు క్లారిటీగా చెప్పేశారు. 2024 నాటికైనా పవన్ కల్యాణ్ సీఎం అవుతారని అపుడు ఏపీ అభివ్రుధ్ధి భారత్ లోనే నంబర్ వన్ గా ఉంటుందని కూడా భవిష్యత్తు వాణి వినిపించారు.

అలా వచ్చారా…?

జగన్ ని నేరుగా అవినీతిపరుడని రాజు గారు అనడంలేదు. పవన్ కల్యాణ్ నీతిమంతుడు అంటున్నారు. ఆయన సీఎం అయితేనే తప్ప ఏపీ బాగుపడదు అని సౌండ్ చేస్తున్నారు. అంటే జగన్ చేతిలో ఏపీకి అథోగతేనని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఈ విధంగా రాజు గారు కొత్త రూట్లో జగన్ ని గిల్లుతున్నారన్నమాట. పవన్ కల్యాణ్ కాబోయే సీఎం, జగన్ కంటే బెటర్ క్యాండిడేట్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట. నిజానికి 2019 ఎన్నికల వేళ ఇదే రాజు గారు పవన్ని ఎంతలా విమర్శించారో అందరూ ఇంకా గుర్తుంచుకునే ఉంటారు. ఆయన అన్న గారు నాగబాబుతోనే తొడగొట్టి మరీ పోటీకి దిగి రాజు గారు గెలిచారు. ఆ టైంలో జనసేన మీద ఆయన చేసిన హాట్ కామెంట్స్ వేడి ఇంకా అలాగే ఉంది. ఇంతలో ఇలా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారన్నమాట.

ముందస్తు యత్నమా..?

నూటికి తొంబై శాతం నర్సాపురానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండదు అని రాజకీయ పరిశీలకుల భావన. ఓ వైపు కరోనా మహమ్మారి ఉన్న సందర్భం ఇది. షెడ్యూల్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన సాధారణ ఎన్నికలే జరుగుతాయో లేదో తెలియని స్థితి. ఈ నేపధ్యంలో కోరి మరీ కొత్త ఎన్నికను ఎవరూ తీసుకురారు. ఇక రాజు గారు లాజిక్ గానే వైసీపీ మీద కామెంట్స్ చేస్తున్నారు తప్ప ఎక్కడా తప్పుకు దొరకడంలేదు. ఆయన వైసీపీ తరఫున ఏ విప్ కూడా ధిక్కరించలేదు. ఇక పార్టీకి భిన్నమైన అభిప్రాయాలు చెప్పడం వరకూ అంత సీరియస్ మాటర్ కాదు. వీటికి తోడు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన దోస్తీ వల్ల కూడా అనర్హత వేటు పడదన్న భావన ఉంది. కానీ ఇది రాజకీయం. ఏమైనా జరగవచ్చు. వైసీపీ రాజు గారి అంశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో జగనే నేరుగా రంగంలోకి దిగితే అపుడు ఏమైనా జరగవచ్చు. ఉప ఎన్నికా రావచ్చు.అందుకే పవన్ కల్యాణ్ తో డీల్ కి రాజు గారి ఇలా పొగడ్తలు కురిపిస్తున్నారని అంటున్నారు.

గెలుపు ఖాయమా…?

ఒక వేళ ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ తరఫున రాజు గారు నిలబడతారు అంటున్నారు. ఎటూ జనసేనతో పొత్తు ఉంది. దానికి తోడు ఇప్పటి నుంచి పవన్ కల్యాణ్ ని పొగుడుతూ ఆయన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటే సులువుగా గెలిచేయవచ్చునన్నది రాజు గారి పక్కా ప్లాన్ అంటున్నారు. ఇక ఎటూ టీడీపీతో కూడా మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్న రాజు గారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణం చూపించి సైకిల్ పార్టీ మద్దతు ఇస్తే గెలుపు సునాయాసం అనుకుంటున్నారుట. ఒకవేళ టీడీపీ క్యాండిడేట్ పెట్టినా కూడా విక్టరీ కొట్టడానికే పవన్ కల్యాణ్ ను మంచి చేసుకుంటున్నారు అంటున్నారు. మొత్తం మీద రాజు గారికి ఇపుడు పవన్ కాబోయే సీఎంలా కనిపిస్తున్నారు. ఇలా అనడం కంటే తనను మళ్ళీ ఎంపీని చేసే బలమున్న నేతలా కనిపిస్తున్నారు అనుకోవడం సబబేమో.

Tags:    

Similar News