వైసీపీ అడుగులు తడబడుతున్నాయా?

Update: 2018-09-12 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్పార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై తర్జనభర్జనలు పడుతోంది. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలనే యోచనపై వెనకడుగు వేసింది. వ్యూహాలు ప్రతికూలమైతే మొత్తంగా పట్టుకోల్పోతామనే అనుమానంతో ముందస్తుగా చేసిన ఆలోచనను విరమించుకుంది. విస్తృత స్థాయి సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పటికీ అది ఆచరణాత్మకమైన ఫలితం ఇవ్వదనే సందేహంతో పక్కనపెట్టేశారు. క్షేత్రస్థాయి లో ప్రజాదరణ తమకు అనుకూలంగా ఉందంటూనే చంద్రబాబు మలుపు తిప్పగలరని వైసీపీ అధినేత జగన్ ముక్తాయింపునిచ్చారు. ప్రజల్లో అభ్యర్థులు కలిసిమెలిసి ఉండటం, వారికి ప్రజాదరణ, పార్టీ పరిస్థితులపై మదింపు చేసుకోవడం ద్వారా కార్యాచరణను నిర్ధారిస్తామని చెప్పేశారు. ఇక నిరంతర సమీక్ష చేస్తానంటూ జగన్ పేర్కొనడం పార్టీలో మంచి పరిణామమే. ఎన్నికల దిశలో పార్టీని నడిపించేందుకు సీరియస్ కసరత్తు ప్రారంభించారు.

ప్రజల్లో లేకుంటే టిక్కెట్టు గల్లంతే...

ఎన్నికలను ఎదుర్కోవాలంటే ముందుగా నాయకత్వం సన్నద్దం కావాలి. తెలుగుదేశంపార్టీ నాయకత్వం ఆరేడు నెలలుగా అదే పనిలో నిమగ్నమై ఉంది. చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో ఉండటమే కాకుండా పార్టీని ఉరుకులు పరుగులు తీయిస్తున్నారు. వైసీపీలో ఆ చొరవ లోపించింది. గడపగడపకు వైసీపీ వంటి ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయి ఫలితాలను ఇవ్వలేదు. నాయకులు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు సైతం చురుకుగా లేరు. 67 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే 24 మంది గోడ దూకేశారు. మిగిలిన 43 మందిలో సైతం చాలామంది చురుకుగా లేరని అధిష్ఠానం గుర్తించింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తున్నవారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఆర్థిక కారణాలతో వారు పార్టీని ముందుకు నడపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థిత్వాలు ఖరారైతే ఖర్చు కోట్లలోనే ఉంటుంది. అందువల్ల ఆ సమయానికి నిధులు సర్దుబాటు చేసుకునేందుకుగాను ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నారు.

సర్వేలే సాక్ష్యం....

వైసీపీ ఇప్పటికి మూడు సర్వేలు నిర్వహించింది. పూర్తిగా సానుకూలంగా ఫలితాలు వచ్చాయని బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావంతో అధికారటీడీపీకి అనుకూలిస్తుందనే అంచనాకు వచ్చారు. నిజానికి పవన్ కల్యాణ్ అభిమానుల ఓటింగు 2014లో తెలుగుదేశానికి ఉపయోగపడింది. ఇప్పుడు టీడీపీ వ్యతిరేక ఓటింగు పెరిగింది. అందువల్ల గతంలో పడిన పాజిటివ్ ఓటింగును జనసేన లాగేసుకుంటే వైసీపీ సునాయాస విజయం సాధిస్తుందని తొలుత లెక్కలు వేసుకున్నారు. కానీ ఫీల్డు లెవెల్ సర్వేలో ఆరకమైన రుజువులు లభించలేదు. టీడీపీ ఓటు బ్యాంకు పెద్దగా దెబ్బతినలేదు. జనసేనకు సెపరేట్ ఓటింగు వచ్చింది. వైసీపీ ఓట్లలో కొంత చీలిక వచ్చిందని సర్వేలు తేల్చినట్లు సమాచారం. దీంతో ప్రశాంతకిశోర్ బృందం రంగంలోకి దిగి కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి వివిధ వర్గాలను చేరువ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కారణమని తేలింది. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకతలోని చీలిక అధికారపక్షానికి అనుకూలిస్తుందేమోననే అనుమానాలు నిజమేనని తేలింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం ఖరారు చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించింది.

రాజీనామా ఫలితం శూన్యం...

ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీకి రాజకీయ ప్రయోజనంగా మార్చే లక్ష్యంతో ఎంపీలు రాజీనామా చేశారు. కానీ తెలుగుదేశం వ్యూహాత్మకంగా అవిశ్వాసతీర్మానాన్ని ముందుకు తెచ్చి ప్రజల్లో చర్చ లేకుండా చేసేసింది. అసెంబ్లీకి సైతం వైసీపీ హాజరుకావడం లేదు. ఎవరేని సభ్యుడు అరవై రోజులపాటు స్పీకర్ కు సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా గైరు హాజరు కాకూడదు. అలాగైతే సభ్యత్వాన్ని తొలగించే అధికారం స్పీకరుకు ఉంటుంది. దీనిని ప్రయోగిస్తారేమోననే అనుమానాలు కొందరు వైసీపీ నేతలు వ్యక్తం చేశారు. కానీ రాజకీయంగా అటువంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీకి ఆత్మహత్యాసదృశమవుతుంది. వైసీపీకి అనవసర మైలేజీ ఇచ్చినట్లవుతుంది. అందుకే అంతటి సాహసాన్ని స్పీకర్ చేయరు. ఒకవేళ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా పెండింగులో పెట్టేస్తారు. అందుకే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైసీపీ అగ్రనాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే పార్టీ ఎమ్మెల్యేల అంశాన్ని పక్కన పెట్టింది. కన్వీనర్లలో 75 మందిని మార్చాలని ప్రశాంతకిశోర్ బృందం సిపారసు చేసింది. దానిపైనే జగన్ ప్రస్తుతం దృష్టి పెట్టారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న నెల రోజుల్లోనే ప్రజల్లో ఉండటం లేదనే సాకుతో వారిని తొలగించే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News