యనమల అంగీకారం లేకుంటే…?

ఎమ్యెల్యేగా,మునిసిపల్ మంత్రిగా, ఆర్ధిక రెవెన్యూ మంత్రిగా, వాణిజ్యపన్నుల మంత్రిగా, స్పీకర్ గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా అనేక పదవుల్లో టిడిపి స్థాపించిన నాటినుంచి ఆయన [more]

Update: 2019-07-22 08:00 GMT

ఎమ్యెల్యేగా,మునిసిపల్ మంత్రిగా, ఆర్ధిక రెవెన్యూ మంత్రిగా, వాణిజ్యపన్నుల మంత్రిగా, స్పీకర్ గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా అనేక పదవుల్లో టిడిపి స్థాపించిన నాటినుంచి ఆయన హవాకు తిరిగే లేదు. ఆయనే యనమల రామకృష్ణుడు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడుకు కట్టని కోట లాంటిది. టిడిపి కి గ్యారంటీ విజయం అందిస్తూ వచ్చే సీటు. ప్రస్తుతం ఎమ్యెల్సీ గా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుకు 2025 వరకు పదవీకాలం వుంది. అయినప్పటికి ఆయన సొంత నియోజకవర్గంలో ప్రభావాన్ని కోల్పోయి మొన్నటి సార్వత్రిక ఎన్నికలతో కలిపి పదేళ్ళు అయ్యింది.

రెండు సార్లు హ్యాట్రిక్ ….

ప్రత్యక్ష రాజకీయాల్లో 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు అంటే రెండు సార్లు హ్యాట్రిక్ విజయాలు వరుసగా నమోదు చేస్తూ వచ్చిన యనమల తొలిసారి 2009 న వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహంతో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి 2004 లోనే వైఎస్ గాలిలో కొట్టుకు పోవాలిసిన యనమల రామకృష్ణుడు మూడువేల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఆ తరువాత ఎన్నికల్లో మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు తలలో నాలుక గా వుండే యనమల రామకృష్ణుడుకు గట్టి షాక్ నే ఇచ్చారు. ఆ దెబ్బతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. నియోజకవర్గ బాధ్యతలు తమ్ముడు కృష్ణుడికి అప్పగించి ఎమ్యెల్సీ గా రెండు సార్లు మండలికే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.

రెండుసార్లు సోదరుడి పరాజయం తో …

యనమల రామకృష్ణుడు 2009 లో ఓటమితో సోదరుడిపైనే బాధ్యతలు ఉంచి 2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దింపారు. టిడిపి ప్రభుత్వాల్లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు అనేక కీలక పదవులను నిర్వర్తించినా సొంత నియోజకవర్గం అభివృద్ధిలో యనమల రామకృష్ణుడు చేసింది పెద్దగా ఏమి లేదన్న అసంతృప్తి తుని నియోజకవర్గ ఓటర్లలో అప్పటికే ప్రబలంగా ఉండిపోయింది. యనమల రామకృష్ణుడు పై కన్నా అయన సోదరుడిపై సదభిప్రాయం లేకపోవడంతో తుని ప్రజలు ఆ కుటుంబాన్ని దూరం పెట్టాలనే నిర్ణయమే తీసుకున్నారు. దాంతో యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసిపి అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో 2014 – 2019 ఎన్నికల్లో వరుస గా పరాజయాల పాలై అన్న పరువు తీశారు. 14 ఎన్నికల్లో 18 వేల ఓట్ల మెజారిటీ తో 19 ఎన్నికల్లో 24 వేల ఓట్ల మెజారిటీతో యనమల రామకృష్ణుడు సోదరుడు ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు.

హ్యాట్రిక్ పరాజయాలు…

2009 లో వైఎస్ రూపంలో 2014 నుంచి వైఎస్ జగన్ రూపంలో యనమల రామకృష్ణుడు కుటుంబ సైకిల్ స్పీడ్ కు బ్రేక్ పడింది. దాంతో ఈ నియోజకవర్గంలో ఆ కుటుంబం నుంచి కాకుండా కొత్త వారిని రంగంలోకి దింపాలిసిన పరిస్థితి టిడిపికి ఇప్పుడు ఏర్పడింది. మరో ఐదున్నరేళ్ళు యనమల రామకృష్ణుడుకు ఎమ్యెల్సీ గా పదవీకాలం ఉండటం తో ప్రస్తుతానికి ఆయన రాజకీయ భవిష్యత్తు కి ఢోకా లేనప్పటికి పార్టీ భవిష్యత్తు ఈ నియోజకవర్గంలో డీలా పడిపోయిందన్నది పసుపు పార్టీకి అందుతున్న సమాచారం.

వారిని తప్పించే సాహసం చేయలేరా …?

అయితే పార్టీలో వున్నవారే పక్క పార్టీ లోకి పోతున్న నేపథ్యంలో కొత్తవారికి తుని బాధ్యతలు అప్పగించే సాహసం చంద్రబాబు చేసేందుకు సిద్ధంగా లేరన్నది టిడిపి శ్రేణుల్లో వినిపిస్తుంది. పాత వారికే దశాబ్దాలుగా టికెట్లు ఇచ్చి ఆదరిస్తూ ఉండటం వల్ల పార్టీలోని ద్వితీయ శ్రేణి ఎన్నికల్లో మిన్నకుండి పోవడం ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో ఓటమి కి దారితీసిందన్నది టిడిపి కి అందుతున్న సమాచారం. కొత్త రక్తం ఎక్కిస్తే కానీ తుని లో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదని తెలిసినాయనమల రామకృష్ణుడు అంగీకరిస్తే కానీ మరమ్మత్తులు చేసేందుకు అధినేత సాహసం చేయలేరని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News