జగన్ ఇమేజ్ ను అలా వాడితేనే సక్సెస్....?

Update: 2018-09-25 15:30 GMT

నాయకుడికి ప్రజలను కలవడాన్ని మించిన పెద్ద కార్యం ఉండదు. వారి సమస్యలను సావధానంగా వినడం, సాధ్యమైనంతవరకూ పరిష్కారానికి కృషి చేయడం నాయక బాద్యత. ఇందులో అధికారపక్షం, ప్రతిపక్షం అన్న వ్యత్యాసం ఉండదు. అధికారంలో ఉన్నవాళ్లు సొంతంగా చేయడానికి కుదురుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు డిమాండు చేయడం ద్వారా , ఆందోళనలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారు. తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెడితే అందరి సమష్టి లక్ష్యం , గమ్యం ప్రజాశ్రేయస్సే. మార్గాలు వేరుగా ఉంటాయంతే. ప్రత్యర్థులుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుకున్న గమ్యానికి చేరుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ మార్గాన్ని విడిచి పెట్టి పరస్పరం శత్రువులుగా భావించుకుంటే కక్షలు, కార్పణ్యాలు మినహా ఏమీ ఒరగదు. ఈ సత్యాన్ని గ్రహించకపోతే అధికారపీఠం సంగతి దేవుడెరుగు. ప్రజల్లో పలచన కావడం ఖాయం. కానీ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఈ సంగతిని విస్మరించి పరస్పరం కాట్టాడుకుంటున్నాయి.

రావాలంటే...

‘జగన్ రావాలి. జగన్ కావాలి.’ అన్నది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన నినాదంగా తీసుకున్నది. ఎన్నికలవరకూ ఈ స్లోగన్ ను కొనసాగించాలన్నది పార్టీ నిర్ణయం. దీనిని ఎంత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంశంపై ఆధారపడి ప్రభావం ఉంటుంది. అయితే జగన్ రావాలంటే ఏమేం కావాలన్న విషయంలో పార్టీకి ఇంకా స్పష్టత లేదు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. అయినా ప్రజల్లో పలుకుబడి క్షీణించలేదు. ఈ పలుకుబడిని రాజకీయ శక్తిగా మలచుకుని అధికారపీఠం ఎక్కలేకపోతే ఈసారి పార్టీకి చాలా చిక్కులు ఎదురవుతాయి. పార్టీ పరంగా చూస్తే 2019 ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం. ఒకవేళ పార్టీ పరాజయం పాలైతే మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ఆర్థిక పరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తలపడే అభ్యర్థులకు పార్టీపరంగా ఆర్థిక సహకారం ఉండదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలు, బలహీనవర్గాల అభ్యర్థుల నియోజకవర్గాల్లో ప్రత్యర్థి తెలుగుదేశం ముందు నిలవడం కష్టం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకు కదలాల్సి ఉంటుంది.

కావాలంటే..

వ్యక్తులు తమంతట తాము ముఖ్యమంత్రి కావాలనుకున్నంత మాత్రాన సాధ్యం కాదు. ప్రజలు మెచ్చాలి. జనానికి నచ్చాలి. నాయకుడు చెప్పే మాటల పట్ల విశ్వాసం కుదరాలి. ఆయన వస్తే మంచి జరుగుతుందన్న భరోసా కుదరాలి. ఇందుకు అవసరమైన విధంగా కసరత్తు చేయాలి. ప్రతి మాటా పక్కాగా ఉండాలి. ఆచరణ సాధ్యంగా కనిపించాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ విషయంలో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం తీసిపోరు. టీడీపీకి పార్టీగా ప్రజల్లో బలముంది. కానీ వైసీపీకి నాయకునిగా జగన్ కు ఇమేజ్ ఉంది. దీనిని పార్టీ బలంగా మార్చగలిగితే సక్సెస్ సాధించినట్లే. పార్టీని మించి వ్యక్తే ముఖ్యం అనుకుంటే ద్వితీయశ్రేణి నాయకులు పుట్టి ముంచేస్తారు. తమను నాయకుడే గెలిపిస్తాడనే భరోసాతో క్షేత్రస్థాయిలో పనిచేయడం మానేస్తారు. అది చాలా నష్టదాయకం. 2014లో టీడీపీ అన్నిరకాల శక్తులను సమకూర్చుకుంది. ఇతర పార్టీల నుంచి మంచి అభ్యర్థులను ఆహ్వానించి బరిలోకి దింపింది. తద్వారా తన బలాన్ని పెంచుకుంది. వైసీపీపై పైచేయి సాధించింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే గెలుపు బావుటా ఎగరవేయడం సాధ్యమవుతుంది. జగన్ మీదనే పూర్తిగా ఆధారపడితే అదనపు బలాన్ని చేజేతులారా కోల్పోయినట్లే.

మారాలంతే..

‘నన్ను ముఖ్యమంత్రిని చేయండి. మీకు మంచి జరుగుతుంది.’ అన్న నినాదం ఎప్పటికీ మంచి ఫలితం ఇవ్వదు. స్వార్థాన్ని మించిన ప్రజాప్రయోజనాన్ని నాయకుడిలో చూసినప్పుడే ఓట్ల వర్షం కురుస్తుంది. ఒడిసాలో నవీన్ పట్నాయక్, బిహార్ లో నితీశ్ కుమార్ వంటి వారు ఈ రకమైన ఇమేజ్ కారణంగానే ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటున్నారు. అందరినీ కలుపుకుపోయే ధోరణి అవసరం. 2014లో చంద్రబాబు నాయుడు ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లారో అదే పంథాను జగన్ సైతం అనుసరించాలి. అనువుగాని చోట అధికులమనరాదన్నట్లుగా ఆచితూచి అడుగులు వేయాలి. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చిన్నయత్నం కాదు. ప్రజలను కలిసేందుకు , వారి కష్టాలు వినేందుకు చేసిన బృహత్ప్రయత్నం. దీనిని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను మార్చుకోగలిగినప్పుడే అధికారం తనంతతానుగా వస్తుంది. వయసురీత్యాను ఆయనకు కలిసొచ్చే అవకాశాలే ఎక్కువ. చంద్రబాబు ఎత్తుగడలకు చిక్కకుండా భావోద్వేగానికి గురికాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తే పాదయాత్ర ఫలితాలు సంఘటితమవుతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News