రెండు కోట్లుంటేనే ఆ టికెట్ అట

ఎన్నికలు మహా ఖరీదు అయిపోయాయి. ప్రతీ ఎన్నికకూ డబుల్, త్రిబుల్ గా రేట్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు చూస్తే పాతిక, వంద కోట్ల ఖర్చు సునాయాసంగా [more]

Update: 2019-07-23 00:30 GMT

ఎన్నికలు మహా ఖరీదు అయిపోయాయి. ప్రతీ ఎన్నికకూ డబుల్, త్రిబుల్ గా రేట్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు చూస్తే పాతిక, వంద కోట్ల ఖర్చు సునాయాసంగా చేసేస్తున్నారు. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఆ జోరు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెట్టాల్సి ఉంటుందని ఆశావహులు అపుడే లెక్కలు వే సుకుంటున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో అన్ని వార్డులను గెలుచుకోవాలని అటు అధికార పక్ష వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ అపుడే వ్యూహ రచన చేస్తున్నాయి. దాంతో అంగబలం, అర్ధబలం ఉన్న వారిని బరిలోకి దింపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్న వారు కచ్చింతంగా రెండు కోట్లు ఖర్చు చేయాల్సిందేనంట.

హడలిపోతున్న నేతలు….

వైసీపీలో పదేళ్ళుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఏ అధికార పదవిని ఇంతవరకూ నోచుకోలేదు. కేవలం వైఎస్సార్ కుటుంబం మీద అభిమానంతోనే వారు చేతి చమురు వదిలించుకుని పనిచేస్తూ వచ్చారు. తమ సేవలను గుర్తించి పార్టీ వార్డు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి గెలిపిస్తుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం భారీగా ఖర్చు చేసిన వారికే టికెట్లు అంటూ ప్రకటనలు చేయడంతో అసలైన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పైగా టికెట్లు నిజమైన క్యాడర్ కి దక్కుతాయో లేదోనని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రి అవంతి వెంట టీడీపీ నుంచి వచ్చిన వర్గం నేతలు ఉంటే, కొత్తగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా నియమితులైన ద్రోణం రాజు శ్రీనివాస్ పక్కన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారిని దాటుకుని కార్పొరేటర్ టికెట్ సాధించడం కష్టమేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

టీడీపీలో నిరాశ….

ఇక పార్టీ అధికారంలో లేకపోవడంతో టీడీపీలో నిరాశ తాండవిస్తోంది. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎ రహమాన్ మాత్రం జీవీఎంసీలో తామే గెలిచి తీరుతామని అంటున్నారు. సమర్హ్దులైన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కూడా చెబుతున్నారు. మరి ఆ సమర్ధత పని చేయడంలోనా, లేక డబ్బులు ఖ‌ర్చు చేయడంలోనా అని పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రధానమైన పార్టీలు రెండింటిలోనూ కూడా డబ్బే రాజకీయం చేస్తుందన్న భావన బలంగా ఉండడంతో జీవీఎంసీ ఎన్నికల్లో ధనప్రవాహం గురించి దిగువ స్థాయి క్యాడర్ బెంబేలెత్తుతోంది.

Tags:    

Similar News