వైసీపీ ఎమ్మెల్యే డ్యూయ‌ల్ రోల్‌...

Update: 2018-07-07 12:14 GMT

ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. ఓ నియోజక‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న మ‌రో నియోజ‌కవ‌ర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో ఇన్‌చార్జ్ ఉన్నారు. చాలా విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్ర‌కాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆదిమూల‌పు సురేష్ ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. 2009లో ఇదే జిల్లాలోని ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసి సంత‌నూత‌ల‌పాడు నుంచి పోటీ చేసి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్‌.విజ‌య్‌కుమార్‌పై 1276 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

పార్టీ మారినా విజ‌యం...

గ‌త ఎన్నిక‌ల్లో సంత‌నూత‌ల‌పాడులో ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగింది. సంత‌నూత‌ల‌పాడులో అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విజ‌య్‌కుమార్ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి పోటీ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఎర్ర‌గొండ‌పాలెంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ ఎన్నిక‌లకు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ నుంచి పోటీ చేసి నియోజ‌క‌వ‌ర్గం, పార్టీ మారినా వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌తంలో టీడీపీ త‌ర‌పున సంత‌నూత‌ల‌పాడులో గెలిచిన మాజీ జ‌డ్పీచైర్మ‌న్ పాల‌ప‌ర్తి డేవిడ్‌రాజు గ‌త ఎన్నిక‌ల కంటే ముందే వైసీపీలో చేర‌డంతో ఆయ‌న‌కు ఎర్ర‌గొండ‌పాలెం సీటు ఇచ్చి చివ‌ర్లో పార్టీ మారిన సురేష్‌ను జ‌గ‌న్ ఇక్క‌డ పోటీ చేయించారు.

డేవిడ్ టీడీపీలోకి...

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో డేవిడ్‌రాజు టీడీపీలో చేర‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ ఆదిమూల‌పు సురేష్‌ను ఎర్ర‌గొండ‌పాలెం ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. ప్ర‌స్తుతం సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర‌గొండ‌పాలెంలో పోటీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ ఆయ‌న ఇన్‌చార్జ్‌గా నియ‌మితులై అక్క‌డ వ‌ర్క్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న డేవిడ్‌రాజుపై టీడీపీలోనే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంత‌నూత‌ల‌పాడుకు మారి ఇక్క‌డ నుంచి పోటీ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

సంత‌నూత‌ల‌పాడులో సామాన్య‌...

ఆదిమూల‌పు సురేష్ తిరిగి ఎర్ర‌గొండ‌పాలెంలో పోటీ చేసేందుకు రెడీ అవ్వ‌డంతో జ‌గ‌న్ సంత‌నూత‌ల‌పాడు బాధ్య‌త‌ల‌ను సామాన్య కిర‌ణ్‌కు అప్ప‌గించారు. గ‌తంలో ఆమె చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె ఎంపీగా వెళ్లేందుకు ఆస‌క్తిగా లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ ఆమెకు సంత‌నూత‌ల‌పాడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇలా ఆదిమూల‌పు సురేష్ ఓ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూనే, మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్‌గా డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విష‌యానికి వ‌స్తే ఎర్ర‌గొండ‌పాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సంత‌నూత‌ల‌పాడుకు మారాల‌ని చూస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ ఇన్‌చార్జ్ విజ‌య్‌కుమార్‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంతో ఆయ‌న్ను మార్చాల‌ని చూస్తున్నారు.

Similar News