య‌న‌మ‌ల హ‌వాకు బ్రేకులేస్తున్న జ‌గ‌న్‌.. ఇలా

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌తో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు చెక్ పెడుతున్నారా ? [more]

Update: 2020-08-01 12:30 GMT

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌తో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు చెక్ పెడుతున్నారా ? య‌న‌మ‌ల హ‌వాకు బ్రేకులు వేయ‌నున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. తాజాగా జిల్లాల ప్రతిపాద‌న‌తో అనేక మంది నేత‌ల రాజ‌కీయ‌ రూపురేఖ‌లు మారిపోనున్నాయి. కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, కీల‌కమైన నేత‌ల పేర్లు పెడ‌తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయ‌న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డంపై క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

మూడు జిల్లాలుగా…..

ఈ నేప‌థ్యంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావ‌రి మూడు జిల్లాలుగా ఏర్పాటు కానుంది. కాకినాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం, రాజ‌మండ్రి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం, కోన‌సీమ‌లోని అమలాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప్రాతిప‌దిక‌న జిల్లాలు ఏర్పడ‌నున్నాయి. ఫ‌లితంగా ఇప్పటి వ‌ర‌కు ఈ జిల్లాలో చ‌క్రం తిప్పుతున్న కీల‌క టీడీపీ నాయ‌కుడు, సైలెంట్‌గా జిల్లాను శాసిస్తున్న మాజీ ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు హ‌వా కోల్పోతార‌నే ప్రచారం ఊపందుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీకి కంచుకోట‌గా మార్చిన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌ర్వాత కాలంలో జిల్లా మొత్తంగా త‌న హ‌వాను చ‌లాయిస్తున్న విష‌యం తెలిసిందే.

వైసీపీకి పట్టు ఉండటంతో……

అయితే, రేపు కాకినాడ జిల్లా ఏర్పడితే.. తుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఈ జిల్లా ప‌రిధిలోకి చేర‌నుంది. ఫ‌లితంగా ఇక్కడ బ‌లంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పుతారే త‌ప్ప.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు దాదాపు కాకినాడ జిల్లాపై ప‌ట్టును సాధించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. కాకినాడ ఎంపీ నియ‌జ‌క‌వ‌ర్గం స‌హా కాకినాడ రూర‌ల్‌, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్ సీపీ గ‌ట్టి ప‌ట్టు పెంచుకుంది. జిల్లాల విభ‌జ‌న జ‌రిగితే కోన‌సీమ‌లోని అమ‌లాపురం పార్లమెంటు ప‌రిధిలో ఉన్న స్థానాలు అన్ని అమ‌లాపురం కేంద్రంగా ఏర్పడే కోన‌సీమ జిల్లాలోకి వెళ్లిపోతాయి.

శాసించిన ప్రాంతంలో…..

ఇక రాజ‌మండ్రి జిల్లా తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల‌తో ఏర్పడుతుంది. దీంతో ఈ రెండు జిల్లాల వాళ్లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని త‌మ జిల్లా రాజ‌కీయాల్లో వేలు పెట్టనివ్వరు. ఇక య‌న‌మ‌ల కాకినాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ప‌రిమిత‌మైన ఆయ‌న‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌ట్టులేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఉమ్మడి తూర్పుగోదావ‌రిని శాసించిన ఆయ‌న ఇప్పుడు చివ‌ర‌కు త‌న జిల్లా, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా త‌న మాట నెగ్గించుకోలేని స్థితికి ప‌డిపోవ‌డం ఖాయం. పైగా కాకినాడ లోక్‌స‌భ ప‌రిధిలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. వైసీపీ ఈ లోక్‌స‌భ ప‌రిధిలోని కాకినాడ రూర‌ల్‌, పెద్దాపురం, తుని, జ‌గ్గంపేట‌, ప్రత్తిపాడు, పిఠాపురం సీట్లు కాపు వ‌ర్గానికి, కాకినాడ సిటీ రెడ్డి వ‌ర్గానికి కేటాయించింది.

ఇక నామమాత్రమే…

బ‌ల‌మైన కాపు నేత‌ల‌ను త‌ట్టుకుని అక్క‌డ పార్టీని నిల‌బెట్టడం య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి క‌ష్టమే. రేపో మాపో అక్కడ టీడీపీ ప‌గ్గాలు కూడా కాపు వ‌ర్గానిక ఇవ్వాల్సి ఉంది. అప్పుడు య‌న‌మ‌ల పాత్ర స్థానికంగా కూడా మ‌రింత నామ‌మాత్రం అవుతుంది. ఏదేమైనా జిల్లాల విభ‌జ‌న‌తో య‌న‌మ‌ల‌కు చెక్ ప‌డ‌డం, రాజ‌కీయంగా ఆయ‌న వ్యూహాల‌కు బ్రేక్ ప‌డ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Tags:    

Similar News