య‌న‌మ‌ల‌.. హీరో కాదు.. నీరో.. తూర్పులో త‌మ్ముళ్ల ఆవేద‌న‌

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అది టీడీపీలో నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉన్న మాజీ మంత్రి, మాజీ స్పీక‌ర్‌, ప్రస్తుతం ఎమ్మెల్సీగా [more]

Update: 2020-03-25 14:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అది టీడీపీలో నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉన్న మాజీ మంత్రి, మాజీ స్పీక‌ర్‌, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుపై సెటైర్లు పేలుతున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. టీడీపీలో ఆయ‌న చంద్రబాబు త‌ర్వాత పొజిష‌న్‌లో ఉన్నారు. అంటే అధికారంగా కాక‌పోయినా పార్టీ ప‌ద‌వులు అనుభ‌వించిన విశ్వాసం మేర‌కైనా ఆయ‌న పార్టీని ర‌క్షించుకో వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. నిర్మాణాత్మక రీతిలో పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే, మ‌రి ఆయ‌న ఈ కష్టకాలంలో అలానే వ్యవ‌హ‌రిస్తున్నారా ? ఆయ‌న పార్టీని కాపాడే ప్రయ‌త్నం చేస్తున్నారా ? పోనీ.. రాష్ట్రం మొత్తం పార్టీ ఎలా పోయినా త‌న‌కేమైంది? అనుకున్నా.. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లా, త‌న సొంత జిల్లా, త‌న‌కు రాజ‌కీయంగా గుర్తింపు ఇచ్చిన జిల్లాలో అయినా య‌న‌మ‌ల రామకృష్ణుడు పార్టీని నిల‌బెట్టుకునే ప్రయ‌త్నం చేస్తున్నారా? అంటే లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇరవై ఏళ్లుగా….

ప్రస్తుతం టీడీపీ నుంచి జంపింగుల ప‌ర్వం ఓ రేంజ్‌లో సాగుతోంది. నాయ‌కులు ఏక‌మొత్తంగా పార్టీ నుంచి క్యూక‌ట్టుకుని మ‌రీ మారిపోతున్నారు. ఈ స‌మ‌యంలో య‌న‌మ‌ల రామకృష్ణుడు వంటి కీల‌క నాయ‌కులు పార్టీని కాపాడుకునేందుకు అంతో ఇంతో ప్రయత్నం చేయాలి క‌దా? అంటే ఆయ‌న చోద్యం చూస్తున్నారు. పైగా య‌న‌మ‌ల సోద‌రుడు కృష్ణుడు చూపిస్తున్న ధాటికి మ‌రింత మంది పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. అస‌లు య‌న‌మ‌ల ఆరుసార్లు గెలిచిన తుని నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఇర‌వై ఏళ్లుగా య‌న‌మ‌ల హ‌వా లేదు. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ అక్కడ య‌న‌మ‌ల సోద‌రులు చిత్తుగా ఓడుతున్నారు. ఇక ఇప్పుడు య‌న‌మ‌ల ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపో మాపో మండ‌లి ర‌ద్దు అయితే య‌న‌మ‌ల కుటుంబానికి రాజ‌కీయ భ‌విష్యత్తు కూడా లేద‌నే అంటున్నారు.

యనమల దెబ్బకు తాళలేక…

తునిలో య‌న‌మ‌ల సోద‌రుల ప్రభావంతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్‌ సీపీలో చేరారు. జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు య‌న‌మ‌ల రామకృష్ణుడు హ‌వానే ఎక్కువుగా న‌డిచేది. ఆయ‌న నియంత‌గా వ్యవ‌హ‌రించ‌డం వ‌ల్ల ఇటు చంద్రబాబు, లోకేష్ సైతం ఆయ‌న‌కే ప్రయార్టీ ఇవ్వడంతో విసిగిపోయిన నేత‌లే ఈ రోజు ఎక్కువ మంది పార్టీ వీడుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ వీడిన తోట న‌ర‌సింహం కుటుంబం.. ఇక తోట త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది.

పార్టీని వీడేందుకు….

చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు లేని నేత‌కు చంద్రబాబు ఎందుకంత ప్రయార్టీ ఇస్తున్నారా ? అని జిల్లా టీడీపీ కేడ‌ర్ అంతా త‌ల ప‌ట్టుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో పార్టీ చిత్తుగా ఓడినా నాలుగు సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. ఈ టైంలో జిల్లాలో పార్టీని ముందుండి న‌డిపించాల్సిన నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప .. గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి లాంటి వాళ్లను కాకుండా య‌న‌మ‌ల‌ రామకృష్ణుడిని న‌మ్ముకుంటే ఆయ‌న త‌న వ్యక్తిగ‌త స్వార్థం కోసం పార్టీని నిలువునా ముంచేస్తార‌ని పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. చంద్రబాబు ప‌క్కన ఉంటూ రాంగ్ గైడెన్స్‌తో జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క నేత‌లు పార్టీ వీడేలా చేయ‌డంలోనూ… పార్టీని నాశ‌నం చేయ‌డంలోనూ య‌న‌మ‌ల నీరో మాదిరిగా మారార‌ని టీడీపీ వాళ్లే అంటున్నారు.

బ్లాక్ మెయిల్ చేసి మరీ…

ఇక త‌న సొంత సామాజిక‌వ‌ర్గం కోసం ఆయ‌న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసిన వైనాలు కూడా వాళ్లు ఉదాహ‌రిస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రి త‌ల‌సాని లాంటి వాళ్లు ఇక్కడ టీడీపీని తిడుతున్నా.. ఆయ‌న‌తో ఉన్న బంధుత్వం వ‌ల్ల య‌న‌మ‌ల నోరు మెద‌ప‌కుండా పార్టీని న‌ష్టప‌రిచార‌ని అంటున్నారు. మ‌రి బాబు ఇప్పట‌కి అయినా య‌న‌మ‌ల‌ రామకృష్ణుడిని కాకుండా జిల్లాలో గెలిచి .. పార్టీ కోసం నిలిచిన వాళ్లకు ప్రయార్టీ ఇస్తారా ? లేదా ? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News