జగన్ ఇది సాధ్యమేనా..?

Update: 2018-06-13 14:30 GMT

ఎన్నికల సమయంలో ఏదో రకంగా మభ్యపెట్టడమే లక్ష్యంగా నాయకులు ఎత్తుగడలు వేస్తుంటారు. మేనిఫెస్టోలు మొదలు మేనరిజం వరకూ అంతా కృతకమే. ఏదో రకంగా ఆకట్టుకుని పబ్బం గడిపేసుకుంటే చాలనుకుంటారు. అమలుకు అసాధ్యమైన హామీలతో అందలం ఎక్కాలనుకుంటారు. తీరా అధికారం దక్కాక వాటిని అమలు చేయలేక బోర్లాపడుతుంటారు. రాజకీయ విశ్వసనీయతను పణంగా పెడుతుంటారు. ప్రజాస్వామ్య విలువలూ భంగపడుతుంటాయి. ఎన్నికల ప్రణాళికల్లో ప్రధాన హామీలు అలాగే ఉండిపోతుంటాయి. ప్రజల్లో నిరాశా నిస్పృహలు అలుముకుంటాయి. దీంతో అంతా ఆ తాను ముక్కలే అన్న ఒక నిరాసక్తత ప్రజల్లో ఏర్పడుతోంది. రాజకీయపార్టీలన్నీ మోసపూరితమన్న భావన నెలకొంటోంది. ఒక పార్టీకి బదులు మరొక పార్టీని మారుస్తూ ప్రజలు కక్ష తీర్చుకుంటున్నామన్న ప్రతీకార తృప్తి పొందుతున్నారు. పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోలేకపోతున్నాయి. తాజాగా ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది. ఇప్పటికే హామీల అమలు విషయంలో భంగపడిన చంద్రబాబునాయుడు, చంద్రశేఖరరావుల అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. తాను కూడా వారి జాబితాలో చేరేందుకే ఉత్సుకత చూపుతున్నట్లున్నారు.

‘సీఎం’ పీఠమెవరిది..?

2014 ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు చాలా వరకూ అమలు చేయగలిగారు. కానీ వాస్తవాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చిన హామీలు మాత్రం అలాగే పెండింగులో పడిపోయాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానం ఇందులో ముఖ్యమైనది. తాను తెలంగాణకు కావలిగా ఉంటాను. దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతానంటూ పలుసందర్బాల్లో పేర్కొన్నారు. చివరికి అధికారం సొంతమయ్యేటప్పటికి తానే ఆ పీఠం ఎక్కి కూర్చున్నారు. కేసీఆర్ ను జీవితాంతం వెంటాడే వాగ్దానభంగమిది. అధికారం తమ కనుసన్నల్లో ఉన్నప్పటికీ దానిని వేరే వారికి అప్పగించడం అంత సులభం కాదు. మహాత్మాగాంధీ, జయప్రకాశ్ నారాయణ వంటివారికి మాత్రమే అది సొంతం. ఆ స్థాయిలో తనను తాను ఊహించుకుని చివరికి వచ్చేసరికి కేసీఆర్ ఆ పని చేయలేకపోయారు. భూమిలేని దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ చేస్తానంటూ ఇచ్చిన మేనిఫెస్టో మూలనపడిపోయింది. ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రమైనా ఆచరణ సాధ్యం కాలేదు. రెండు పడకల ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అనుకూలించడం లేదు. మేనిఫెస్టోల రూపకల్పన సందర్భంలో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు పలచనకాకతప్పదు. ప్రతిపక్షాల యాగీకి కారణమవుతారు.

రిజర్వేషన్లకు రీజనేది?...

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు. అడిగినవారికి, అడగని వారికి వరాల జల్లు కురిపించేశారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఆర్థిక హామీలను పక్కనపెడదాం. సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి చట్టపరంగా సాధ్యం కాని, రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఉన్న అంశాలపై హామీలు గుప్పించేశారు. కాపులకు బీసీరిజర్వేషన్లు, బోయ కులస్తులను ఎస్టీలలో చేర్చడం వంటి హామీలు ఉదారంగా దయ చేశారు. రిజర్వేషన్ల పరిధిపై సుప్రీం విధించిన ఆంక్షలు, రాజ్యాంగ పరిమితులను పట్టించుకోలేదు. రాష్ట్రప్రభుత్వ పరిధికి సంబంధం లేని విధంగా ఇష్టారాజ్యం హామీలతో ఇక్కట్లు కొని తెచ్చుకున్నారు. తీరా అమలు విషయానికొచ్చేసరికి చేతులు ఎత్తేశారు. కాపుల పేరెత్తకుండా బీసీల పేరిట ఒక కమిషన్ ను నియమించి, ఛైర్మన్ తో సంబంధం లేకుండా నివేదిక తెప్పించుకుని శాసనసభతో మమ అనిపించి కేంద్రానికి పంపేశారు. చేతులు దులిపేసుకున్నారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. సామాజిక అంశాలపై హామీలు ఇచ్చేముందు ఆచితూచి అధ్యయనంతో నిర్ణయాలు తీసుకోవాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం వెంపర్లాడితే సామాజిక ఘర్షణలకు దారి తీస్తుంది. చంద్రబాబు నాయుడి హామీ కారణంగా కాపులకు, బీసీ వర్గాలకు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి. తమ వాటా, కోటా కాపులు ఎగరేసుకుపోతారేమోననే భయాందోళనలు వెనకబడిన వర్గాల్లో అలుముకున్నాయి. తమ కోటాకు బీసీలే అడ్డుతగులుతున్నారనే అనుమానాలు కాపుల్లో ఏర్పడ్డాయి. మొత్తమ్మీద ఈ తతంగమంతటికీ చంద్రబాబే కారణమనే అసంతృప్తి రెండు వర్గాలలోనూ నెలకొంది. ఇది భవిష్యత్తులో టీడీపీకి నష్టదాయకంగా పరిణమించవచ్చు.

మాట తప్పకుండా సాధ్యమా? ...

వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. అమలు చేయలేని హామీలు ఇవ్వకూడదనేది 2014లో ఆయన తీసుకున్న నిర్ణయం. రైతుల రుణమాఫీ హామీ ఇవ్వాలని పార్టీలోని సీనియర్లు చెవినిల్లు కట్టుకుని పోరు పెట్టారు. అది సాధ్యం కాదంటూ కొట్టి పారేశారాయన. మాట తప్పను. మడమ తిప్పను అన్న వైఎస్ నినాదాన్ని నిత్యం జపించే జగన్ కొన్ని విషయాల్లో చిత్తశుద్ధి కనబరుస్తారు. ప్రజలకు చేయలేని పనులు చెప్పకూడదని గతంలో పార్టీ నాయకులకు హితబోధ చేసేవారు. తాజాగా ఆయన తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్థిక వనరుల అందుబాటు, అమలు సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందుగా మాట ఇచ్చేద్దాం. ఓటర్లను పడగొట్టేద్దాం. అన్న ధోరణి వైసీపీ అధినేతలో కనిపిస్తోంది. లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నవరత్నాల హామీలను గుప్పించి ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. తాజాగా తన పార్టీకి వచ్చే ఎమ్మెల్సీ స్థానాలన్నీ బీసీలకు, శాసనసభలో ప్రాతినిధ్యం లభించని వర్గాలకు ఇస్తానంటూ ఒక సామాజిక హామీని ఇచ్చారు. నిజానికి అది ఆచరణ సాధ్యం కాని విషయం. ఎమ్మెల్సీ స్థానాల విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పెద్దల సభలో ఇంచుమించు స్థానాలన్నీ అగ్రవర్ణాలతోనే నిండి ఉంటాయి. రాజకీయపరమైన ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణం. ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మినహా మిగిలిన వెనకబడిన తరగతులు వేటికీ తమ జనాభా నిష్పత్తిని అనుసరించి చట్టసభల్లో సీట్లు దక్కడం లేదు. రాజ్యాంగపరమైన కేటాయింపు కారణంగా ఎస్సీ, ఎస్టీలు తమ ప్రాతినిధ్యం పొందగలుగుతున్నారు. ఇప్పుడు బీసీలకే మొత్తం ఎమ్మెల్సీ స్థానాలిస్తానన్న జగన్ ప్రకటన సాహసోపేతమైనది. పునరాలోచించుకుని పక్కాగా తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ అదే విధానానికి కట్టుబడి ఉంటే ఆర్థిక , అంగబలాల దృష్ట్యా వెనకబడిన వర్గాలకు సముచిత రాజకీయ ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంటుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News