అధికారపీఠానికి రూటు...?

Update: 2018-05-03 15:30 GMT

ఎన్నికలు కర్ణాటకలో జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తి పెరిగిపోతోంది. ప్రత్యేక హోదా ఫ్యాక్టర్ పక్క రాష్ట్రంలోనూ ఒక ప్రధానాంశంగా మారింది. స్థానికంగా ఉన్న అంశాలు, పార్టీల బలాబలాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇష్యూ ఫలితాలను తారుమారు చేస్తుందా? అన్న దిశలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీని ఓడించండి అంటూ పరోక్షంగా కాంగ్రెసుకు ఓటెయ్యండి అన్న దిశలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెసు కూడా దీనిని అందిపుచ్చుకుంటూ ఆంధ్రాకు అన్యాయం చేసినవాళ్లను ఓడించాలి అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో ఖాళీ అయిన కాంగ్రెసులో పెద్ద నాయకులు పోను యాక్టివ్ గా ఉన్నమిగిలిన నాయకులంతా కర్ణాటక ప్రచారంలో తలమునకలైపోతున్నారు. వైసీపీ, జనసేన లకు సంబంధించి మాత్రం ఇంకా కొంత క్లారిటీ మిస్సవుతోంది.

పంఖా పై కమలం ఆశలు...

కర్ణాటకలో వైఎస్పార్ కాంగ్రెసు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అందులోనూ రాయలసీమ రాజకీయాలకు ఎంతోకొంత కన్నడ ప్రాంతాలు సామీప్యతను చాటుకుంటూ వస్తున్నాయి. కర్ణాటకలో స్థిరపడిన వారు సామాజిక సమీకరణల విషయంలో ఏపీలో మాదిరిగానే స్పందిస్తున్నారనేది కమలం పార్టీ అంచనా. తెలుగుదేశం పార్టీ ఏరకమైన పిలుపు ఇచ్చినప్పటికీ జగన్ పార్టీ కి చెందిన వారు బీజేపీకి ఓటు వేస్తారనే ఆశాభావం కమలం నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఎటువంటి పిలుపునివ్వకపోవడాన్ని ఇందుకు దృష్టాంతంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రిస్కులో పడే అవకాశం ఉంటే చివరిక్షణాల్లో జగన్ సైతం యూ టర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జగన్ ను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారే తప్పితే బీజేపీని కర్ణాటకలో ఇబ్బంది పెట్టాలని చూడటం లేదు. కన్నడ ఎన్నికలు, ఏపీ ప్రత్యేక హోదా వేర్వేరు అంశాలుగా జనసేన భావిస్తోందనేవారున్నారు. ఎటువంటి అవకాశం దొరికినా ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టడం రాజకీయ లక్షణం. పవన్ బీజేపీని ప్రత్యర్థిగా భావించడం లేదంటే తెలుగుదేశంతోనే అటో ఇటో తేల్చుకోవాలనుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తరహాలోనే జనసేనాని కూడా దాదాపు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కనబరుస్తున్న ఈ సిమిలారిటీ భవిష్యత్తులో ఏపీలో ఆయా పార్టీలకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. కాంగ్రెసు తెలుగు నాయకులు తమ సొంత పార్టీ ప్రచారంలో కన్నడ గడ్డపై హవా చెలాయిస్తున్నారు. తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారు.టీడీపీ నేతలు బీజేపీ ఓడిపోవాలని కోరుతున్నారే తప్ప పర్యటనల వంటి అనవసర శ్రమ, వ్యయాన్ని పెట్టుకోవడం లేదు.

నిజంగా అంత సీన్ ఉందా?

తెలుగు రాజకీయాలు కన్నడ నాట అంతగా ప్రభావం చూపుతాయా? అంటే గణాంకాలు అవుననే చాటి చెబుతున్నాయి. రాష్ట్రంలో 15 శాతం వరకూ తెలుగు ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా. 12 జిల్లాల్లో వీరు బాగా విస్తరించి ఉన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగు ఓటు ఎటు పడితే అటే గెలుపు త్రాసు మొగ్గుతుంది. బెంగుళూరు అర్బన్; బెంగుళూరు రూరల్, చిక్ బళ్లాపూర్, కోలార్, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి రాయచూర్,బీదర్ వంటి జిల్లాల్లో ఈ ఓట్ల ప్రభావం చాలా ఎక్కువ. బెంగుళూరు నగరంలోనే 12 లక్షలమంది వరకూ తెలుగు ఓటర్లుంటారనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెసు, జేడీఎస్ లు చావోరేవో తేల్చుకునే రీతిలో పోరాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఓటూ విలువైనదే. అందులోనూ లక్షల సంఖ్యలో ఉన్న తెలుగువారి ఓట్లను ఎవ్వరూ వదులుకోవాలనుకోవడం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే వీరి ఓటు కూడా సగటు కన్నడ ఓటరు తరహాలోనే ఉంటుంది. ఇప్పుడు ఏపీ హోదాను ఆత్మాభిమానంతో ముడిపెట్టడంతో ప్రచారంలో కొంత వైవిధ్యం కనిపిస్తోంది. అందులోనూ గడచిన ఎన్నికల్లో 43 నియోజకవర్గాల్లో బొటాబొటి మెజార్టీలతో ఆయా పార్టీలు గట్టెక్కాయి. వెయ్యి ఓట్లలోపు మెజార్టీతో 9 నియోజకవర్గాలు, వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల ఆధిక్యంతో 8 నియోజకవర్గాలు, 2నుంచి3వేల మధ్య 7, 3 నుంచి 4వేల మధ్య 9, 4 నుంచి 5 వేల ఓట్లమధ్య ఆధిక్యంతో గెలిచిన నియోజకవర్గాలు 10 ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని తెలుగు ఓట్లు సాధారణ పాటర్న్ కు భిన్నంగా స్పందిస్తే ఫలితాలు తారుమారవుతాయని సర్వేక్షకులు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు ఓటు అధికారపీఠానికి రూటుగా మారడం విశేషమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News