ఇద్దరూ కలిసి...జగనే లక్ష్యంగా....?

Update: 2018-09-19 15:30 GMT

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన హస్తం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కలిసొస్తుందా? లేదా? అన్న మీమాంస ఇంకా వెన్నాడుతూనే ఉంది. పార్టీ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చేసిన పర్యటన ఒక మోస్తరు విజయవంతం అయినట్లే లెక్క. పార్టీ అగ్రనాయకులంతా హాజరయ్యారు. అందరూ సభను సక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రాప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకావడం విశేషంగానే చెప్పుకోవాలి. ఆయన విభజన విషయంలో విభేదించి పార్టీకి దూరమయ్యారు. ప్రత్యేక పార్టీ స్థాపించారు. తిరిగి ఇటీవలనే కాంగ్రెసు గూటికి చేరారు. పరిపాలన వ్యవహారాలు, పార్టీని అంతర్గతంగా నడపటంలో పటిష్ఠమైన వ్యూహం కలిగిన కిరణ్ చేరిక కచ్చితంగా కాంగ్రెసుకు కలిసివచ్చే అంశమే. అందులోనూ ఒక సామాజిక వర్గం మద్దతు మళ్లీ కూడగట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర సెంటిమెంటును , కులాన్ని కలగలిపి నామమాత్రపు పార్టీ పాత్ర నుంచి కొంత అస్తిత్వం సాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇది తొలి అడుగుగా కాంగ్రెసు పార్టీ చూస్తోంది. మరిన్ని పర్యటనలతో పార్టీ పునాదులను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు నేతలు.

రాహుల్ రాక..వైసీపీకి కాక..

రాహుల్ గాంధీ పర్యటన వైసీపీలో చర్చనీయంగా నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ ఈ పర్యటన సాగింది. ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గృహాన్ని సందర్శించి అతని సేవలను స్మరించడం ద్వారా ఆయా వర్గాలకు చేరువ కావాలనే ఎత్తుగడ దాగి ఉంది. కర్నూలు జిల్లాలో 2014లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా రాజకీయంగా బలపడినట్లు తెలుగుదేశం కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఇంకా వైసీపీకి చెక్కుచెదరని బలం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సామాజిక వర్గ పరమైన గట్టి మద్దతు ఇందుకు కారణం. దీనిని దెబ్బతీసే వ్యూహం కాంగ్రెసు అనుసరిస్తోంది. గతంలో తమకు రెడ్డి సామాజిక వర్గం బలంగా వెన్నుదన్నుగా నిలిచింది. వైసీపీ పురుడు పోసుకున్న తర్వాత ఆ వర్గం ఓటర్లు, పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెసుకు దూరమయ్యారు. వారిని ఆకట్టుకునే ఎత్తుగడతో వేదికపై ఆ సామాజిక వర్గ ప్రముఖులంతా కొలువు దీరారు. రివర్స్ గేర్ లో హస్తం పార్టీ వైపు ఆయా వర్గాల ఓట్లు ఆకర్షితమైతే కొంత మేరకు వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లుపడుతుంది. అందుకే వైసీపీ నాయకులు కర్నూలు సభను కొంత ఆసక్తిగాను, ఆందోళనగాను చూశారు. కాంగ్రెసు ఎత్తుగడలు ఫలించి రెండు మూడు శాతం ఓట్లను రాబట్టగలిగినా ఆమేరకు పంఖాపార్టీకి దెబ్బ తగులుతుంది.

టీడీపీలో జోష్....

తెలుగుదేశం పార్టీలో కొంత జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో ఏమాత్రం వీలున్నా అంతర్గత అవగాహనకు ప్రయత్నించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. తెలంగాణలో పొత్తు దిశలో చర్చలు సాగుతున్నాయి. సీట్ల సంఖ్య, స్థానాల కేటాయింపుపై స్పష్టత వస్తే పొత్తు పొడిచినట్లే. ఆంధ్రప్రదేశ్ లో అందుకు అవకాశం లేదు.కాంగ్రెసు పార్టీతో చేతులు కలపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలుగుదేశానికి తెలుసు. హస్తం పార్టీ విడిగా పోటీ చేసి వైసీపీ ఓట్లను కొంతమేరకు చీల్చగలిగితే ప్రయోజనదాయకంగా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో పట్టుకోసం అనేక యత్నాలు చేసింది కాంగ్రెసు. కానీ ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయింది. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ఆశలు ఊపిరిపోసుకున్నాయి. పార్టీపై వ్యతిరేకత తగ్గుముఖం పట్టింది. 1.5 శాతానికి పడిపోయిన ఓటింగు పుంజుకుంటుందనే భావన రాజకీయవర్గాల్లో సైతం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటోంది. వైసీపీ ఓటింగును కనీసం రెండు శాతం తిరిగి కాంగ్రెసు తెచ్చుకోగలిగితే తమ పంట పండినట్లేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ రాయలసీమ జిల్లాల్లో వైసీపీ కంటే టీడీపీ ఓటింగులో వెనకబడి ఉందనేది జనరల్ ఒపీనియన్. ఈ అంతరాన్ని పూడ్చుకుంటూ పైచేయి సాధించాలంటే కాంగ్రెసు బాగా పుంజుకోవాలని టీడీపీ ఆకాంక్షిస్తోంది.

ఆశలు అంతంతమాత్రమే....

జవసత్తువలు సన్నగిల్లిపోయి ఉండీ లేనట్లుగా మారిన కాంగ్రెసు పార్టీకి ఎంతో కొంత ఊపు తీసుకురావాలనే యత్నం జోరుగా సాగుతోంది. రాహుల్ పర్యటనను ఆ కోణంలోనే చూడాలి. బీజేపీపై వ్యతిరేకత జాతీయ పార్టీగా తమకు ఎంతోకొంత కలిసొస్తుందనే ఆశ ఉంది. అయితే సీట్లు సాధించే స్థాయిలో బలం పెరగదన్న విషయంలో కాంగ్రెసుకు స్పష్టత ఉంది. ప్రత్యేక హోదా విషయంలో స్టాండ్ తీసుకోవడం వల్ల పార్టీ మనుగడకు ఇబ్బంది లేకుండా పోయింది. కొత్తగా నష్టపోయేదేమీ లేదు. పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి ప్రాతిపదిక దొరికింది. ఈ సారి ప్రయోగాలు చేసేందుకు కాంగ్రెసు సిద్ధమవుతోంది. బడుగు బలహీనవర్గాల్లో తమకు గతంలో ఉన్న ఓటింగులో కొంత శాతాన్ని రాబట్టుకోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో సోనియా, ప్రియాంకను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని నాయకులు చెబుతున్నారు. పది లోక్ సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెసు నేతలు ఏర్పాట్లు చేపడుతున్నారు. కనీసం 50 అసెంబ్లీ స్థానాల్లో అయినా డిపాజిట్లు రాబట్టుకోవాలనేది తాజా లక్ష్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News