‘యనమల’ కోటలో మళ్లీ ఎదురుగాలేనా..?

తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం తుని. ప్రస్తుత ఆర్థిక మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత యనమల రామకృష్ణుడు ఈ నియోజకవర్గం నుంచి [more]

Update: 2019-02-07 05:30 GMT

తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం తుని. ప్రస్తుత ఆర్థిక మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత యనమల రామకృష్ణుడు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాజా అశోక్‌బాబు.. యనమల విజయాలకు బ్రేక్ వేస్తూ విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లోనూ యనమల సోదరుడు యనమల కృష్ణుడు తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. వరుసగా ఆరు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ సాధించిన యనమల ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో పట్టు కోసం పాకులాడే పరిస్థితి వచ్చేసింది. ఇందుకు ఆయనతో పాటు ఆయన కుటుంబం చేసుకున్న స్వయంకృత అపరాధాలే కారణం అన్న చర్చ తుని రాజకీయాల్లో నడుస్తోంది. 2005లో తుని మున్సిపల్‌ ఎన్నికలప్పటి నుంచే అక్కడ యనమల పతనం ప్రారంభం అవుతూ వచ్చింది.

యనమలపై వ్యతిరేకత…

2009 ఎన్నికల్లో యనమల స్వయంగా ఓడిపోగా గత ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఓడిపోయినా యనమల పట్టుబట్టి ఆయనకే తుని ఏఎంసీ చైర్మ‌న్‌ పదవి ఇప్పించారు. దీంతో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన వారు, మిగిలిన సామాజికవర్గాలు ఆయనకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. తునిలో బలంగా ఉండే ఓ ప్రధాన సామాజికవర్గం ఇప్పుడు యనమలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు వారంతా యనమలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. దీంతో ఆ సామాజికవర్గం ఓట్లు అసలు టీడీపీకి… ఇంకా చెప్పాలంటే యనమల ఫ్యామిలీలో ఎవరు అక్కడ పోటీ చేసినా వాళ్లకు ఆ ఓట్లు పడే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల్లో యనమలను కాదని ఇక్కడ చంద్రబాబు ఎవరికీ టీడీపీ సీటు ఇవ్వరు. అదే టైమ్‌లో యనమల తాను పోటీ చెయ్యకుండా తెలివిగా తప్పించుకుంటారనే ప్రచారమూ ఉంది. యనమల కుమార్తె దివ్య పేరు సైతం తెర మీదకు వస్తోంది. దీంతో తుని టీడీపీ సీటు ఫైన‌ల్‌గా ఎవరికి దక్కుతుందన్నది ఎన్నికల వేళ‌ యనమల తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది.

బలమైన అభ్యర్థిగా దాడిశెట్టి రాజా

ఇక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా దాడిశెట్టి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా పార్టీ వాయిస్‌ వినిపిస్తూ వచ్చారు. అదే క్రమంలో యనమలపై ఉన్న వ్యతిరేకత సైతం ఈయనకు కలిసి వచ్చి ఇక్కడ బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. ఇక జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు పేరు దాదాపు ఖరారు అయ్యింది. అశోక్‌బాబు కటుంబానికి తునిలో వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌తో పాటు ఆయనకు ఉన్న మంచి పేరుతో పాటు పవన్‌ సొంత సామాజికవర్గమైన కాపులు నియోజకవర్గంలో బలంగా ఉండడం ఆయనకు ప్లస్‌ కానుంది. అయితే ఇదే టైమ్‌లో వైసీపీ నుంచి పోటీ చేసే దాడిశెట్టి రాజా.. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు జనసేన పోటీ చేస్తే కాపుల ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందని… అలాగే తాము నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితో తాము గెలుస్తామని టీడీపీ లెక్కలు వేసుకుంటున్నా అది అంత సులువు అయితే కాదు.

త్రిముఖ పోరు తప్పదు…

ఇక వైసీపీ నుంచి పోటీకి రెడీ అవుతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు పార్టీ కేడర్ పటిష్టంగా ఉండడం, నాలుగున్నర ఏళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉండడం కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌ బాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటు పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌, బలంగా ఉన్న కాపుల ఓటు బ్యాంకుతో తాను గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. సీటు ఖరారు అయ్యిందన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ వర్గాల వారిని కలుస్తూ తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు ఉన్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ దూసుకువెళ్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన డాక్టర్‌ పాండురంగారావు మరోసారి కాంగ్రెస్‌ నుంచి పోటీకి రెడీ అవుతున్నా ఆయన పోటీ నామమాత్రమే. ఏదేమైన తునిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య‌ ట్రైయాంగిల్‌ ఫైట్‌ తప్పేలా లేదు. మరీ ఈ మూడు పార్టీల్లో ప్రధాన పార్టీలతో పాటు జనసేనకు సైతం ఇక్కడ గెలిచే ఛాన్స్‌ ఉంది. మరి తుని ముక్కోణపు సమరంలో ఫైన‌ల్‌గా ఎవరు విన్‌ అవుతారో ? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News