యనమల సుద్దపూసలాగా

కోడలుకు చెప్పేందుకే అత్త నీతులు అన్నట్లు తెలుగుదేశం సీనియ‌ర్ నేత మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తాపీగా ఇపుడు సుద్దులు చెబుతున్నారు. స్పీకర్ స్థానం పవిత్రత, విశిష్టత [more]

Update: 2019-11-09 03:30 GMT

కోడలుకు చెప్పేందుకే అత్త నీతులు అన్నట్లు తెలుగుదేశం సీనియ‌ర్ నేత మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తాపీగా ఇపుడు సుద్దులు చెబుతున్నారు. స్పీకర్ స్థానం పవిత్రత, విశిష్టత గురించి యనమల రామకృష్ణుడు విడమరచి చెబుతున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో తమ్మినేని తాజాగా చంద్రబాబు గురించి మాట్లాడిన దానిపైన యనమల రామకృష్ణుడు రియాక్ట్ అయ్యారు. స్పీకర్ కి రాజకీయాలు ఎందుకు అంటున్నారు. అయితే యనమల రామకృష్ణుడును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిన టీడీపీ వ్యవస్థాపకుడు, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని ఎంత దారుణంగా 1995 ఎపిసోడ్లో పదవి నుంచి దించేశారో అందరికీ తెలిసిందే. ఆనాడు నిండు సభలో తన వాణిని వినిపిస్తానని, రాజీనామా చేసే ముందు ముఖ్యమంత్రిగా తాను ఎందుకు దిగిపోతున్నానో చెప్పాలని అన్న గారు చేసిన ప్రయత్నాలను వమ్ము చేసింది స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు అని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీయార్ విషయమే కాదు, అయిదేళ్ళ పాటు యనమల రామకృష్ణుడు సభను నడిపిన తీరు కూడా నాటి సీఎం చంద్రబాబుకు మద్దతుగానే సాగిందని కూడా ప్రచారంలో ఉంది. సీన్ కట్ చేస్తే అయిదేళ్ళ నవ్యాంధ్ర తొలి పాలనలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ సైతం అధికార కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకునేవారు. ఆయన సైతం పసుపు చొక్కా ధరించి జై చంద్రబాబు అనేవారు. ఇక అసెంబ్లీలో కోడెల విపక్షం గొంతు నొక్కిన ఘటనలు గత అయిదేళ్ళలో ఎన్నో ఉన్నాయని అందరూ అంటారు.

విలువలు ఉంచారా…?

స్పీకర్లుగా పనిచేసిన వారిలో అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. సభా నాయకుడు తప్పుగా మాట్లాడినా మందలించే ధైర్యం వారి సొంతం. అధికార పక్షం, ప్రతిపక్షం అని కాదు ప్రజాపక్షంగా నాటి స్పీకర్లు ఉండేవారు. కనుకనే గందరగోళాలు, సభలో అరుపులు అల్లర్లు లేకుండా సజావుగా సభ సాగిపోయేది. ఇక తరువాత కాలంలో స్పీకర్లు పూర్తిగా రాజకీయ ధోరణులను అలవాటు చేసుకుని వచ్చిన వారే. వారు ఎంతసేపూ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ కొనసాగినవారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉంటారు. మరి అలా స్పీకర్ల వ్యవస్థకు మచ్చ తెచ్చిన ఘనత నాటి టీడీపీ హయాంలోనూ సాగిందని చెప్పాలి. అన్నీ తెలిసిన యనమల రామకృష్ణుడు ఇపుడు స్పీకర్లు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ తమ్మినేని సీతారాంకి నీతులు చెప్పడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు.

సీటుకు గౌరవం తేవాలి…

ఇక ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా చంద్రబాబు మీద చేసిన కామెంట్స్ కూడా మెచ్చతగినవి కావు. ఆయన తాను మొదట ఎమ్మెల్యేను, తరువాత స్పీకర్ ని అంటున్నారు. కానీ ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్నాక ఆయన అందరి వారు అవుతారు. రాజకీయాలకు అతీతంగానే వ్యవహించాల్సి వుంటుంది. సభ బయట విపక్షాన్ని నిందించి సభలోపల న్యాయంగా బిజినెస్ రూల్స్ కి అనుగుణంగా రూలింగ్ ఇచ్చినా కూడా విపక్షంతో పాటు జనాలు కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పాతది కొత్తది కలిపి చూసే రాజకీయాన్ని నాయకులే అలవాటు చేశారు కాబట్టి. అది స్పీకర్ గా బాధ్యతల నిర్వహణకు కూడా తమ్మినేని వంటి వారికి ఇబ్బందులను కలుగచేస్తుంది. అందువల్ల తమ్మినేని వంటి మేధావులు కూడా పాత రొచ్చు విధానాలనే అనుసరించకుండా స్పీకర్ విలువను నిలబెట్టాలనే అంతా కోరుకుంటారు. ఆ ఛైర్లో ఉన్నది తమ్మినేని కాదు స్పీకర్ అన్న ఆలోచన వచ్చేలా ఆయన వ్యవహరించడమే ప్రజాస్వామ్యానికి కూడా మేలు అంటున్నారు.

Tags:    

Similar News