వైసీపీ లీడర్ టైం ఫుల్ బ్యాడ్

రాజ‌కీయాల్లో వార‌సులు చాలా మంది వ‌చ్చారు. కొంద‌రు స‌క్సెస్ అయ్యారు. మ‌రికొంద‌రు విఫ‌ల‌మ‌య్యారు. అయితే, అటు స‌క్సెస్ అయి.. మ‌ళ్లీ విఫ‌లం దిశ‌గా అడుగులు వేస్తున్న నాయ‌కులు [more]

Update: 2019-11-26 14:30 GMT

రాజ‌కీయాల్లో వార‌సులు చాలా మంది వ‌చ్చారు. కొంద‌రు స‌క్సెస్ అయ్యారు. మ‌రికొంద‌రు విఫ‌ల‌మ‌య్యారు. అయితే, అటు స‌క్సెస్ అయి.. మ‌ళ్లీ విఫ‌లం దిశ‌గా అడుగులు వేస్తున్న నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవ‌లో విజ‌య‌వాడ‌కు చెందిన ఇద్దరు కీల‌క నాయ‌కులు మ‌న‌కు స్పష్టంగా క‌నిపిస్తున్నారు. వారిలో ఒక‌రు వంగ‌వీటి రాధాకృష్ణ, మ‌రొక‌రు య‌ల‌మంచిలి ర‌వి. వంగ‌వీటి రంగా వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చి.. 2004లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన రాధా త‌ర్వాత వేసిన అడుగులు ఆయ‌న‌కు రాజ‌కీయంగా పెను స‌వాళ్లనే మిగిల్చింది. దీంతో ఆయ‌న ఇప్పటి వ‌రకు కోలుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది.

రాజకీయంగా దెబ్బతిని….

ఎన్నిక‌ల‌కు ముందు వేసిన ఒకే ఒక్క అడుగు మ‌రింత‌గా దెబ్బతీసింది. స‌రే వంగ‌వీటి విష‌యాన్ని ప‌క్కన పెడితే.. య‌ల‌మంచిలి ర‌వి గురించి ఇప్పుడు విజ‌య‌వాడ‌లో భారీగా చ‌ర్చ జ‌రుగుతోంది. య‌ల‌మంచిలి నాగేశ్వర‌రావు త‌న‌యుడిగా రాజ‌కీయ అరంగే ట్రం చేసిన య‌ల‌మంచిలి ర‌వి.. ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు నాగేశ్వర‌రావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. పేద‌ల దేవుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత యలమంచిలి ర‌వి రాజకీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు 2009లో టికెట్ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీలో చేరి టికెట్ సంపాయించు కుని విజ‌య‌వాడ‌ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.

టీడీపీలో చేరినా…..

కేవ‌లం 190 ఓట్ల మెజారిటీతో య‌ల‌మంచిలి ర‌వి గెలుపు గుర్రంఎక్కారు. ఆ ఎన్నిక‌ల్లో యలమంచిలి ర‌వి ఇద్దరు రాజ‌కీయ ఉద్దండులు అయిన దేవినేని నెహ్రూ, గ‌ద్దె రామ్మోహ‌న్‌ను ఓడించారు. అయితే, అప్పట్లో పీఆర్పీ అధికారంలోకి రాలేదు. పైగా మ‌ధ్యలోనే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో యలమంచిలి ర‌వి మౌనంగానే ఉండిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంబించారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీలు పోటీ చేశాయి. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత య‌ల‌మంచిలి ర‌వి మ‌ళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న తూర్పు సీటుపై క‌న్నేశారు. ఎలాగూ త‌న‌కు ఇక్కడ అనుచ‌ర గ‌ణం ఉంది కాబ‌ట్టి టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే, అప్పటికే ఉన్న సిట్టింగ్ గ‌ద్దె రామ్మోహ‌న్‌ను మ‌ర్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో చంద్రబాబు మౌనం వ‌హించారు.

వైసీపీలోనూ సీటు దక్కక….

టీడీపీలో అవ‌మానాలు భ‌రించ‌లేక యలమంచిలి ర‌వి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టికెట్‌పై ఆశ‌తోనే ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చారు. అయితే, అనూహ్యంగా ఈ టికెట్ విష‌యంలో ఎంపీ అభ్యర్థి పీవీపీ జోక్యం చేసుకోవ‌డంతో యలమంచిలి ర‌వికి ద‌క్కకుండా పోయింది. దీంతో యలమంచిలి ర‌వి తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యారు. ఇప్పటికే ఆయ‌న‌కు కేడ‌ర్ కూడా దాదాపు దూర‌మైంది. చేతిలో ఏ ప‌ద‌వీ లేదు. ఉన్న పార్టీలోనూ పెద్దగా గుర్తింపు లేక‌పోవ‌డం, కేడ‌ర్ దూరంకావ‌డం, తూర్పు వైసీపీలో ఇటీవ‌ల పోటీ చేసిన బొప్పన భ‌వ‌కుమార్‌కు త‌న‌కు మ‌ధ్య పొస‌గ‌క‌పోవ‌డం, మ‌రోప‌క్క, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్పటి వ‌ర‌కు క‌నీసం మాట మాత్రంగా కూడా త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో యలమంచిలి ర‌వి త‌ల్లడిల్లుతున్నారు.

అవినాష్ చేరికతో…..

ఇక మ‌రో షాకింగ్‌గా దేవినేని అవినాష్‌ను పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్ ఆయ‌న‌కే తూర్పు ప‌గ్గాలు ఇస్తారంటున్నారు. అప్పుడు బొప్పన భ‌వ‌కుమార్‌కు విజ‌య‌వాడ మేయ‌ర్ లేదా మ‌రో నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వవ‌చ్చని టాక్‌. అదే జ‌రిగితే యలమంచిలి ర‌వికి పార్టీలో అస‌లు గుర్తింపే ఉండ‌దు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయంగా ఎలాంటి అడుగు వేయాలా ? అని ఆయ‌న చ‌ర్చిస్తున్నట్టు తెలిసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కాగా, రెండు రోజుల కింద‌ట జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయ‌త్నించ‌గా.. ఫ‌లితం క‌నిపించ‌లేద‌ని, పీవీపీ మ‌నుషులు అడ్డు తగులుతున్నార‌ని యలమంచిలి ర‌వి అనుచ‌రులు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News