క్లారిటీ వచ్చే అవకాశమే లేదా?

అమరావతి రాజధానిపై ప్రకంపనలు ఆగడం లేదు. ఇంతకీ అమరావతి ఆంధ్రప్రదేశ్ కేపిటల్ గా కొనసాగుతుందా? ఒకవేళ కొనసాగితే కేవలం పాలన నగరానికే పరిమితమవుతుందా? గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల [more]

Update: 2019-08-23 14:30 GMT

అమరావతి రాజధానిపై ప్రకంపనలు ఆగడం లేదు. ఇంతకీ అమరావతి ఆంధ్రప్రదేశ్ కేపిటల్ గా కొనసాగుతుందా? ఒకవేళ కొనసాగితే కేవలం పాలన నగరానికే పరిమితమవుతుందా? గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల సంగతేమిటనే అనుమానాలకు తెరపడటం లేదు. పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ లేవనెత్తిన కలకలం, దానికి అనుబంధంగా రోజువారీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు అనుమానాలను పెంచి పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ఈ ప్రచారం ఊపందుకోవడం , దానిపై ఉన్నతస్థాయిలో ఎటువంటి వివరణ లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం పతాకస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్నాయి. రాజధాని పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రియల్ రంగం, వ్యాపార, ఫైనాన్షియల్ సెక్టార్లు భయాందోళనలకు గురవుతున్నాయి. గతంలో అమరావతిలో రాజధానికి వైసీపీ సైతం అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికింది. అయితే ఆ తర్వాత భూముల పేరిట పెద్ద ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ సాగిందనే ఆరోపణను తెలుగుదేశంపై ఎక్కుపెట్టింది. అదే అంశం లోతుల్లోకి వెళ్లేందుకు తాజాగా పూనుకుంటుండంతో రాజధాని వాస్తవ స్వరూపం ఎలా ఉండబోతోందనే సందేహాలు నెలకొంటున్నాయి. అనుమానాలు బలపడుతున్నాయి.

రాజధాని రహస్యం…

భూ సమీకరణ పేరిట భారీ ఎత్తున భూములు సేకరించడాన్ని వైసీపీ తీవ్రంగానే వ్యతిరేకించింది. ప్రజలకు ఇష్టమైతేనే ప్యాకేజీ ఇవ్వాలని లేనిచోట్ల భూసమీకరణ చేపట్టకూడదని ఆ పార్టీ నాయకులు ఫీల్డు లెవెల్ లో కొంత ఆందోళన చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారికి అండగా ఉన్నారు. తాజాగా తామే ప్రభుత్వంలోకి రావడంతో ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వస్తోందని వైసీపీ నాయకులు ఆంతరంగికంగా చెబుతున్నారు. స్వచ్చందంగా భూములు అప్పగించినవారెవరు? బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములను స్వాధీనం చేసిన వారెవరనే విషయంపై ఉన్నతస్థాయిలో అధ్యయనం సాగుతోందనే ప్రచారం పుంజుకొంది. రాష్ట్రానికి ఉన్న వనరుల కొరతకు తోడు మూడు నాలుగు జిల్లాల ప్రజల సెంటిమెంటుపై ప్రభావం చూపుతుంది కాబట్టి అమరావతి రాజధానిని మార్చే ప్రసక్తి లేదని వైసీపీలో అగ్రనాయకులు చెబుతున్నారు. అయితే టీడీపీ ప్రతిపాదించిన విధంగా నగర నిర్మాణం ఉండబోవడం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా తరహాలో ఉంటుందంటున్నారు. అక్కడ రాష్ట్రాల రాజధానులు కేవలం పొలిటికల్ కేపిటల్స్ గా మాత్రమే ఉంటాయి. భారతదేశం లో మాత్రం మోడల్ వేరుగా ఉంది. కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు వంటి రాష్ట్రాల రాజధానులు ఆర్థిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

వికేంద్రీకరణ….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించాలనుకున్నప్పుడు హైదరాబాద్ ప్రధాన సమస్యగా మారింది. దక్షిణభారతంలో అతిపెద్ద రాష్ట్రానికి 58 సంవత్సరాల పాటు రాజధానిగా ఉండటంతో అనేక కేంద్రప్రభుత్వ సంస్థలు ఇక్కడ నెలకొల్పారు. విద్య,వైద్యసదుపాయాలు, వ్యాపార,పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాయి. జనాభా సంఖ్య, వినియోగమార్కెట్ అధికం కావడంతో ఆర్థిక కేంద్రంగానూ రూపుదాల్చింది. ఒకరకంగాచెప్పాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వరంగాలే కాకుండా ప్రయివేటు రంగాలూ ఇక్కడ కేంద్రీకృతమయ్యాయి. రాష్ట్రంలో ఏరకమైన పరిశ్రమ పెట్టాలన్నా మొదటి ఛాయిస్ గా హైదరాబాద్ మారింది. అందుకే చాలా వేగవంతంగా డెవలప్ అయ్యింది. ప్రధాన ఆదాయవనరుగా రూపుదాల్చింది. ఈ ఆదాయాన్ని వదులుకొంటే విభజిత రాష్ట్రం నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రాంతం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటువంటి పరిస్థితి కొత్త రాష్ట్రానికి ఎదురుకాకూడదంటే అసమానతలు లేని రాష్ట్రాన్ని తయారు చేయాలనే వాదనను వైసీపీ ముందుకు తెస్తోంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ బాగా వెనకబడ్డ ప్రాంతాలుగా ఉన్నాయి. వాటికి కూడా సమప్రాధాన్యం ఇచ్చి వికేంద్రీకరణ చేస్తే సమతుల్యత సాధించడం సాధ్యమవుతుందంటున్నారు. అదే సమయంలో మరో భిన్నమైన వాదనను తెలుగుదేశం పార్టీతో పాటు కొందరు ఆర్థిక నిపుణులు ముందుకు తెస్తున్నారు. కొత్త రాజధానిలో సకల సౌకర్యాలు, భూమి వంటి మౌలిక వసతులు సమకూరిస్తే పెట్టుబడులు అధికంగా వస్తాయి. తొందరగా డెవలప్ అవుతుంది. వేగవంతంగా రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా మారుతుంది. రాష్ట్రం మొత్తం మౌలిక వసతులను ఏకకాలంలో అభివ్రుద్ధి చేయడం సాధ్యం కాదు. అందువల్ల ముందుగా రాజధానిపై కేంద్రీకరించి … ఆతర్వాత దశల్లో ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చనేది టీడీపీ వాదనను సమర్థించే నిపుణుల అభిప్రాయం.

పొలిటికల్ పోలరైజేషన్…

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాజధాని ఉంటే శీఘ్రగతిన అన్నిటినీ సమకూర్చుకోవడం సాధ్యమవుతుంది. అందులోనూ సర్వం కోల్పోయిన దశలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంత తొందరగా కోలుకుంటే అంతగానూ మంచిది. తెలంగాణకు ఆదాయంలో సగం మేరకు హైదరాబాదు నుంచే సమకూరుతోంది. ప్రస్తుతం అమరావతి ఆదాయం జీరో. రాష్ట్రవనరులకు అమరావతి నుంచి ఆదాయాన్ని సృష్టించాలనేది పాత ప్రభుత్వ ప్రణాళిక. రానున్న 20 సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయంలో 30 శాతం వాటా కేపిటల్ కు ఉండాలనేది అంచనా. ఇక్కడే తెలుగు దేశం, వైసీపీ ప్రభుత్వాల ఆలోచనల మధ్య వైరుద్ధ్యం కనిపిస్తోంది. రాజకీయంగా భవిష్యత్తులో సమస్యాత్మకంగా ఉండకుండా చూసుకునేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది వైసీపీ మొదటి ప్రాధాన్యంగా కనిపిస్తోంది. కేంద్రీకరణ ద్వారా సాధ్యమైనంత వేగంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనేది టీడీపీ ప్రతిపాదన. ప్రణాళిక మండలిని రద్దు చేసి ప్రాంతీయ అభివృద్ది మండళ్లను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం తాజాగా యోచన చేస్తోంది. దీనివల్ల రాజకీయనాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రభుత్వాన్ని , పాలన వ్యవహారాలను కూడా వికేంద్రీకరించినట్లవుతుంది. ఇది వైసీపీకి అనుకూలంగా పొలిటికల్ పోలరైజేషన్ కు దోహదపడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం వ్యవహారంపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే సూచనలు లేవు. పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ప్రజాభిప్రాయం మౌల్డ్ అవుతుంది. ఆ తర్వాత కార్యాచరణ మొదలవుతుంది. అంతవరకూ ఊహాగానాలు, వాదోపవాదనలు కొనసాగుతూనే ఉంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News