పాత పురాణాలేల యనమలా?

రాష్ట్రంలో ఇపుడు ఐటీ దాడులు రాజకీయ కాక రేపుతున్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో సోదాలతో పాటు, టీడీపీ భావి వారసుడు లోకేష్ సన్నిహితుల [more]

Update: 2020-02-15 09:30 GMT

రాష్ట్రంలో ఇపుడు ఐటీ దాడులు రాజకీయ కాక రేపుతున్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో సోదాలతో పాటు, టీడీపీ భావి వారసుడు లోకేష్ సన్నిహితుల ఇళ్ళలోనూ పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ మొత్తం దాడుల నుంచి రెండు వేల కోట్లు లెక్కా పత్రం లేని నగదుని గుర్తించామని ఐటీ అధికారులు ప్రకటించారు. దీని మీద వైసీపీ గట్టిగానే తగులుకుంటోంది. దొరికిందే చాన్స్ అన్నట్లుగా మంత్రులు, సామంతుల నుంచి వైసీపీ నేతలంతా పూనకంతో ఊగుతున్నారు. చంద్రబాబు పాపాలు పండాయని, ఇక జైలే గతి అంటూ జోస్యాలు చెబుతున్నారు.

యనమల డిఫెన్స్….

రాజకీయాలకు రాకముందు చదివిన న్యాయవిద్యను టీడీపీని, అధినాయకుడిని కాపాడే విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎపుడూ బాగా ఉపయోగిస్తారు. బహు గొప్పగా డిఫెన్స్ చేయడంలోనూ ఆయన దిట్టే. చంద్రబాబు మీద నాడు వైఎస్సార్ హయాంలో పాతిక కేసులు పెట్టారని, విచార‌ణ జరిపినా ఏమీ చేయలేకపోయారని పాత రికార్డునే యనమల రామకృష్ణుడు మళ్ళీ వేశారు. బాబు నిప్పు అని ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరని కూడా గట్టిగా చెప్పారు. అది సరే అనుకున్నా నాటి కేసులలో బాబు అనేకం స్టేలు తెచ్చుకున్నవే ఉన్న విషయాన్ని యనమల రామకృష్ణుడు మరచిపోయారని అంటున్నారు. అందులో ఒక కేసు స్టే దశ దాటి లక్ష్మీ పార్వతి వేసిన దాంట్లో ఏసీబీ కోర్టులో విచారణకు కూడా సిధ్ధంగా ఉందన్నదీ యనమల వారు బయట‌కు చెప్పడంలేదు.

అయిదేళ్ళ సంగతేంటి…?

యనమల రామకృష్ణుడు చెప్పిన‌ట్లుగానే బాబు మీద వైఎస్సార్ ఏ విధమైన ఆరోపణలూ రుజువు చేయలేకపోయారని అనుకున్నా, అది మొత్తం ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు ఉన్నప్పటి కధ. కట్ చేస్తే అయిదేళ్ళ క్రితం బాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఈ సమయంలోనే కదా ఆయన వద్ద శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు ఏ అవినీతికి పాలుపడలేదు అనుకున్నా ఈ అయిదేళ్ల మాటేంటి. అమరావతి రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్, పోలవరం టెండర్లలో అవినీతి అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల సంగతేంటి. మరి పాత కధలు వదిలేసినా ఈ అయిదేళ్ళ జమానాలో వచ్చిన ఆరోపణలపైన అయినా విచారణ జరగాలి కదా. మరి దానికి కూడా ఆవు కధలా వైఎస్సార్ హయాం అంటూ ఎప్పటి మాటలో చెప్పి యనమల రామకృష్ణుడు వితండ వాదన చేయడమేంటని వైసీపీ నేతలు అంటున్నారు.

లాజిక్ తప్పారా…?

తన వ్యక్తిగ కార్యదర్శిగా కొన్నాళ్ళ పాటు పనిచేసిన ఒక వ్యక్తి మీద ఐటీ దాడులు జరగడం, అక్కడ లెక్కా జమా లేని పెద్ద మొత్తం నగదు పట్టుబడితే బాబుకేంటి సంబంధం అని యనమల రామకృష్ణుడు అనడం విడ్డూరమేనని అంటున్నారు. బాబు పీఏగా ఉంటూ అంతంత ఆస్తులు పోగు చేసుకుంటే బాబుకు తెలియకపోతే ఆయన‌ అసమర్ధ పాలకుడు అనుకోవాలి. తెలిసి జరిగితే బాధ్యత వహించాలి. మరి ఈ రెండూ కాదంటూ మా బాబు బంగారం, ఆయనకేం సంబంధం అంటూ యనమల రామకృష్ణుడు వారు పెద్ద వకీల్ సాబ్ లా మద్దతు ఇస్తూండడమే ఇక్కడ అసలైన వింత అంటున్నారు. ఏది ఏమైనా ఐటీ దాడులతో టీడీపీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడిందన్నది వాస్తవం. మరి దాని మీద యనమల రామకృష్ణుడు చేస్తున్న వాదన కూడా మరింత అయోమయంగా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News