బయటకు రావడం లేదెందుకో?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఆటు పోట్లు వ‌స్తాయో చెప్పడం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితినైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం అనేది నాయ‌కుల‌కు ఉండాల్సిన ప్రధాన ల‌క్షణం అంటారు సీనియ‌ర్లు. [more]

Update: 2020-01-05 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ఆటు పోట్లు వ‌స్తాయో చెప్పడం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితినైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం అనేది నాయ‌కుల‌కు ఉండాల్సిన ప్రధాన ల‌క్షణం అంటారు సీనియ‌ర్లు. అయితే, దీనికి భిన్నంగా కొంద‌రు చాలా సున్నిత మ‌నస్కులు ఉంటారు. వారు దూకుడుగానే ఉన్నా కూడా మ‌న‌సు త‌ట్టుకోలేని విమ‌ర్శలు ఎదురైన‌ప్పుడు.. మౌనంగా నిష్క్రమిస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా క‌నిపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌. ఆయ‌న టీడీపీలోనే రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకున్నారు.

మీడియాలో నిత్యం….

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయ‌న అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డ్డారు. పార్టీలో నాయ‌కుల‌కు కూడా ఆయ‌న త‌లలో నాలుక‌గా ఉంటార‌నే పేరుంది. ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో రాజేంద్ర ప్రసాద్ నేరుగా పాల్గొని విజ‌యం సాధించ‌క‌పోయినా చంద్రబాబు ఆయ‌న‌కు ఎప్పటిక‌ప్పుడు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తూ ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తున్నారు. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం, సీనియ‌ర్‌గా పార్టీలో సూచ‌న‌లు.. స‌ల‌హాలు ఇస్తుండ‌డం, వివాద ర‌హితుడిగా ఉండడం.. ప్రతిప‌క్షాలు చేసే విమ‌ర్శల‌కు ఘాటుగా జ‌వాబిచ్చే త‌త్వం నిత్యం మీడియాలో ఉంటూ పార్టీ ప‌క్షాన గ‌ట్టి వాయిస్ వినిపిస్తుండ‌డంతో చంద్రబాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి గౌర‌వించారు.

వంశీ కామెంట్స్ తో….

చంద్రబాబు ఇచ్చిన ప‌ద‌వికి వ‌న్నెతెస్తూ పార్టీ ప‌క్షాన వాయిస్ వినిపించ‌డంతో జిల్లాలోనే ముందున్న య‌ల‌మంచిలి రాజేంద్ర ప్రసాద్ సునిశిత మ‌న‌స్కుడిగా పేరుంది. ప‌రుషంగా వ్యాఖ్యలు చేయ‌డం ఆయ‌న హిస్టరీలోనే లేదు. అయితే, ఇటీవ‌ల టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ పై బాబూ రాజేంద్రప్ర‌సాద్ ఓ టీవీ ఛాన‌ల్ లైవ్ షోలో కొన్ని ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో అప్పటిక‌ప్పుడే లైవ్‌లోకి వ‌చ్చిన వంశీ.. ఒక్కసారిగా బాబూ రాజేంద్రప్రసాద్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌రుషంగా మాట్టాడారు. నీకు విశ్వాసం కూడా లేదు. నీ కూతురు పెళ్లిని నేను, బోడే ప్రసాద్ వ‌చ్చి రు. 25 ల‌క్షలు ఇచ్చాము…. అది కూడా గుర్తు పెట్టుకోకుండా మాట్లాడుతున్నావు.. అంటూ.. ఆయ‌న‌పై ప‌చ్చి బూతుల‌తో విరుచుకుప‌డ్డారు.

తనకు మద్దతు తెలపక పోవడంతో….

ఇది అప్పట్లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. అయితే, ఇలా వ్యక్తిగత విమ‌ర్శలు చేయ‌డంపై బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా నొచ్చుకున్నారు. ఇంతింత మాట‌లు అన్న వంశీపై ప్రతి విమ‌ర్శలు చేసేందుకు లేదా చ‌ర్యలు తీసుకునేందుకు పార్టీ ప‌రంగా ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆ త‌ర్వాత బోడే ప్రసాద్ రెండు రోజుల‌కు దీనిపై ఖండ‌న ఇచ్చినా అప్పటికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

రాజధాని విషయంలోనూ….

పార్టీ కోసం తాను ఎంతో చేస్తున్నా… ఇంత దూష‌ణ‌లు ఎదుర్కొంటున్నా ఎవ‌రి స్వార్థాలు వారు చూసుకున్నార‌ని కూడా ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద ఆవేద‌న వ్యక్తం చేశార‌ట‌. వంశీ ఇష్యూ త‌ర్వాత ఇక‌, పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు పెద్దగా ఆయ‌న ఇష్టప‌డ‌డం లేదు. ఫ‌లితంగా గ‌తంలో త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చే బాబూ రాజేంద్రప్రసాద్ అప్పటి నుంచి మీడియా ముఖం కూడా చూడ‌డంలేదు. టీడీపీ వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. అమరావతి రాజధాని అంశంపైన కూడా రాజేంద్ర ప్రసాద్ పెదవి విప్పలేదు. సో.. మొత్తంగా వంశీ ఎఫెక్ట్‌తో రాజేంద్రప్రసాద్ సైలెంట్ అయిపోయారు.

Tags:    

Similar News