యనమలకూ బాబు ఝలక్ ?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు, న్యాయవాదిగా ఉన్న యనమలను రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేయడమే కాదు అనేక కీలకమైన పదవులు ఇచ్చిన ఘనత [more]

Update: 2020-06-23 11:00 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు, న్యాయవాదిగా ఉన్న యనమలను రాజకీయాల్లోకి తెచ్చి మంత్రిని చేయడమే కాదు అనేక కీలకమైన పదవులు ఇచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీయార్ ది. ఇక యనమల రామకృష్ణుడు ఆది నుంచి చంద్రబాబు రూట్లో, గూట్లో ఉంటూ వచ్చారు. దాంతో ఆయన రోశయ్య తరువాత ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా పేరు సంపాదించారు. ఇక యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్ తో పాటు, శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు వహించారు. టీడీపీలో పొలిటి బ్యూరో మెంబర్ గా సుదీర్ఘకాలం నుంచి ఉంటూ వస్తున్న యనమలకూ బాబు ఝలక్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వస్తుంది.

ఆ ఒక్కటీ తప్ప…..

యనమల రామకృష్ణుడికి ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో అన్ని పదవులు అనుభవించిన తరువాత కోరికలు ఏమైనా ఉంటాయా అంటే మామూలుగా ఉండకూడదు, కానీ తనకు కూడా తీరని కోరికలు ఉన్నాయని యనమల ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు రాజ్యసభ మెంబర్ గా ఉండాలన్నది కోరికగా యనమల రామకృష్ణుడు స్వయంగా చెప్పుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ అధి‌కారంలోకి వచ్చిన దగ్గరనుంచి యనమల రామకృష్ణుడు పెద్దల సభ మీద కన్నేశారు. ఆయనకు అప్పటికే తుని నియోకవర్గంలో పట్టు జారింది. అక్కడ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. దాంతో యనమల ఇక ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజ్యసభకు పోదామనుకున్నారు. అయితే బాబు ఆయన్ని ఆర్ధిక మంత్రిగా చేసి ఎమ్మెల్సీగా పంపించారు. అలా యనమల రామకృష్ణుడు అనుభవం బాబు వాడుకున్నారు. కానీ యనమలకు మాత్రం కోరిక తీరలేదు.

అపుడు కూడా…..

ఇక యనమల రామకృష్ణుడు టీడీపీ విభజన ఏపీలో తన అనుభవాన్ని ఉపయోగించి కొంత గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం చివరి ఛాన్స్ గా ఆయన రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. దాంతో యనమల రామకృష్ణుడు శాసనమండలి మెంబర్ గానే ఉండిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దాంతో 2024 నాటికి టీడీపీ అధికారంలోకి వస్తేనే యనమల కోరిక నెగ్గేది. అయితే తన కోరిక తీరదని గట్టి నమ్మకానికే యనమల రామకృష్ణుడు వచ్చేశారు. ఇప్పటికే నాకు డెబ్బయి ఏళ్ళు. ఇక మీదట యువకులకే అవకాశాలు ఇవ్వాలి అంటూ నిరాశను కూడా అందమైన ముగింపుగానే చెప్పుకున్నారు.

ఆ పదవి కోసమా….?

ఇక యనమల రామకృష్ణుడు టీడీపీలో సీనియర్ నేత. ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేయాలన్న డిమాండ్ ఉంది. అయితే చంద్రబాబు ఆ పని మాత్రం చేయరని అంటారు. ఎందుకంటే ఆయన తెలివిని శాసనసభా సమావేశాలకు వాడుకుంటారు, అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కూడా యనమల రామకృష్ణుడు తెలివితోనే బాబు సభను నెట్టుకువస్తారు. కానీ యనమలకు మాత్రం పార్టీలో ఆ కీలకమైన పదవి దక్కదని అంటున్నారు. దీని మీద కూడా యనమల మాట్లాడుతూ తనకు పార్టీలో పెద్ద పదవుల మీద ఆసక్తి లేదనేశారు. మొత్తానికి శాస‌నమండలి రద్దు అయితే తెర వెనక ఉంటూ టీడీపీకి ఒక సలహాదారుగా ఉంటాను అని యనమల రామకృష్ణుడు అంటున్నారు. అంటే ఎంత నమ్మినట్లు కనిపించినా కూడా చంద్రబాబు యనమల లాంటి అతి ముఖ్య సన్నిహితుని కోరికలను కూడా తీర్చలేకపోయారన్న మాట.

Tags:    

Similar News