వంశీ టేకోవర్… యార్లగడ్డ సర్దుకుంటున్నట్లేనా?

అధికార వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య ర‌గులుతున్న అంత‌ర్గత పోరు నానాటికీ పెరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం వైసీపీలో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితి మరోమారు తేటతెల్లం అయింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా [more]

Update: 2020-03-14 08:00 GMT

అధికార వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య ర‌గులుతున్న అంత‌ర్గత పోరు నానాటికీ పెరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం వైసీపీలో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితి మరోమారు తేటతెల్లం అయింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయం ఖాళీ చేయటం చర్చనీయాంశమైంది. ఆయన కార్యాలయంగా ఏర్పాటు చేసిన ఎంపీడీవో కార్యాలయం ఎదుట సందులో ఉన్న వైసీపీ కార్యాలయంలోని సామాగ్రిని సర్దివేశారు. కంప్యూటర్‌లు ఊడదీసి వాటిని తరలించటం కోసం ఏర్పాట్లు చేశారు. దీనిని గమనించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి లోనయ్యారు.

స్వల్ప ఓట్ల తేడాతో…..

2018వ సంవత్సరం చివరి నెలల్లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ఇన్‌ఛార్జిగా ఇక్కడికి వచ్చారు. ఆనాటి నుంచి ఈ కార్యాలయం కేంద్రంగా ఏర్పాటు చేసి ఆ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్నారు. వైసీపీకి జవసత్వాలు తెచ్చారు. సిబ్బందిని ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన దుట్టా రామ‌చంద్రరావు ఆర్థికంగా వంశీని ఢీ కొట్టే రేంజ్ కాక‌పోవ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు బ‌దులుగా ఆర్థికంగా బల‌వంతుడు, క‌మ్మ వ‌ర్గానికి చెందిన యార్లగ‌డ్డ వెంకట్రావును రంగంలోకి దించారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న వంశీకి గ‌ట్టి పోటీ ఇచ్చి కేవ‌లం 830 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

దూరం పెరిగిందనేనా?

అనంత‌రం వంశీ వైసీపీకి ద‌గ్గర‌య్యారు. జ‌గ‌న్ యార్లగ‌డ్డ వెంకట్రావును అన్యాయం చేయ‌కుండా ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తుపై హామీ ఇచ్చారు. మారిన రాజకీయ పరిస్థితులలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయంగా ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో పెరిగిన దూరం ఆయన స్థానిక రాజకీయ మనుగడకు ఇబ్బందులు తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇన్‌ఛార్జిగా ఉన్నా కార్యకలాపాలు విషయంలో గందరగోళం ఏర్పడింది. దీంతో గడచిన నెల రోజులుగా నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఇక వంశీ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీని టేకోవ‌ర్ చేసేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో…..

ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టిక్కెట్ల బాధ్యత‌లు మొత్తం వంశీ చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు సమీపించినా పట్టించుకోకపోవటం మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితులలో ఆ పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వంశీ వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహిస్తుండటం, కార్యాలయం ఖాళీ చేయటం చర్చకు తెరలేపింది. యార్లగడ్డ అభిమానులుగా ఉన్నవారికి ఈ పరిస్థితులు మొత్తంగా మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు.మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు యార్లగ‌డ్డకు చెక్ పెడుతున్నార‌నే అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత వంశీపై ఓడిపోయిన నేప‌థ్యంలో అప్పటి నుంచి కూడా ఆయ‌న‌కు పెద్దగా ప్రాధాన్యం ద‌క్కడం లేదు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ప‌ద‌వి ని ఇచ్చి స‌రిపెట్టార‌ని ఆయ‌న వ‌ర్గం అంటోంది. మొత్తంగా చూస్తే.. ఇక‌, యార్లగ‌డ్డ వెంకట్రావు స‌ర్దుకోవాల్సి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News