ఆ టీడీపీ సీటు ఈసారి వైసీపీదేనా..?

విశాఖ న‌గ‌రాభివృద్ధిని సూచించే జాతీయ‌స్థాయిలో పేరెన్నిక‌గ‌ల‌ అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. విశాఖ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఒక్క [more]

Update: 2019-02-09 16:30 GMT

విశాఖ న‌గ‌రాభివృద్ధిని సూచించే జాతీయ‌స్థాయిలో పేరెన్నిక‌గ‌ల‌ అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. విశాఖ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే విశాఖ ఆయువుప‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, గ‌వ‌ర‌, బీసీ ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. ఓట‌ర్లు 2 ల‌క్ష‌ల 26 వేల‌కు పైగా ఉన్నారు. ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌నిచేసే వారే అత్య‌ధికంగా ఉంటారు. స‌మ‌కాలీన రాజకీయాల‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న ఉన్న ప్రాంతంగా చెప్ప‌వ‌చ్చు. ఇక పోలిటిక‌ల్ పాయింట్‌కు వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ సాధించి పోటీ చేసిన గ‌ణ‌బాబు 30 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ర‌త్నాక‌ర్‌పై విజ‌యం సాధించారు.

బ‌ల‌మైన అభ్య‌ర్థిని దించుతున్న వైసీపీ

గ‌ణ‌బాబు 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి మ‌ళ్ల విజ‌య ప్ర‌సాద్‌పై ఓడిపోయారు. మ‌ళ్ల ప్ర‌సాద్ అప్పుడు కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీయ‌డంతో ఆయ‌న వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించినా ఆ పార్టీ ర‌త్నాకర్‌కు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే అప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఆయ‌న్నే ఆ పార్టీ బ‌రిలోకి దింప‌నుంద‌ని తెలుస్తోంది. దాదాపుగా ఆయ‌న‌కే టిక్కెట్‌ ఖాయ‌మైన‌ట్లే. మాజీ ఎమ్మెల్యేగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌ళ్ల ప్ర‌సాద్‌కు మంచి ప‌ట్టు ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో కొంత సానుభూతి కూడా ఉంది. ఇది ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అంశం. గ‌ణ‌బాబు ఇచ్చిన హామీలు నెర‌వేర్చార‌నే పేరుంది. అయితే గ‌ణ‌బాబు అనుచ‌రుల్లో కొంత‌మంది ఆయ‌న పేరు చెడ‌గొడుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. వాళ్లు చేసే అక్ర‌మాలు, అవినీతి ప‌నుల‌తో ఆయ‌న ప్ర‌తిష్ఠ మ‌స‌కబారుతోంద‌న్న ఆవేద‌న పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

త్రిముఖ పోటీ ఖాయం…

మొత్తంగా చూసుకుంటే మాత్రం విశాఖ ప‌ట్ట‌ణంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగ‌నుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ ఉండ‌నుంది. అయితే జ‌న‌సేన‌కు చెప్పుకోద‌గిన‌ స్థాయిలో మాత్రం క్యాడ‌ర్ లేదు ఇక్క‌డ‌. కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు మాత్రం పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు..వైసీపీ నుంచి టికెట్ దాదాపు క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న మ‌ళ్ల‌ విజ‌య ప్ర‌సాద్ గ‌వ‌ర సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఒకే సామాజికవ‌ర్గం నుంచి వీరిద్ద‌రూ ఓట్లు చీల్చుకుంటే కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు గంప‌గుత్త‌గా జ‌న‌సేన పార్టీకి ప‌డేలా అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని జ‌న‌సేన వ్యూహం ప‌న్నుతోంది. మ‌రి ఎవ‌రి వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News