ఆపండి మీ రాజీనామాలు ...!

Update: 2018-05-31 06:30 GMT

పార్లమెంట్ లో ఏపీ పునర్విభజన బిల్లుపై చర్చ జరిగి తీరాలంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. 2014 ఫిబ్రవరి 18 వ తేదీ లోక్ సభలో 20 వ తేదీ రాజ్యసభలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధమే లేదని ఉండవల్లి తాజా గా వ్యాఖ్యానించారు. దీనికోసం వైసిపి ఎంపీలు చేసిన రాజీనామాలు కొద్ది రోజులు నిలుపు చేసుకోవాలని స్పీకర్ వద్ద హాజరు కాకుండా వర్షాకాల సమావేశాల్లో గత విభజన అక్రమాలు ప్రశ్నిస్తూ నోటిస్ ఇచ్చి స్పీకర్ అడ్మిట్ చేయకపోతే సభలో అందరు చూస్తుండగా రాజీనామాలు ఆమోదించుకు వచ్చేయండని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ వారికి విలువైన సూచనలు చేశారు.

నా దగ్గర సాక్ష్యాలు ఇవిగో ...

పార్లమెంట్లో ఏపీ రీ ఆర్గనైజేషన్ పై చర్చ జరిగితే టిడిపి, వైసీపీలకు సహకారం అందించేందుకు బ్రహ్మాస్త్రాలవంటి తిరుగులేని సాక్ష్యాలను వారికి అందిస్తానని దేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం ఏ పార్టీ భవిష్యత్తులో జరపకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడటంతో బాటు ఎపి ప్రజల విషయంలో తప్పు చేస్తే చొక్కా పట్టుకుంటారన్న భయం పార్లమెంట్ లో ఏర్పడుతుందని, తద్వారా ప్రజల్లో చట్ట సభ సభ్యుల పట్ల గౌరవం పెరుగుతుందని ఉండవల్లి అన్నారు. విభజన బిల్లు చర్చ జరిగిన సమయంలో 2018 ఫిబ్రవరి 18న లోక్ సభలో, 20 ఫిబ్రవరిన రాజ్య సభలో పార్లమెంట్ ప్రచురించిన ప్రింటెడ్ పుస్తకమే అప్పుడు జరిగిన తప్పులకు సజీవ సాక్ష్యమని వెల్లడించారు. ఈ పుస్తకంలో పార్లమెంట్ సభ్యులు తుమ్మినా దగ్గినా ఏ రోజుకు ఆ రోజు నమోదు అవుతుందని చెప్పారు. పుస్తకం ప్రింట్ చేసేటప్పుడు తప్పుల సవరణకు 10 రోజులు గడువు ఇస్తారని, అవి సవరించిన తరువాతే ప్రచురిస్తారని వెర్బాటం లో ఉండే ఈ పుస్తకం ఆధారంగా రాష్ట్రపతికి, సుప్రీం కి తాను నివేదించినా ఫలితం లేకపోయిందన్నారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపి పార్లమెంట్ వేదికగా పోరాడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు ఉండవల్లి. నాడు స్పీకర్ అన్యాయంగా చట్ట విరుద్ధంగా , రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంట్లో నడిపిన వ్యవహారం చర్చించకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వారం అవుతామని గుర్తించాలని కోరారు.

కర్ణాటకలో లైవ్ పెట్టకపోతే బీజేపీదే అధికారం ...

రాజ్యాంగంలో లైవ్ చట్టసభలో పెట్టాలని, లేకపోయినా ప్రజాస్వామ్య పరిరక్షణకు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం బిజెపి ని కర్ణాటకలో అక్రమంగా అధికారం దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాన్ని నిరోధించిందని ఉండవల్లి చెప్పారు. అందుకే యడ్యూరప్ప కు మరో మార్గం లేక వాజపేయి తనకు ఆదర్శమంటూ తప్పుకోవాలిసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ వాజపేయి నాడు సభ్యులను లోబర్చుకోవడం కోసం అధికారంలోకి ఎలాగైనా రావాలని ప్రయత్నం చేయలేదని, మెజారిటీ లేదనగానే గౌరవంగా దిగిపోయిన విషయాన్నీ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో వున్న లైవ్ ను పీకేశారంటే, తలుపులు మూసి చేశారంటే ఎంత అన్యాయం చేశారన్నది ఇప్పుడు ప్రజలందరికి అర్ధం అయ్యిందని అన్నారు. అప్పుడు లైవ్ ఉంచి ఉంటే అన్యాయం జరిగేదే కాదన్నారు. ఇంత స్పష్టంగా విభజన ఘోరం కళ్ళకు కనపడుతుంటే పార్టీలు తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తే అంతకన్నా ద్రోహం లేదని, తక్షణం అక్కడ చర్చ జరిపి తప్పు ఎత్తి చూపాలని డిమాండ్ చేశారు ఉండవల్లి. టిడిపి, వైసీపీలు మీరు బిజెపి తో కలుస్తారో విడిపోతారో ప్రజలకు అనవసరమని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక ఈ విషయంలో 25 మంది ఎంపీలు ఏకతాటిపై గళమెత్తాలని కోరారు. కానీ అలా చేయకుండా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయి నిందారోపణలు చేసుకోవడం వల్ల రాజకీయ లబ్ది తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు ఉండవల్లి. 25 సీట్లు ఇవ్వండి అని ప్రతి పార్టీ అంటున్నాయని కానీ 545 సీట్లు వున్న పార్లమెంట్లో 25 సీట్లతో ఎలా చక్రం తిప్పుతారో చెప్పాలని అరుణ కుమార్ డిమాండ్ చేశారు.

మొదలైపోయింది ప్రచారం ...

రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పుడే తారాస్థాయికి చేరుకుందన్నారు అరుణ కుమార్ . ఒక పక్క పవన్ కళ్యాణ్ కవాతు చేస్తూ వస్తున్నారు. అది సేన కాబట్టి కవాతు చేస్తుంది. మరో పక్క జగన్ పాదయాత్ర చేస్తూ సాగిపోతున్నారు. చంద్రబాబు జిల్లాకో సమావేశం పెట్టి ప్రజలకు అన్ని చెబుతా అంటున్నారు. ఇలా అంతా కలిపి యుద్ధం మొదలెట్టేశారు అని చెప్పారు ఉండవల్లి. ఇప్పుడు రాష్ట్రంలో అయోమయం రాజకీయాలు నడుస్తున్నాయని ఎవరు ఎవరితో కలుస్తారో తెలియకుండా ఉందని, అంతా గందరగోళం నడిపిస్తున్నారని అన్నారు అరుణ కుమార్. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదంటే ఆయనకు ఎందుకు సమాధానం చెబుతామని చంద్రబాబు అంటున్నారని, వైసిపి జగన్ అడిగితే నీకు చెప్పేది లేదంటున్నారని, పవన్ అడిగితే నిన్నటిదాకా మాతో వున్న నీకు చెప్పేది ఏమిటి అంటున్నారని, నాలాంటి సామాన్యుడు అడిగితే అసలు పట్టించుకునే పరిస్థితే లేదని, ఇదేమి ధోరణి అని నిలదీశారు అరుణ కుమార్. అంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదనే తీరులో ఉండటాన్ని తూర్పారబట్టారు ఉండవల్లి. చంద్రబాబు నిప్పు అని నిరూపించుకోవాలి అంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల దస్త్రాలను వెబ్ సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అప్పుడు నిప్పు అంటే సౌండ్ వినపడుతుందన్నారు. ఒక వేళ ఆయన చేయకపోతే జగన్, పవన్ తమ ఎన్నికల హామీల్లో ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు గా ఉంటామని, తాము టీడీపీలా కాకుండా అన్ని శాఖల్లో అంశాలు ఆన్ లైన్లో పెడతామని చెబితే దేశం అంతా వారి వెంటే నడుస్తుందని సూచించారు ఉండవల్లి .

 

 

-రాజమండ్రి నుంచి ప్రత్యేక ప్రతినిధి

Similar News