యడ్డీని రెడీ అవమన్నారా…?

అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా వచ్చారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా నియామకంతో యడ్యూరప్ప తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కన్పిస్తుంది. కర్ణాటకలో సంకీర్ణ [more]

Update: 2019-06-01 16:30 GMT

అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా వచ్చారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా నియామకంతో యడ్యూరప్ప తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కన్పిస్తుంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ను ఎలాగైనా కూలదోసి తాను ముఖ్యమంత్రిని కావాలన్నది యడ్యూరప్ప ఆకాంక్ష. అయితే అమిత్ షా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అది సాధ్యపడలేదు. ఆపరేషన్ కమల్ ను ప్రారంభించి ఆరు నెలలు గడుస్తున్నా అమిత్ షా తరచూ ఇస్తున్న వార్నింగ్ లతోనే యడ్యూరప్ప మెత్తబడ్డారంటున్నారు.

షా బ్రేకులతో…..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వాన్ని కూలదోస్తే దక్షిణాదిన ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయని అమిత్ షా అంచనా వేశారు. అందుకే యడ్యూరప్ప ఎప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేసినా ఆయన ఏదో ఒక కిరికిరి పెట్టేవారు. యడ్యూరప్ప తో లోక్ సభ ఎన్నికల వరకూ సానుకూలంగా పనిచేయించుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా కన్పించింది. యడ్డీని తొందరపడకుండా అమిత్ షా ఎప్పటికప్పుడు బ్రేకులు వేయగలిగారు.

పార్టీతో పాటు ప్రభుత్వమూ…..

అయితే అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా రావడంతో యడ్డీ పని సులువవుతుందని చెబుతున్నారు. దీంతో పాటుగా కేవలం ఎనిమిది స్థానాలతోనే సీఎం పదవి దక్కక పోవడంతో యడ్యూరప్ప మీద కేంద్ర పార్టీలో సానుభూతి కూడా ఉంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సుమలత సీటుతో కలుపుకుంటే 26 స్థానాలను దక్కించుకోవడంలో యడ్డీ పాత్ర కీలకమని పార్టీ భావిస్తోంది. దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే లాంటి వారిని కూడా మట్టి కరిపించడంలో యడ్యూరప్ప సక్సెస్ అయ్యారని ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏ ఒక్కరు కలసినా చర్చించుకుంటున్నారట.

మాట మార్చింది అందుకేనా….?

అందుకే అధిష్టానం, ఇటు ప్రభుత్వం కూడా తనపట్ల సానుకూలతగా ఉన్నట్లు సంకేతాలు అందడంతోనే మాటమార్చినట్లు చెబుతున్నారు. నిన్నటి వరకూ యడ్యూరప్ప ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సిద్ధరామయ్య, కుమారస్వామిలకు సవాల్ విసిరారు. అయితే మళ్లీ యడ్యూరప్ప మాట మార్చారు. సంకీర్ణ ప్రభుత్వం ఎటూ కూలిపోతుంది కాబట్టి తమ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని, ఎన్నికల అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతం తెలుసుకుని చేసినవేనని అంటున్నారు. మొత్తం మీద యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలనుకున్న తన ఆకాంక్షను తీర్చుకోవాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. మరి సక్సెస్ అవుతారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News