బీజేపీకి జగన్ మార్క్ షాక్

అదను చూసి దెబ్బ కొట్టడమే రాజకీయం అంటే. ఇంతకాలం మెత్తగా ఉన్నట్లు కనిపించిన జగన్ సమయం సందర్భం చూసుకుని మరీ కాషాయం పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చేశారు. [more]

Update: 2019-12-24 03:30 GMT

అదను చూసి దెబ్బ కొట్టడమే రాజకీయం అంటే. ఇంతకాలం మెత్తగా ఉన్నట్లు కనిపించిన జగన్ సమయం సందర్భం చూసుకుని మరీ కాషాయం పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చేశారు. జాతీయ పౌర పట్టిక ఎన్నార్సీని ఏపీలో అమలు చేయబోవడం లేదని తన సొంత జిల్లా కడప నడిబొడ్డున జగన్ రీసౌండ్ చేశారు. సరిగ్గా అదే టైంలో జార్ఖండ్ కోట కుప్పకూలి బీజేపీ దీనాలాపన చేస్తోంది. హర్యానాలో దెబ్బ తగిలి, మహారాష్ట్రలో పక్కకు జరిగి జార్ఖాండ్ లో పాట్టు జారిన బీజేపీ గ్రాఫ్ ని తెలివిగా పసిగట్టే జగన్ ఈ విధంగా సంచలన స్టేట్మ మెంట్ ఇచ్చారని భావిస్తున్నారు.

దోస్తానా కటీఫ్….

జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. అంతకు ముందు ప్రతిపక్షంలో సైతం ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. నాడు ఆయన చూపు అంతా చంద్రబాబు మీదనే ఉంది. ప్రత్యేక హోదా విషయంలోనూ బాబునే దుమ్మెత్తిపోశారు. ఇక ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఏపీకి నిధులు వస్తాయని కూడా జగన్ అంచనా వేసుకున్నారు. కానీ జరిగింది వేరు, బీజేపీ నుంది నిందలు నిష్టూరాలు తప్ప ఏపీకి దమ్మిడీ ఆదాయం కూడా రాలేదు. దాంతో అవసరం అయితే దోస్తానా కటీఫ్ చేసుకుంటామని కూడా జగన్ తన తాజా ప్రకటన ద్వారా గట్టిగానే చెప్పేశారన్నమాట.

ధైర్యం అదేనా….?

ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో జగన్ మోడీ, అమిత్ షాలను దేశంలో కెల్లా బలవంతులైన నాయకులుగా మీడియా సమక్షంలోనే పలు మార్లు చెప్పారు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు అని కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేసేవారు. కానీ ఏడు నెలలు తిరగకముందే బీజేపీ బలం తగ్గిపోయిందని జగన్ ఆంచనాకు వచ్చినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈ కారణం చేతనే జగన్ డేరింగ్ గా ఎన్నార్సీని ఏపీలో అమలు చేయమని ప్రకటించగలిగారని విశ్లేషిస్తున్నారు. నిజానికి బీజేపీ బలం తగ్గుతున్న సూచనలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. దానికి తోడు దేశంలో ఓ వర్గం నుంచి వ్యతిరేకత మెల్లగా పెరుగుతూవస్తోంది. మోడీ మ్యాజిక్ కరిగిపోతోంది కూడా.

రూట్ మార్చారా…?

బీజేపీకి మిత్రులు కూడా దూరంగా జరగడంతో తాను తప్ప కేంద్రంలోని పార్టీకి వేరే ఆప్షన్ లేదని కూడా జగన్ ఒక ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. లోక్ సభలో 22 మంది ఎంపీలతో మూడవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ రేపు రాజ్యసభలో ఆరుగురుతో అలరార‌నుంది. ఈ పరిణామాల నేపధ్యంలో తన అవసరం బీజేపీకే ఎక్కువగా ఉందని జగన్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. తన అవసరం బీజేపీ తీర్చకపోగా ఇబ్బందుల పాలు చేసిందని, ఇపుడు కాలం మారిందని, బీజేపీకి తన అవసరమే ఎక్కువగా ఉందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో మిత్రుడిగా ఉండడం కంటే కాస్త బెట్టూ బిగువూ చూపించి అటు వైపు నుంచి నరుక్కురావడమే బెటర్ అని జగన్ డిసైడ్ అయినట్లుగా ఈ కామెంట్స్ చూస్తే అనిపిస్తోంది. చూడబోతే జగన్ మోడీ, షాలకు ఇచ్చిన షాకింగ్ కి కమలనాధుల రిప్లై ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.

Tags:    

Similar News