వైసీపీని కేంద్రం అందుకే ప‌ట్టించుకోవడం లేదా ?

పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా అంటూ వైసీపీ హడావుడి చేస్తోంది. రెండేళ్ల మొద్దు నిద్ర తరువాత ఇపుడు గుర్తుకు వచ్చిందా ? అని సాటి పక్షాలు కూడా ఎకసెక్కం [more]

Update: 2021-07-23 13:30 GMT

పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా అంటూ వైసీపీ హడావుడి చేస్తోంది. రెండేళ్ల మొద్దు నిద్ర తరువాత ఇపుడు గుర్తుకు వచ్చిందా ? అని సాటి పక్షాలు కూడా ఎకసెక్కం చేస్తున్నాయి. మరో వైపు రాజ్యసభలో అయితే విజయసాయిరెడ్డి అతి చేస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఆయన ఏకంగా డిప్యూటీ చైర్మన్ మీద కాగితాలు విసిరారు అన్న దాని మీద క్షమాపణలు చెప్పారు. ఇలా వైసీపీ పొద్దు ఎరగనట్లుగా చేస్తున్న ఈ విచిత్ర విన్యాసాన్ని అటు కేంద్రం పట్టించుకోవడంలేదు. ఇటు తెలుగు రాజకీయాల్లో కూడా హైలెట్ కాలేక అభాసుపాలు అవుతున్నారు అంటున్నారు. ఇంకో వైపు చూస్తూంటే కేంద్రం కూడా లైట్ గానే వైసీపీని తీసుకుంటోన్న ప‌రిస్థితిని మ‌నం చూస్తూనే ఉన్నాం.

ముగిసిన అథ్యాయమని…..

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని కేంద్ర పెద్దలు ఎన్నో సార్లు చెప్పారు. ఇక వరసపెట్టి సభలో అదే సమస్య మీద ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తే కచ్చితంగా చర్యలకు కూడా కేంద్రం వెనకాడబోదు అంటున్నారు. మరో వైపు నాడు తెలుగుదేశం కానీ నేడు వైసీపీ కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోకుండా గాలికి వదిలేశాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక ఏపీలో వైసీపీకి టీడీపీకీ అసలు పడదు, ఈ రెండు పార్టీలూ ఏ రోజూ ఒకే మాట మీద లేవు. నాడు పోలవరానికి నిధులు ఎక్కువ ఖర్చు అవుతాయని సవరించిన ప్రతిపాదనలను టీడీపీ ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపితే ఇదే వైసీపీ నేతలు అంత అవసరం లేదని అన్నారని తమ్ముళ్ళు అంటున్నారు.

నిధులు విడుదల కాకుండా….

పైగా నాడు ఆ నిధుల లెక్క‌ల‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని, నాడు కేంద్రం ఆ నిధులు ఇవ్వకుండా వైసీపీయే కుట్ర చేసింద‌ని టీడీపీ వాళ్లు విమ‌ర్శిస్తున్నారు. ఇక ఇపుడు సవరించిన మేరకు 55 వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని పదే పదే కోరుతోంది. ఇపుడు టీడీపీ కిమ్మనడంలేదు. మరో వైపు రెబెల్ ఎంపీ రఘురామ రాజు అయితే పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుంది అని ఫిర్యాదు చేస్తున్నారు. మరి ఆయన వెనక టీడీపీ ఉందని వైసీపీ వాళ్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఎవరికి వారు….

ఇలా ఏపీలోని రాజకీయం దారుణంగా తయారై ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ పోతే కేంద్రం ఎలా ? గౌరవిస్తుంది, ఎలా నిధులు ఇస్తుంది అన్న ప్రశ్న కూడా ఉంది. వీళ్లు వీళ్లు త‌న్నుకుంటుంటే కేంద్రం చోద్యం చూస్తూ త‌మ‌కు ఎప్పుడు లాభం క‌లుగుతుందా ? అని ఎంజాయ్ చేస్తోన్న ప‌రిస్థితే ఉంది. మరో వైపు చూస్తే మోడీ సర్కార్ మీద వైసీపీ పోరాటం వెనక చిత్తశుద్ధి కనుక ఉంటే టీడీపీని కూడా కలుపుకుని పోవాలి కదా అన్న మాట ఉంది. ఎవరికి వారు పార్లమెంట్ లో తామే ఆందోళన చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అక్కడ కేంద్ర పెద్దలు ఏపీని అసలు పట్టించుకోవడమే లేదని అంటున్నారు.

Tags:    

Similar News