రాజీ లేదు… రఫ్ఫాడించడమే…?

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసింది. మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రకటించిన అధినేత దానిని నిలుపుకునేందుకు శతథా ప్రయత్నించారనే చెప్పాలి. [more]

Update: 2020-05-30 15:30 GMT

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసింది. మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రకటించిన అధినేత దానిని నిలుపుకునేందుకు శతథా ప్రయత్నించారనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితులు, రుణ సంక్షోభం వంటి వాటిని పక్కనపెట్టి అప్పో సప్పో చేసి నవరత్నాలను అమలు చేయడానికి గట్టిగా కృషి చేశారు. ఆ విషయంలో సక్సెస్ సాధించారు. ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు మేనిఫెస్టోను అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తుంటాయి. చివరి రెండేళ్ల వరకూ పట్టించుకోవు. అప్పుడు వాటి కార్యాచరణకు శ్రీకారం చుడతాయి. తాము అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు కొత్తగా కనిపించాలనే ఎత్తుగడ ఇందులో దాగి ఉంటుంది. మరోవైపు డబ్బుల సర్దుబాటు విషయంలోనూ తడబాటు కారణంగా కొంత జాప్యం చేస్తుంటాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈవిషయంలో భిన్నవైఖరిని తీసుకున్నారు. హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో రాజీ లేదని చాటి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పురోగతి లేదు. విధానాల్లోనూ లోపాలు వెన్నాడాయి. తెచ్చిపెట్టుకున్న వివాదాలూ తల బొప్పి కట్టించాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించినా లెక్క చేయలేదు. ఎందుకంటే వైసీపీకి లభించిన మెజార్టీ అలాంటిది . అయితే ప్రతిపక్షాల కంటే రాజ్యాంగవ్యవస్థలు, న్యాయపోరాటంలోనే వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బలు ఎక్కువగా తగిలాయి.

కొడితే పెద్దోడినే…

దాదాపు అరవై పైచిలుకు న్యాయవ్యాజ్యాల్లో సర్కారుకు ప్రతికూలంగా న్యాయస్థానాలు స్పందించాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్నది తేల్చడమే న్యాయస్థానాల బాధ్యత. ప్రజామద్దతు, భారీ మెజార్టీ వంటి వాటితో కోర్టులకు సంబంధం లేదు. ప్రభుత్వాలకు, చట్టసభలకు, న్యాయస్థానాలకు రాజ్యాంగమే అంతిమ శాసనం. దానికి భాష్యం చెబుతూ వ్యవస్థలు కట్టు తప్పకుండా చూడటం కోర్టుల కర్తవ్యం. అనేక విషయాల్లో వైసీపీ సర్కారు న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కోవడంపై ఒక విమర్శ ఉంది. ప్రభుత్వానికి అనుబంధంగా లా డిపార్టుమెంటు ఉంటుంది. రాజ్యాంగ కోవిదులు అందుబాటులో ఉంటారు. సీనియర్ రాజకీయ సలహాదారులున్నారు. అయినా న్యాయస్థానాల్లో ప్రభుత్వ నిర్ణయాలు ఎందుకు నిలవలేక పోతున్నాయనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియక నిర్ణయాలు తీసుకోవడం లేదు. కోర్టుల్లో నిర్ణయాలు వీగిపోయినా తమ ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించాలనే లక్ష్యంతోనే అసంబద్ధమైన అంశాల్లో సైతం సర్కారు దూకుడు కనబరుస్తోందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగులు, మూడు రాజధానులు వంటి విషయాలు ఒక ఎత్తు. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నే మార్చేసేందుకు పూనిక వహించడం మరో ఎత్తు. రాజ్యాంగం ప్రకారం ఇది చెల్లుబాటు కాదని ప్రభుత్వానికి తెలుసు. అయితే పెద్ద వ్యవస్థ, రాజ్యాంగ రక్షణ ఉన్న వ్యవస్థ సైతం తమ అదుపాజ్ణల్లో ఉండాలనే సంకేతాన్నివ్వడమే రాజకీయ ఉద్దేశంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలినా ప్రభుత్వ పట్టుదలను చూసి మిగిలిన బ్యూరోక్రసీ, వ్యవస్థలు నియంత్రణలోకి వస్తాయనేది అంచనా.

ప్రజాభిప్రాయమే ఫైనల్…

కోర్టులు ఎన్ని చెప్పినా ప్రజలు ఏమనుకుంటున్నారనేదే రాజకీయ కార్యనిర్వాహక వర్గానికి కావాల్సింది. అందుకే రాజ్యాంగ వ్యవస్థలను వైసీపీ సర్కారు పెద్దగా లెక్క చేయడం లేదు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతేనే నిర్ణయాల్లో వెనుకంజ వేస్తున్నారు. లేకపోతే తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ పోతున్నారు. ప్రజల భావనలో మంచి మార్కులు పడితే చాలు. నిజానికి ఈ ఏడాదికాలంలో ప్రతిపక్షాలు పోరాటం చేసి సర్కారుపై విజయం సాధించిన ఘట్టాలు అరుదుగానే చెప్పాలి. తనంతటతాను స్రుష్టించుకున్న సమస్యలతోనే ప్రభుత్వం సతమతమవుతోంది. పదిశాతం పైచిలుకు ఓట్ల తేడాతో ప్రధాన ప్రతిపక్షం కుప్పకూలిపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఎప్పుడెప్పుడు గడప దాటేద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఈ స్థితిలో తన సొంత అస్తిత్వం కాపాడుకోవడానికే ప్రతిపక్షం పోరాడాల్సి వస్తోంది. ఇసుక విధానంలో మార్పులు పేరిట కొన్ని నెలల పాటు లక్షల మంది ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. అలాగే మూడు రాజధానుల పేరుతో బ్యూరోక్రసీలో స్తబ్ధతకు ఆస్కారం కలిగించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల్లో జాప్యం అనివార్యమైంది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలోనూ పునరాలోచన ఫలించలేదు. గతంతో విభేదిస్తూ ప్రభుత్వం తనకు తాను ముందరికాళ్లకు బంధం వేసుకుంటోంది. ఆయా విషయాలపై ఎన్నికలకు ముందు తాము విమర్శలు చేశాం కాబట్టి వాటిని నిరూపించాలనే ప్రయత్నంలోనే ప్రభుత్వం అధిక సమయాన్ని వ్రుథా చేసినట్లు కనిపిస్తోంది.

సంక్షేమమే సకలం…

ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని చెబుతుంది. ఆచరణలో దానిని పాటిస్తున్నాయా ? అన్నదే చర్చ. తక్షణం కష్టాల్లో ఉన్నపేదలను ఆదుకునే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు. దీర్ఘకాలంలో ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఊతమిచ్చే కార్యాచరణనే అభివృధ్దిగా చెప్పాలి. ప్రభుత్వాలు ఎల్లకాలం కూర్చోబెట్టి ప్రజలను పోషించలేవు. వారికాళ్లపై నిలబడేలా చేయడమే లక్ష్యం కావాలి. మౌలిక వసతులు, ఉపాధి కార్యక్రమాలు ఇందుకు దోహదం చేస్తాయి. అందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువభాగం ప్రజలకు ఉచితాల రూపంలో సమకూరతాయి. నగదు బదిలీ రూపేణా వస్తుంటాయి. ఈ ఏడాదిలో దాదాపు 40 వేల కోట్ల రూపాయల మేరకు మూడున్నర కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చామనేది ప్రభుత్వ లెక్క. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో 70 శాతం మంది ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతున్నారంటే అతిశయోక్తిగా అనిపిస్తుంది. అనర్హులకు సైతం ప్రభుత్వం అయాచితంగా సొమ్ములు కుమ్మరిస్తోందనే అనుమానాలు తలెత్తుతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. గడచిన సంవత్సరకాలంలో చేసిన రుణాల్లో 50శాతం పైచిలుకు సంక్షేమ పథకాల వాటాకే చెల్లిపోయాయి. ప్రభుత్వానికి ఇది రానున్న కాలంలో భారంగా మారవచ్చు. సాధారణంగా పరిపాలన కాలంలో మొదటి మూడేళ్లు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తుంటాయి. చివరి రెండు సంవత్సరాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే సంక్షేమంపై భారీ వ్యయం చేస్తాయి. అయితే వైసీపీ సర్కారు సంక్షేమమే తారకమంత్రమని మొదటి నుంచీ పల్లవి ఎత్తడంతో భవిష్యత్తులో అభివ్రుద్ధి పనులకు నిధుల సర్దుబాటు కష్టమవుతుంది. ఈ సర్కారులో సంక్షేమం సంత్రుప్త స్థాయికి చేరుకున్నట్టుగానే చెప్పాలి. అందులోని లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ఇకపై అభివృద్ది పనులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News