యడ్డీకి ఎదురులేనట్లేనా?

Update: 2018-05-08 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి మూడు ప్రధాన పార్టీల తరుపున ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ తరుపున బీఎస్ యడ్యూరప్ప, జనతాదళ్ (ఎస్) తరుపున కుమారస్వామి రంగంలో ఉన్నారు. వీరి పార్టీల విజయావకాశాలను కాసేపు పక్కన పెడితే, వ్యక్తిగతంగా ఈ ముగ్గురూ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముగ్గురు నాయకుల్లో కెల్లా యడ్యూరప్ప గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏమిటన్నది ఒకింత ప్రశ్నార్థకం అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గమైన వరుణను కుమారుడికి కట్టబెట్టి చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. విజయావకాశాలపై అనుమానాలతోనే రెండు నియోజకవర్గాలనూ ముఖ్యమంత్రి ఎంచుకున్నారన్న విపక్షాల విమర్శలను అంత తేలిగ్గా తోసిపుచ్చలేం. ఇక జనతాదళ్ (ఎస్) ముఖ్యమంత్రి అభ్యర్థి, పార్టీ అధినేత కుమారస్వామి రామనగర నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కుమారస్వామి పరిస్థితిఅనుకున్నంత సాఫీగా లేదన్న వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి. అయినప్పటికీ తమ నాయకుడి విజయం తథ్యమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కుమారస్వామి కూడా అదేమాట చెబుతున్నా ఫలితం వెల్లడయ్యే 15వ తేదీ వరకూ టెన్షన్ తప్పదు.

శికారిపుర కంచుకోట.....

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మాత్రం విజయంపై సంపూర్ణ ధీమాతో ఉన్నారు. యడ్యూరప్ప గెలుపు నల్లేరుపై నడకేనని ప్రత్యర్థులు సయితం తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇది వాస్తవమే. షిమోగా జిల్లాలోని శికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప ఎన్నిక లాంఛనమేనన్నది నిజం. ఆయనకు శికారిపుర కంచుకోట వంటిది. ఆయన మాటకు అక్కడ ఎదురులేదు. తిరుగులేదు. 1985 నుంచి యడ్యూరప్ప అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు. 1983, 1985, 1989, 1994, 2004, 2008, 2013 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. ఒక్క 1999లోనేకాంగ్రెస్ అభ్యర్థి మహాలింగప్ప అక్కడ విజయం సాధించారు. 2013లో యడ్యూరప్ప పార్టీ నుంచి బహిష్కృతుడైనప్పటికీ, తాను కొత్తగా స్థాపించిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో శివమొగ్గ ఎంపీగా ఎన్నికవ్వడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు బీఎస్ రాఘవేంద్ర ఎన్నికయ్యారు. శివమొగ్గ జిల్లాలోని శికారిపుర నియోజకవర్గం బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. 75 సంవత్సరాల యడ్యూరప్ప ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎన్నికవ్వడం విశేషం. ఒకే నియోజకవర్గం నుంచి ఒక నేత ఇన్నిసార్లు గెలవడం అరుదైన రికార్డు. శివమొగ్గ లోక్ సభ స్థానం పరిధిలోని శికారిపుర నుంచి గత ఎన్నికల్లో యడ్యూరప్ప కాంగ్రెస్ అభ్యర్థి శాంతి వీరప్ప గౌడను ఓడించారు. నాటి ఎన్నికల్లో ఆయనకు 69,216 ఓట్లు లభించాయి. 60.73 ఓట్ల శాతం పొందారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా జిబి మలధేష్ ను రంగంలోకి దింపింది. ‘‘జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులెవరూ నాకు తెలియదు. యడ్యూరప్పవిజయం ఖాయం’’ అన్న నియోజకవర్గానికిచెందిన ఓ రైతుకార్మికుడు గౌజ వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు మధేష్, బలిగర్ పేర్లే నియోజకవర్గంలో పెద్దగా తెలియవు. జనతాదళ్,కాంగ్రెస్ లు కావాలనే బలహీన అభ్యర్థులను నిలబెట్టిందన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే షిమోగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీఎన్ శ్రీనివాస ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

నియోజకవర్గంలో యడ్డీ తనయుడు.....

యడ్యూరప్ప నియోజకవర్గాన్ని వదిలేసి పార్టీ విజయం కోసం రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రజలే తన నియోజకవర్గంలో గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు రాఘవేంద్ర నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అన్ని విషయాలనూ సమన్వయపరుస్తున్నారు. కనీసం యాభై వేల మెజారిటీ సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో లింగాయత్ ల ప్రాబల్యం ఎక్కువ. యడ్యూరప్ప కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినా వారు. వీరంతా యడ్యూరప్పకు గట్టి మద్దతుదారులు. లింగాయత్ లు మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. లింగాయత్ లకు ప్రత్యేక అల్ప సంఖ్యాక మత ప్రతిపత్తిని కల్పిస్తామని ప్రకటించినప్పటికీ వారు కాంగ్రెస్ కు ఓటేయరని, తమకే మద్దతు ఇస్తారని యడ్యూరప్ప అనుయాయులు ధీమాగా చెబుతున్నారు. లింగాయత్ ల ప్రాబల్యం పెరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కావడమే మార్గమని అంతర్గత సంభాషణల్లో బీజేపీ నేతలు లింగాయత్ లకు నూరిపోస్తున్నారు. గత ఎన్నికల్లో తమ నాయకుడు కర్ణాటక జనతా పార్టీ ఏర్పాటు చేయడంతో బీజేపీ ఓట్లు చీలిపోయాయని, ఈసారి ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్నది సంగతిని పక్కన పెడితే భారీ మెజారిటీతో శికారిపుర నుంచి ఎన్నికవ్వడం మాత్రం ఖాయం అని చెప్పకతప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News