ఎదురులేని యడ్యూరప్ప

Update: 2018-04-12 17:30 GMT

బీఎస్ యడ్యూరప్ప... భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు కాదు. కనీసం ఢిల్లీ రాజకీయాల్లో తెరవెనుక మంత్రాంగం నడిపేంత తెలివితేటలున్న నాయకుడూ కాదు. ఆయన ప్రజాక్షేత్రమంతా రాష్ట్రమే. అయినప్పటికీ బీజేపీ శ్రేణులకు ఆయన పేరు అత్యంత సుపరిచితం. అందుకు కారణాలు లేకపోలేదు. దక్షిణాదిన ప్రజాదరణగల అతికొద్ది మంది నాయకుల్లో యడ్యూరప్ప ఒకరు. దక్షిణాది పేరు చెప్పగానే పార్టీకి ఆయన పేరే గుర్తుకు వస్తుంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పెద్దగా ఉనికి లేదు. వాస్తవానికి యడ్యూరప్ప కర్ణాటక నాయకుడయినప్పటికీ ఢిల్లీ పెద్దలతో గట్టి సంబంధాలున్నాయి. కర్ణాటక పరంగా చూస్తే పార్టీకి ఆయనే పెద్దదిక్కు. ఆయనకు తెలియకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాలు నడవవు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర పార్టీలో ఆయన మాటే వేదం. దానికి తిరుగులేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చక్రం తిప్పిన యడ్యూరప్ప సుదీర్ఘ అనుభవజ్ఞుడు. కమలం పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.

పార్టీ నియమావళికి విరుద్ధంగా....

అందువల్లే జాతీయ నాయకత్వం యడ్యూరప్పకు రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించింది. టిక్కెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకూ ప్రతి విషయం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా తర్వాతపార్టీకి ప్రధాన ప్రచారకర్త. వ్యూహ నిపుణుడు. కేంద్ర మంత్రులు అనంతకుమార్, అనంతకుమార్ హెగ్డే వంటి నాయకులు ఉన్నప్పటికీ యడ్యూరప్పదే పెత్తనం. అవినీతి ఆరోపణల కారణంగా గతంలో జైలుకెళ్లినప్పటికీ పార్టీ ఆయనకే బాధ్యతలు అప్పజెప్పడం విశేషం. పార్టీ అంతర్గత నియమావళి ప్రకారం ఏడు పదులు దాటిన వారు పదవులకు పూర్తిగా దూరంగా ఉండాలి. క్రియాశీల రాజకీయాలను పక్కన బెట్టి కేవలం సలహా, సంప్రదింపులు, మార్గదర్శనానికే పరిమితం కావాలి. అయితే ఇవేవీ యడ్యూరప్పకు వర్తించవు.

డెభ్బై పదులు దాటినా.....

ఆయన వయస్సు డెబ్భై దాటింది. గనుల కుంభకోణానికి సంబంధించి లోకాయుక్త తీర్పు నేపథ్యంలో కొంతకాలం బెంగళూరు నగరంలోని పరప్పణ అగ్రహారం జైల్లో గడపాల్సి వచ్చింది. అయినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయనకే బాధ్యతలను అప్పగించడానికి కారణం బలమైన ప్రజాదరణే. ఇప్పటికీ యడ్యూరప్ప సభ అంటే ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలు తరలి వస్తారు. యడ్యూరప్పగా పార్టీ శ్రేణులకు సుపరిచితుడు. ఆయన పార్టీని ఎంతగా విశ్వసించారో పార్టీ కూడా ఆయనను అంతేనమ్మింది. ఎంతమంది నాయకులు వచ్చినా గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఆయనే పార్టీకి పెద్దదిక్కు. శివమొగ్గ జిల్లాలోని శికారిపుర ఆయన సొంత నియోజకవర్గం. మొదట్లో ఇది రిజర్వ్ డ్ స్థానం. 1983లో తొలిసారి ఇక్కడి నుంచి ఎన్నికైన యడ్యూరప్పకు ఆ తర్వాత తిరిగి చూసుకునే అవసరం కలగలేదు. అయితే ఒకే ఒక్కసారి 1999లో కాంగ్రెస్ అభ్యర్థి మహాలింగప్ప చేతిలో ఏడువేల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇదే తన జీవితంలోతొలి,చివరి ఓటమి అని యడ్యూరప్ప వ్యాఖ్యానిస్తుంటారు. అప్పటి నుంచి ప్రత్యర్థి ఎవరైనా విజయం ఆయననే వరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర ఇక్కడ నుంచి పోటీ చేశారు. 71 వేల ఓట్లను సాధించి కాంగ్రెస్ అభ్యర్థి శాంత వీరప్పను ఓడించారు.

యడ్యూరప్పను ఇరకాటంలోకి నెట్టాలని.....

తాజా ఎన్నికలలో మళ్లీ శికారిపుర నుంచే బరిలోకి దిగుతున్నారు. కంచుకోట వంటి నియోజకవర్గంలో తాను ప్రచారం చేయాల్సి అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేస్తే చాలు ఓటర్లు గెలిపిస్తారన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ, పదవులు చేపట్టినప్పటికీ, నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే తన విజయరహస్యమని చెబుతున్నారు. తన విజయం ఖాయమన్న భావనతో రాష్ట్రంలో పార్టీ గెలుపుపై దృష్టి పెడుతున్నారు. కానీ ఆయన ధీమాను దెబ్బ తీసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా శ్రద్ధపెడుతున్నారు. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. అభ్యర్థికి అన్ని హంగులు, వనరులు కల్పించాలని, సామాజిక వర్గాల పరంగా నాయకులను రంగంలోకి దించాలని చూస్తోంది. తద్వారా యడ్యూరప్పపై వత్తిడి తేవాలన్నది హస్తం పార్టీ ఆలోచన. దీనివల్ల మరో ఉపయోగంకూడా ఉంది. యడ్యూరప్పను శికారిపుర నియోజకవర్గానికి పరిమితం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కమలం శ్రేణుల్లో ఒకింత అభద్రతాభావం కల్పించడం అసలు లక్ష్యం. అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన యడ్యూరప్ప హస్తం పార్టీని అవలీలగా ఎదుర్కొంటానని ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి దానిని తోసిపుచ్చలేం కూడా.....!

Similar News