యడ్డీ ఊరుకునేలా లేడే….!!

భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వదిలేటట్లు కనపడటం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ప్రయత్నించిన ఆపరేషన్ [more]

Update: 2019-01-25 18:29 GMT

భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వదిలేటట్లు కనపడటం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ప్రయత్నించిన ఆపరేషన్ కమల్ సక్సెస్ కావడంతో యడ్యూరప్ప ఇక ప్రయత్నాలను విరమించుకుంటాడని భావించారు. అయితే ఆయన మాత్రం పూర్తిగా ఆశలు పెట్టుకునే ఉన్నారు. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు తమ గూటికి చేరతారన్న విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతివాదులకు కొదవలేదు. వీరిలో కొందరికి గాలం వేసేందుకు తిరిగి ప్రయత్నాలను కమలం పార్టీ ప్రారంభించినట్లు కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

మ్యాజిక్ ఫిగర్ కు కరెక్ట్ గా….

కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం అంత బలంగా ఏమీ లేదు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. సంకీర్ణ ప్రభుత్వానికి నిన్న మొన్నటి వరకూ 114 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేశారన్న కారణంతో గణేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో 113 మందికి సంకీర్ణ సర్కార్ బలం పడిపోయింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు కరెక్ట్ గా ఉండటంతో ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్నది స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి 104 మంది శాసనసభ్యులున్నారు. అధికారంలోకి రావాలంటే మరో తొమ్మిది మంది సభ్యుల మద్దతు కమలం పార్టీకి అవసరం అవుతుంది.

అసంతృప్త కాంగ్రెస్ నేతలు….

ఇటీవలే ఇద్దరు స్వతంత్ర సభ్యులు కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి గైర్హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు. వీరంతా బీజేపీ నేతలతో నిత్యం టచ్ లోనే ఉన్నారని చెబుతున్నారు. మరికొంత మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కమలం పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే వీరికోసం స్పెషల్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టాల్సిన అవసరం లేదన్నది యడ్యూరప్ప అభిప్రాయం. తమకు అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా నడుచుకుంటారని యడ్యూరప్ప తన సన్నిహితులతో చెబుతున్నారు.

అవిశ్వాసంతో….

యడ్యూరప్ప వ్యాఖ్యలతో త్వరలోనే సంకీర్ణ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే అవిశ్వాసం ప్రభుత్వం పైన పెడితే ఖచ్చితంగా అసంతృప్త కాంగ్రెస్ నేతలు తమకు అండగా నిలుస్తారని యడ్యూరప్ప భావిస్తున్నారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఆ సమయంలో గైర్హాజరయి కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వాలన్న యోచనలో కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరగా చేసుకుని గవర్నర్ ఎటూ బీజేపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో మరోసారి సంకీర్ణ సర్కార్ ను చావుదెబ్బ తీయాలని యడ్యూరప్ప చూస్తున్నారు. మరి దీనికి కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా? యడ్యూరప్ప ఈసారైనా సక్సెస్ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News