సెల్ఫ్ గోల్ శాడిస్టులా?..చాణుక్యులా?

Update: 2018-07-16 15:30 GMT

‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు’ అంటారు. సొంతంగా తమ కొంప తామే కూల్చుకునేవాళ్లకు, సొంత ఇంటికే నిప్పు పెట్టుకునే వాళ్లకు పాలిటిక్స్ లో కొదవ లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి మిడిమిడి జ్ఞానపు మేధావులు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతున్నారు. వారు చేస్తున్న ప్రకటనలు తమ పార్టీ అవకాశాలకే గండి కొడుతున్నాయి. గతంలో బీజేపీకి ఇటువంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉండేవి. ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవారి కోర్ ఐడియాలజీ కారణంగా ఘాటైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. తాజాగా కాంగ్రెసు పార్టీనీ ఈ భస్మాసురులు వెంటాడుతున్నారు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్న వైసీపీ వంటి పార్టీలనూ ముగ్గులోకి లాగుతున్నారు. సమీకరణలు సడన్ గా మారిపోతున్నాయి. ఎక్కడ దొరుకుతారా? అని ఆబగా ఎదురుచూస్తున్న ప్రత్యర్థి పార్టీలకు అనుకోకుండా వరంగా మారుతున్నారు.

అమావాస్య చంద్రుడు...

వ్యక్తిగతంగా అనేక వివాదాల్లో చిక్కుకుని సతమతమవుతున్నాడు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. అది చాలదన్నట్లుగా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసిన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం గతం. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆయన వివాదాల పరంపర మొదలైంది. సునందా పుష్కర్ తో పరిచయం, పరిణయం, ఐపీఎల్ టీమ్ కొనుగోళ్లలో గోల్ మాల్ వంటివన్నీ అప్పట్లోనే ఆయనను వెన్నాడిన ఉదంతాలు. సునంద మరణం కేసు ఇంకా కొనసాగుతోంది. ఆమె ఆత్మహత్యకు ప్రధాన నిందితునిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయంగా పార్టీకి భారంగా పరిణమిస్తున్నాడు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తాన్ గా ఇండియా మారిపోతుందంటూ అనవసర విషయాన్ని కెలికి వదిలేశాడు. కమలం నాయకులు అందిపుచ్చుకుని కాంగ్రెసును కడిగిపారేస్తున్నారు. లౌకిక విలువలతో విరాజిల్లుతున్న ఇండియాకు పాకిస్తాన్ తో పోలిక తేవడమే వ్యూహాత్మక తప్పిదం. ఇది బీజేపీకి అనవసరంగా రాజకీయ ఆయుధాన్ని అందించడమే.

తన్నుమాలిన ధర్మం....

రామదాస్ అథవాలే అనే మరో పెద్దాయన పిలవని పేరంటానికి వెళ్లి, శాపనార్థాలు పెడుతున్నాడు. ఆయన బీజేపీ సభ్యుడు కాదు. రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా అనే నామ్ కే వాస్తే పార్టీకి అధ్యక్షుడు. ఎన్డీఏలో భాగస్వామి కావడంతో కేంద్రమంత్రి అయిపోయారు. ఎన్డీఏ లో ఎవరిని చేర్చుకోవాలి? బీజేపీతో భాగస్వాముల సంబంధాలెలా ఉండాలనేది కమలనాథులు నిర్ణయించుకుంటారు. కానీ అథవాలే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి హైదరాబాదులో ముచ్చట మొదలు పెట్టారు. జగన్ ఎన్డీఏలోకి వచ్చి సీఎం అయిపోవాలని పిలుపునిచ్చారు. ఆయనను ముఖ్యమంత్రి చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. అంతేకాదు, జగన్ ఎన్డీఏ లో చేరితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పేశారాయన. ఒకవైపు వైసీపీకి, ఇంకోవైపు బీజేపీకి పొలిటికల్ డామేజీ తెచ్చిపెట్టాడు. ఇప్పటికే బీజేపీతో సంబంధాలపై విమర్శలు ఎదుర్కొంటూ ఆ పార్టీకి దూరంగా ఉండాలని జగన్ నిశ్చయించుకున్నారు. కానీ అథవాలే స్టేట్ మెంట్ మళ్లీ పరిస్థితిని మొదటికి తెచ్చి పెట్టింది. ఏపీలో బీజేపీ కాలు చేయి కూడదీసుకునే యత్నాలు మొదలు పెట్టింది. రాజకీయ కారణాలతోనే ఏపీ ప్రత్యేకహోదాను బీజేపీ పక్కన పెట్టిందన్నట్లుగా ఆయన ప్రకటన చేయడంతో కమలం పార్టీ ఏపీ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. సహాయమంత్రిగా ఉన్న తాను కేబినెట్ మంత్రిగా ఎదగడమెలా? అన్న సంగతి ఆలోచించుకోకుండా అనుచిత సలహాలతో తనకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ శిరోభారం తెచ్చిపెడుతున్నాడు రామ్ దాస్.

భలే ఛాన్సులే...

మోడీ, చంద్రబాబులు మామూలుగానే రాజకీయ ముదుర్లు. ప్రత్యర్థులు ఇంతటి చాన్సు ఇస్తే వదులుతారా? సందర్బం కల్పించుకుని మరీ కాంగ్రెసు పార్టీ కేవలం ముస్లిం మగాళ్లకు చెందిన పార్టీయేనా? అంటూ ప్రధాని విరుచుకు పడ్డారు. ముస్లింలలో కూడా స్త్రీలను వేరు చేసి చూపించేశారాయన. హిందూ మెజారిటీ వాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చే యత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ ఓట్లు బీజేపీ వైపు పోలరైజ్ కావాలనేది ఎత్తుగడ. ఇక చంద్రబాబునాయుడు గగ్గోలు మొదలు పెట్టేశారు. అదిగో చూడండి వైసీపీ, బీజేపీ ఒకటే అంటూ తేల్చి పారేశారాయన. వైసీపీని బద్నాం చేయడానికి తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్టేట్ మెంట్ ఇచ్చిన వ్యక్తి స్థాయి ఏమిటి? అతను ఎంతవరకూ జగన్ ను, బీజేపీని ప్రభావితం చేయగలడన్న అంశాలను ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు నాయుడు పక్కనపెట్టేశారు. తాను చెప్పిందే నిజమవుతోందన్న కోణంలో వైసీపీ పై దాడిని ప్రారంభించారు. దీంతో బీజేపీని మరింత దూరం పెట్టక తప్పని పరిస్థితి వైసీపీకి ఏర్పడుతోంది. తమ సొంత పార్టీలకు , మిత్రులకు ఈ సెల్ఫ్ గోల్ చాణుక్యులు చేస్తున్న డామేజీ అంతా ఇంతా కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News