య‌న‌మ‌ల ఔట్ డేటెడ్.. ఆ సాహసం చేయగలరా?

య‌న‌మ‌ల రామకృష్ణుడు. టీడీపీలో రాజ‌కృష్ణుడు మాదిరిగా దాదాపు పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా చ‌క్రం తిప్పు తున్నారు. అసెంబ్లీ స్పీక‌ర్ నుంచి పార్టీలో కీల‌క‌మైన [more]

Update: 2020-06-28 12:30 GMT

య‌న‌మ‌ల రామకృష్ణుడు. టీడీపీలో రాజ‌కృష్ణుడు మాదిరిగా దాదాపు పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా చ‌క్రం తిప్పు తున్నారు. అసెంబ్లీ స్పీక‌ర్ నుంచి పార్టీలో కీల‌క‌మైన ప‌ద‌వుల వ‌ర‌కు మంత్రి వ‌ర‌కు కూడా అనేక ప‌ద‌వులు నిర్వహించారు. అదే స‌మ‌యంలో పార్టీలో చంద్రబాబుకు కుడి భుజంగా అనేక ఒడిదుడుకుల స‌మ‌యంలో అండ‌గా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ప‌ద‌వి నుంచి గ‌ద్దె దించిన‌ప్పుడు కూడా య‌న‌మ‌ల స్పీక‌ర్ స్థానంలో ఉండి బాబుకు అనుకూలంగా పెద్ద రాజ‌కీయ చాణక్యం ప్రద‌ర్శించిన నేత‌గా చ‌రిత్రలో మిగిలిపోయారు. పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి వ్యూహ‌క‌ర్తగా, పార్టీకి దిశానిర్దేశం చేసే నాయ‌కుల్లో ఒక‌రిగా య‌న‌మ‌ల రామకృష్ణుడు ఎదిగారు. టీడీపీ తరుపున తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. తుని నుంచి 1983, 85, 89, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే స్పీక‌ర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్ధిక మంత్రిగా కూడా య‌న‌మ‌ల రామకృష్ణుడు చ‌క్రం తిప్పారు.

పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ….

అయితే, 2009 ఎన్నిక‌ల్లో మాత్రం య‌న‌మ‌ల రామకృష్ణుడు ఓట‌మి పాల‌య్యారు. నిజానికి వైఎస్ హ‌వా నేప‌థ్యంలోనే ఆయ‌న ఓడిపోయారు అనుకున్నా.. ఇక‌, అప్పటి నుంచి ఇక్క‌డ య‌న‌మ‌ల హ‌వా పెద్దగా ప‌నిచేయ‌లేదు. 2004 ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి తుని నియోజ‌క‌వ‌ర్గంలో య‌న‌మ‌ల రామకృష్ణుడు ప్రాభ‌వం మ‌స‌క‌బారుతూ వ‌చ్చింది. త‌ర్వాత 2014లో ఆయ‌న సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు పోటీ చేసినా.. ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో వ‌రుస ఓట‌ములు చ‌వి చూస్తున్నారు. ఇక‌, గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న(2009లో ఓట‌మి కార‌ణంగా చంద్రబాబు య‌న‌మ‌ల‌ను పెద్దల స‌భ‌కు నామినేట్ చేసుకున్నారు) య‌న‌మ‌ల‌కు మంత్రి ప‌ద‌వి అప్పగించారు. ఇలా, ప్రభుత్వం, పార్టీలో అయితే, ఆద‌ర‌ణ ఉన్నప్పటికీ.. ప్రజ‌ల్లో మాత్రం య‌న‌మ‌ల హవా క‌నిపించ‌డం లేదు.

నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా….

అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ నియోజ‌క‌వ‌ర్గాన్ని య‌న‌మ‌ల రామకృష్ణుడు ప‌ట్టించుకోలేదు. తునిలో ఆయన సోదరుడు కృష్ణుడు చక్రం తిప్పారు. 2014-19 వ‌ర‌కు దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నా సరే, అనధికార ఎమ్మెల్యేగా కృష్ణుడు ఆధిపత్యం చెలాయించారు. పైగా పార్టీ కోసం ఎంతోమంది క‌ష్టప‌డితే వారంద‌రిని ప‌క్కన పెట్టిన య‌న‌మల 2014 ఎన్నిక‌ల్లో ఓడిన త‌న కృష్ణుడికే మార్కెట్ క‌మిటీ చైర్మన్ ప‌ద‌వి క‌ట్టబెట్టుకున్నారు. దీంతో టీడీపీ కేడ‌ర్‌లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ద‌శాబ్దాల కోసం పార్టీలో క‌ష్టప‌డిన సొంత కేడ‌ర్‌నే య‌న‌మ‌ల సోద‌రులు తీవ్రంగా విస్మరించారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు చిన్న కాంట్రాక్ట్ కూడా ఎవ్వరికి ఇవ్వని ప‌రిస్థితి. ఈ ఆధిపత్యం భరించలేకే 2019 ఎన్నికల్లో కూడా తుని ప్రజలు కృష్ణుడుని ఓడించార‌ని అంటారు.

మరొకరిని ఎదగనివ్వకుండా…..

ప్రజ‌ల విష‌యం ప‌క్కన పెడితే.. స్థానికంగా పార్టీ నాయ‌కులు కూడా య‌న‌మ‌ల కుటుంబం రాజ‌కీయాల‌పై విమ‌ర్శలు చేస్తున్నారు. పార్టీని న‌డిపించ‌డంలో వ్యూహాత్మకంగా వెళ్లడం లేద‌రి వైసీపీ నేత దాడిశెట్టికి స‌మ‌వుజ్జీగా ఉండే నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌ని, య‌న‌మ‌ల రామకృష్ణుడు కుటుంబాన్ని ఇక్కడ త‌ప్పించి కాపు సామాజిక వ‌ర్గానికి ప‌గ్గాలు అప్పగించాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, యనమల ఫ్యామిలీని దాటి చంద్రబాబు మరొకరికి టిక్కెట్ ఇవ్వలేరని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎందుకంటే య‌న‌మ‌ల ఫ్యామిలీ మ‌ర్రిచెట్టు మాదిరిగా ఊడ‌లు దించుకుని మ‌రో నేత‌ను ఎద‌గ‌నివ్వకుండా అడ్డుకుంద‌ని, ఇది కూడా ప్రజ‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌ని మండిప‌డుతున్నారు.

సీనియర్ నాయకుడు కావడంతో…

అలాగ‌ని ప‌రిస్థితిని ఇలాగే వ‌దిలేస్తే.. తునిలో టీడీపీ అడ్రస్ గ‌ల్లంతైనా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని హెచ్చరిస్తున్నారు. కాపులకు పట్టున్న చోట కాపు నాయ‌కుడిని బాధ్యత‌లు అప్పగిస్తేనే బెట‌ర‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లు జ‌రిగిందేదో జ‌రిగింది. ఇప్పటికైనా.. బాబు పున‌రాలోంచి య‌న‌మ‌ల రామకృష్ణుడు వ‌ర్గాన్ని ప‌క్కన పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి. కొస‌మెరుపు ఏంటంటే.. య‌న‌మ‌ల రామకృష్ణుడు వంటి సీనియ‌ర్ నాయ‌కుడు ఏం చెప్పినా.. త‌ల ఊపే.. చంద్రబాబు ఇప్పుడు ఆయ‌న‌ను త‌ప్పించే సాహ‌సం చేయ‌గ‌ల‌రా..?!

Tags:    

Similar News