నిజమైనా…? అబద్ధమైనా….??

లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అన్ని అడ్డదారులూ వెతుక్కుంటున్నాయి. [more]

Update: 2019-03-23 17:30 GMT

లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అన్ని అడ్డదారులూ వెతుక్కుంటున్నాయి. ప్రజల్లో పలుచన చేసేందుకు శతవిధాలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆటలో ఎవరిది పై చేయి అనేది ఇప్పుడు తేలకున్నా ప్రస్తుతానికి మాత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అడ్డంగా దొరికిపోయినట్లుంది. అందులోనిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ యడ్యూరప్ప డైరీ కర్ణాటక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన కమలనాధుల్లో వ్యక్తమవుతోంది.

ఒక్కటే రాష్ట్రం కావడంతో….

దక్షిణాది రాష్ట్రాల్లో రెండు జాతీయ పార్టీలకు పట్టున్న ప్రాంతం కర్ణాటక మాత్రమే. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోగల అవకాశం బీజేపీ, కాంగ్రెస్ లకు రెండింటికీ ఉంది. టగ్ ఆఫ్ వార్ గా ఉన్న ఈ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు పార్టీలు వినియోగించు కుంటున్నాయి. యడ్యూరప్ప డైరీ అంశం కర్ణాటకలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు పదేళ్ల నాటి క్రితం డైైరీ పేజీ ఇప్పుడు వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. 2009లో యడ్యూరప్ప రాసినట్లుగా చెబుతున్న ఈ డైరీ పేజీ కాంగ్రెస్ కు పెద్ద ఆధారంగా నిలిచింది. పదేళ్ల నాటి వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది.

ముడుపుల పేజీ…..

తాను ముఖ్యమంత్రిని కావడానికి బీజేపీ పెద్దలకు 1800 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చానని పేర్లతో యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. ఇందులో అరుణ‌ జైట్లీ, నితిన్ గడ్కరీ,లకు 150 కోట్లు, రాజ్ నాధ్ సింగ్ కు 100 కోట్లు, బీజేపీ అధిష్టానానికి 1000 కో్ట్లు ఇచ్చానని ఉంది. చివరకు బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి పేర్లు కూడా ఈ పేజీలో ఉండటం విశేషం. వారిద్దరికి చెరి యాభై కోట్లు ఇచ్చారన్నది డైరీపేజీ సారాంశం. 2009లో రాసినట్లుగా చెబుతున్న ఈ డైరీ పేజీని కారవాన్ మ్యాగ్ జైన్ బయటపెట్టడంతో కాంగ్రెస్ కు అస్త్రం లభించినట్లయింది.

ఒకరిపై ఒకరు……

దీంతో కాంగ్రెస్ దీనిపై విచారణకు డిమాండ్ చేస్తుంది. బీజేపీ అవినీతి పార్టీ అని చెప్పడానికి యడ్డీ డైరీ పేజీని జాతీయ స్థాయిలో ప్రచారాస్త్రంగా హస్తం పార్టీ మలచుకోనుంది. కానీ బీజేపీ మాత్రం ఆ పేజీ నకిలీదని కొట్టిపారేస్తోంది. ఎప్పుడో దీనిపై విచారణ జరిగిందని, కానీ కాంగ్రెస్ ఎన్నికల వేళ ఓటమి భయంతోనే పాత విషయాన్ని తిరిగి తోడుతోందని యడ్డీ ఆరోపిస్తున్నారు. ఇలాంటి జిమ్మిక్కులను కన్నడ ప్రజలు నమ్మరంటున్నారు. తనను, పార్టీని అభాసుపాలు చేసిన వారిపై పరువునష్టం దావా కూడా వేయడానికి వెనుకాడనని యడ్డీ హెచ్చరిస్తున్నారు. తనకు డైరీ రాసే అలవాటే లేదన్నారు. మొత్తం మీద కర్ణాటకలో నామినేషన్ల ఘట్టం ముగియకముందే రెండు పార్టీల నేతల మధ్య వేడి మొదలయింది. మరి డైరీ పేజీ కన్నడ ఎన్నికలలో ప్రభావం చూపుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News