ఒన్స్ మోర్ .. మళ్లీ 2014 వ్యూహం..?

Update: 2018-07-03 15:30 GMT

రాజకీయాల్లో శాశ్వతమిత్రులు..శత్రువులు ఉండరనేది నిరూపితమైన సత్యమే. సిద్ధాంతరాద్ధాంతాలన్నీ అప్పటికప్పుడు పెట్టుకునే నియమాలే. అవసరాల కోసం అన్నిటినీ తీసి పక్కనపెట్టేయడం తలపండిన రాజకీయవేత్తలకు కొట్టిన పిండి. ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోంది. జాతీయంగానూ ఆ దిశలో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. 2014 లో కాంగ్రెసు వ్యతిరేక పవనాలతో చంద్రబాబు నాయుడు అనూహ్య విజయం సాధించారు. అప్పటివరకూ మంచి ఫామ్ లో ఉన్న వైసీపీని కాదని టీడీపీకి ప్రజలు పట్టం గట్టారు. నెగటివ్ ఓటు ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందని చాటిచెప్పిన ఎన్నిక అది. ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంటే సాధారణంగా ఓటమి సహజం. ప్రతిపక్ష పాత్రకు ప్రభుత్వ పక్షాన్ని పరిమితం చేస్తుంటారు ప్రజలు. కానీ 2014 కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. చరిత్రలో ఎరగని పరాజయాన్ని కాంగ్రెసుకు మిగిల్చింది. అంతగా ప్రజలు ఆ పార్టీ పట్ల ఏహ్యభావం పెంచుకున్నారు. తాజాగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెసు స్థానంలోకి బీజేపీని తెచ్చిపెట్టడంలో టీడీపీ విజయవంతమవుతోంది. అవసరమైతే కాంగ్రెసుతో జాతీయ స్థాయిలో చేతులు కలిపేందుకూ సిద్ధమవుతోంది.

ఆనాడు పిల్ల కాంగ్రెసు ముద్ర...

కాంగ్రెసుపై వ్యతిరేకతను వైసీపీకి అంటగట్టేందుకు చంద్రబాబు నాయుడు 2014లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు అంటూ కాంగ్రెసుపార్టీకి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తేడా లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజానికి కాంగ్రెసు ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది. మైనారిటీలు, దళితులు, రెడ్డి సామాజిక వర్గం తొలి నుంచి కాంగ్రెసుకు అండదండగా నిలుస్తోంది. ఈ మూడు వర్గాల సంఖ్య కలిపితే జనాభాలో 31 శాతం వరకూ ఉంటుందని అంచనా. ఈ వర్గాల్లోని మెజారిటీ ఓటింగు అంటే దాదాపు 65 నుంచి 75 శాతం కాంగ్రెసుకు మద్దతుదారులుగా నిలిచేవారు. ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి చేపట్టిన వివిధ పథకాల కారణంగా ఇందిరాగాంధీ కాలం నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. ఇక పార్టీలో రెడ్లకు పెద్ద పీట వేయడంతో ఆ సామాజిక వర్గం సైతం పదవుల రీత్యా కాంగ్రెసును అంటిపెట్టుకుని ఉంటూ వచ్చింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సామాజిక వర్గ మద్దతు మరింత బలపడింది. అంతకుముందు వరకూ 70నుంచి75 శాతం వరకూ పరిమితమైన రెడ్ల మద్దతు 85 నుంచి 90 శాతం వరకూ పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత రాజశేఖరరెడ్డి సాధించి పెట్టిన ఇమేజ్ , ఓటు బ్యాంకు వైసీపీకి బదిలీ అయిపోయింది. కాంగ్రెసు తీవ్రంగా నష్టపోయింది. తటస్థ ఓటరును వైసీపీ ఆకట్టుకోకుండా దానిపై టీడీపీ పిల్ల కాంగ్రెసు ముద్ర వేసింది. దీంతో వైసీపీకి న్యూట్రల్ ఓటరు, స్వింగ్ ఓటరు లేకుండా పోయారు. ఓటింగు పర్సంటేజీలో బలమైన పార్టీగా నిలిచినప్పటికీ అధికారం దక్కించుకోలేకపోయింది.

నేడు కమలంతో కలిపేశారు...

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసుకు నకలుగా ముద్ర వేసి వైసీపిని ప్రజాబాహుళ్యానికి దూరం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ ఇప్పుడు మరో ఎత్తుగడ తో ముందుకు కదులుతోంది. తాజాగా బీజేపీతో వైసీపి అంటకాగుతోందని ఇంటాబయటా ప్రచారం ప్రారంభించింది. మైనారిటీ, దళిత ఓటింగును వైసీపికి దూరం చేయాలనే వ్యూహం ఇందులో దాగి ఉంది. ప్రజల్లో బీజేపీపై నెలకొని ఆగ్రహాన్ని వైసీపి వైపు మళ్లించే పథకం అమలు చేస్తున్నారు. తద్వారా తటస్థ ఓటర్లు మరోసారి టీడీపిని తమ చాయిస్ గా ఎంచుకొంటారనేది అంచనా. దళిత తేజం వంటి కార్యక్రమాలను టీడీపీ విస్తృతంగా చేపడుతోంది. తమకు దూరంగా ఉన్న ఆయా వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసీపీపై ధ్వజమెత్తుతూ తమకే మద్దతు ఇవ్వాలని ఆయా వర్గాలను టీడీపీ అభ్యర్థిస్తోంది. బీజేపీతో కలవడం వల్ల వైసీపీ మైనారిటీలకు చేటు చేస్తుందనే దిశలోనూ ప్రచార వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ముస్లింలకు ప్రభుత్వంలోనూ పెద్దపీట వేయాలనే యోచన చేస్తున్నారు. తద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకోవాలనుకుంటున్నారు. తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మైనారిటీకి చోటు కల్పించబోతున్నారు. మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయనతో ప్రచారం చేయించాలనే ఆలోచన చేస్తోంది టీడీపీ. ఇప్పటికే శాసనమండలి అద్యక్షునిగా మైనారిటీ ఉన్నారు. మంత్రి పదవి కూడా జోడిస్తే ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారన్న భావన ఆయా వర్గాల్లో్కి వెళుతుందనుకుంటున్నారు.

ప్లాన్ బీలో ప్రజా ప్రత్యర్థులు..

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల్సిందేనన్న ఎమోషనల్ కంపల్సన్ కల్పించేదిశలో తెలుగుదేశం ప్రచారం సాగుతోంది. వైసీపీ,జనసేన,బీజేపీ మూడూ ప్రజాప్రత్యర్థులు , రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయనే తీరులో ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీపై నేరుగా దాడి చేస్తూ రాష్ట్రప్రయోజనాలు పరిరక్షించుకోవాలంటే టీడీపీని ఎన్నుకోవడమే శరణ్యమని ప్లాన్ ఏ ని అమలు చేస్తున్నారు. ప్లాన్ బీలో బీజేపీకి సానుకూలంగా ఉండే వైసీపీ, జనసేనలను తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నారు. కాంగ్రెసు పార్టీని తెలుగుదేశం పెద్దగా విమర్శించడం లేదు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలిసి పనిచేయాల్సి రావచ్చనే అంచనాలో ఉంది టీడీపీ అధిష్ఠానం. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సందర్బంగా కాంగ్రెసుతో చంద్రబాబు నాయుడు వేదికను పంచుకున్నారు. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కూటమి కట్టాల్సి వస్తే చంద్రబాబు కేంద్రంగా చక్రం తిప్పాలనే ముందస్తు ఆలోచనను టీడీపీ పక్కా పాటిస్తోంది. కాబోయే ప్రధానిని మేమే డిసైడ్ చేస్తామంటూ ప్రకటించడంలోని ఆంతర్యమిదేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News