కాగల కార్యాన్ని జగన్ తీర్చేశారహో....!

Update: 2018-07-26 11:00 GMT

‘కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు’, యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే విజయం సాధించినట్లు, తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. పార్టీ కొంతకాలంగా ఎదుర్కొంటున్న అనేక సందేహాలకు సమాధానాలు లభించాయి. పవన్ కల్యాణ్, జగన్ ఎన్నికల్లో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తారని టీడీపీ అగ్రనాయకత్వం అనుమానించింది. దీనివల్ల రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రల్లో భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని ఆందోళనకు గురైంది. ఈ రెండు పార్టీలు పరోక్ష అవగాహనతో వ్యవహరిస్తే టీడీపీ కి కష్టాలు తప్పవని పరిశీలకులు అంచనా వేశారు.ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీకి ఢోకా లేదనుకుంటున్న 54 స్థానాలలో ఫలితాలను శాసించగల బలం ఈ రెండు పార్టీలకు ఉంది. ప్రత్యర్థి బలంగా ఉన్నచోట బలహీనమైన అభ్యర్థిని నిలిపి పరోక్ష సహకారం అందిస్తే చాలు టీడీపీ సీటు గల్లంతు అయ్యే స్థానాలు అవి. అధికారానికి ప్రాణప్రదమైన ఈ సీట్లపై టీడీపీలో విపరీతమైన టెన్షన్ నెలకొని ఉంది. జగన్ పవన్ ల ఎపిసోడ్ తర్వాత తెలుగుదేశం రిలీఫ్ ఫీలవుతోంది.

క్యా‘డర్’ గగ్గోలు....

అధినేత జగన్ సెల్ఫ్ గోల్ క్యాడర్ లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. వైసీపీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు వంటి వారు వైసీపీ, జనసేనకు మధ్య లైజనింగ్ చేస్తున్నారు. కన్నాలక్ష్మీనారాయణ వంటివారు సైతం టీడీపీని నిరోధించేందుకు పవన్, జగన్ ల మధ్య కీలకమైన తరుణంలో సయోధ్య కుదర్చాలనే భావనలో ఉన్నారు. కానీ వ్యక్తిగత విషయాల్లో విమర్శలు చేయడంతో జనసేనను వైసీపీ శాశ్వతంగా దూరం చేసుకున్నట్లయింది. జనసేన అగ్రనాయకులు సంయమనం పాటిస్తున్నప్పటికీ సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. పవన్ తేలికగా తీసుకున్నప్పటికీ ఆయన అభిమానులు జగన్ , వైసీపీలను వదిలేట్లు కనిపించడం లేదు. గతంలో కత్తి మహేశ్, శ్రీరెడ్డిల విషయంలోనూ పవన్ అభిమానులు చెలరేగిపోయారు. ఇప్పుడు రాజకీయంగా తమ హీరోకి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దాంతో అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. జగన్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ దీనిని తిప్పికొట్టడంలో విఫలమవుతోంది. అనేక జిల్లాల్లో పార్టీ శ్రేణులు తమ అధినేత అనవసరంగా కంగారు పడ్డారనే భావిస్తున్నారు. జగన్ కు క్యాడర్ నుంచే బలమైన మద్దతు లభించడం లేదు. సాధ్యమైనంత వరకూ దీనిని ప్రస్తావించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

క్లాసు ‘పీకే’...

జగన్ వ్యాఖ్యలపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ తలపట్టుకున్నట్లు సమాచారం. టీడీపీని కౌంటర్ చేసి జగన్ కు అధికారం దక్కేలా చూడటమే అతని బాద్యత. మేనిఫెస్టో రూపకల్పన మొదలు , సర్వేలు, దిద్దుబాట్లు, నియోజకవర్గ పరిస్ధితుల అధ్యయనం, అభ్యర్థుల జాబితా రూపకల్పన వంటి అనేక రకాల అధికారాలు, బాధ్యతలను పీకే బృందం నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ విషయంలో అనవసర వివాదాలు కొని తెచ్చుకోవద్దని గతంలోనే ప్రశాంతకిశోర్ సూచన చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు జగన్ మీడియా సైతం పవన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ పవన్ విమర్శలు చేశారు. దానికి బదులు చెప్పకుండా కార్లు, పెళ్లాలు పోలిక తేవడంలోనే జగన్ దారి తప్పారు. జగన్ ను వ్యక్తిగతంగా అభిమానించే వారు సైతం దీనిని సమర్థించలేకపోతున్నారు. రాజకీయ విమర్శకు రాజకీయంగానే బదులు చెప్పాలి. ఇంటి,కుటుంబ అంశాలను బరిలోకి లాగితే అందరూ బలి కావాల్సి ఉంటుంది. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా మసలిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టడంలోని ఆంతర్యమిదే. ఇలాగైతే జగన్ కు రాజకీయం ఎప్పటికి వంటపడుతుందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పీకే ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశారు జగన్.

పవన్ పాచిక....

జగన్ దుందుడుకు తనాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు పవన్. ‘విధానాలపై మాత్రమే విభేదిస్తాను. జగన్ కుటుంబ సభ్యులను ఎవరూ కించపరచవద్దు. వారిని వివాదంలోకి లాగవద్దు.’ అంటూ జనసేనాని ఒక ప్రకటన చేశారు. ఇది తన అభిమానులకు సూచనగా మాత్రమే పైకి కనిపిస్తుంది. కానీ తనలోని రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తున్న వైనం తటస్థుల్లో అభిమానులను సంపాదించిపెడుతుంది. ఇదే అంచనాతో పవన్ పక్కా వ్యూహంతోనే స్పందించారు. వైసీపీ, జనసేన రెండూ యువనాయకత్వంలో నడుస్తున్న పార్టీలు. పోల్చి చూస్తే పార్టీ నిర్మాణంతోపాటు విభిన్న సామాజికవర్గాల మద్దతుతో వైసీపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలుస్తోంది. జనసేన ఇప్పుడిప్పుడే రంగంలోకి దిగుతోంది. తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. రాజకీయ సామర్ధ్యానికి రానున్న ఎన్నికలే గీటురాళ్లు. నాయకసామర్ధ్యం, పరిణతి మాత్రమే ప్రస్తుతానికి పార్టీకి బలం. జగన్ కంటే తాను మంచినాయకుడినని ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక సదవకాశం జగన్ వ్యాఖ్యలతో లభించినట్లుగా జనసైనికులు భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News