ఎంతపని చేశావయ్యా….?

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డంగానే బుక్కయ్యేటట్లుంది. ఆడియో టేపుల వివాదాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించారు. పదిహేను రోజుల్లో [more]

Update: 2019-02-13 16:30 GMT

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డంగానే బుక్కయ్యేటట్లుంది. ఆడియో టేపుల వివాదాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించారు. పదిహేను రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిద్ధరామయ్య, కుమారస్వామి కలసి పన్నిన వ్యూహం కమలానికి షాక్ తగిలేలా ఉంది. లోక్ సభ ఎన్నికల వేళ ఇది తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు భావిస్తున్నాయి.

సిద్ధూ వల్లనే…..

గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కుమారస్వామికి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు యడ్యూరప్ప కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యడ్యూరప్ప ఏదో ఒక ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వారిని జారిపోనివ్వకుండా కాపాడుకోగలిగారు. అయినా నలుగురు ఎమ్మెల్యేలు గీత దాటి వెళ్లిపోయారు.

బీజేపీ నేతల్లో భయం….

మ్యాజిక్ ఫిగర్ కు సంకీర్ణ సర్కార్ దగ్గరగా చేరుకోవడంతో సిద్ధరామయ్య, కుమారస్వామి అప్రమత్తమయ్యారు. యడ్యూరప్పను నిలువరించేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటుపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఈ అంశంలో ముఖ్యమంత్రి కుమారస్వామి జోక్యం ఉండటంతో సిట్ తమను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని బీజేపీ నేతల్లో భయం బయలుదేరింది. అందుకే వారు సిట్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరూ కలసిపోయారు….

మరోవైపు నిన్న మొన్నటి వరకూ సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన కుమారస్వామి సయితం కొంత వెనక్కు తగ్గారు. సిద్ధరామయ్య చెప్పినట్లుగానే ప్రభుత్వం నడుస్తుందని ఆయన బహిరంగంగా ప్రకటించడం విశేషం. సిద్ధరామయ్య తమ నాయకుడని కుమారస్వామి ప్రకటించి కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఇలా యడ్యూరప్ప చేసిన తప్పిదంతో నిన్నటి వరకూ నిప్పు, ఉప్పులా ఉన్న కుమారస్వామి, సిద్ధరామయ్యలు ఒక్కటయ్యారు. మొత్తం మీద పదిహేను రోజుల్లో సిట్ సమర్పించే నివేదికలో ఏముంటుందోనని యడ్యూరప్ప కు కంటిమీద కునుకులేకుండా పోయింది.

Tags:    

Similar News