జగన్ కు జడుపు...బాబుకు భయం..?

Update: 2018-07-28 15:30 GMT

‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. వేస్తే కొండకే ముడివేయాలి. పోతే వెంట్రుక. వస్తే కొండ.’ ఇదీ పవన్ రాజకీయ సూత్రం. కొత్తగా పాలిటిక్స్ లో ప్రవేశించిన జనసేనాని పంచాయతీ ఎన్నికల చాలెంజ్ విసిరారు. ఎన్నికలు పెట్టే దమ్ముందా? అంటూ ముఖ్యమంత్రినే సవాల్ చేశారు. అధికారపార్టీ బలహీనతను ఆసరా చేసుకుంటూ రాజకీయాస్త్రాన్ని సంధించారు. సవాల్ ను స్వీకరించలేక, తిప్పికొట్టలేక అధికార టీడీపీ ఆగమాగమయిపోతోంది. అధినేత సంగతి పక్కనపెట్టినా ద్వితీయశ్రేణి నాయకులు సైతం స్పందించడం లేదు. టీడీపీ పని అయిపోయిందంటూ సేనాని సవాల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు భారీ కసరత్తు మొదలు పెట్టాయి. ఎన్నికలు పెట్టండి తేల్చేసుకుందామంటూ హంగామా మొదలు పెట్టబోతోంది జనసేన. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అదంత పెద్ద విషయం కాదన్నట్లుగా దాటవేసే ధోరణిని కనబరుస్తున్నాయి. పవన్ విసిరిన సవాల్ లో పొలిటికల్ గేమ్ ప్లాన్ పక్కా వ్యూహమేనంటున్నారు పరిశీలకులు.

బాబుకు భలే చిక్కు...

రాష్ట్రంలోని సుమారు పదమూడు వేల పంచాయతీల పాలకవర్గాలకు గడువు ఆగస్టుతో తీరిపోనుంది. ఎన్నికలు నిర్వహిస్తే నూతన సర్పంచులు కొలువుదీరాలి. గ్రామస్థాయిలో టీడీపీ చాలా పటిష్టంగా ఉంది. స్థానిక నాయకులను చూసి పార్టీలకు సంబంధం లేకుండా ఓటింగు జరుగుతుంది. నాయకత్వం విషయంలో వైసీపీ, జనసేనలపై టీడీపీదే ఆధిక్యం. కానీ పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు సంసిద్ధంగా లేరు. గ్రామస్థాయి ఎన్నికల్లో వనరులు వినియోగిస్తే శాసనసభ ఎన్నికలపై లోకల్ లీడర్లు పెద్దగా శ్రద్ధపెట్టరనే భయం వెన్నాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామాల ఎన్నికలంటే అధిష్టానంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికల్లో బాగా పనిచేస్తారనే భావన ఉంది. తమ ఎన్నిక ముగిసిపోతే ఎమ్మెల్యే,ఎంపీలను పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ‘2019 లో గెలిచి వచ్చిన నాయకుడిని చూసుకుందాం.’ అనే ఉదాసీన , నిర్లిప్త భావం ఏర్పడుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలే టీడీపీ కి ప్రతిష్టాత్మకం. ఈలోపు రిస్కు చేయడానికి చంద్రబాబు సిద్దపడటం లేదు. క్యాడర్, వనరులను ఇప్పుడే వినియోగించడం అనవసరమనే ఉద్దేశంలో ఉన్నారు. ఏమాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చినా శాసనసభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందనే ఆందోళనా వెన్నాడుతోంది.

జగన్ కూ జడుపే....

గన్ షాట్ గా ఈసారి అధికారం తనదే అని నూటికి నూరు పాళ్లు నమ్ముతున్నారు జగన్. తటస్థంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడే వారి సూచనలు, సలహాలు స్వీకరించడానికి సైతం ఇష్టపడటం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్,లగడపాటి రాజగోపాల్ , సబ్బం హరి వంటివారు వైఎస్ కు అత్యంత సన్నిహితులు. రాజకీయంగా వాతావరణాన్ని కనిపెట్టి చెప్పగలిగినవారు. పార్టీ శ్రేయోభిలాషులు కొందరు వీరితో జగన్ భేటీకి ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ ధోరణి తెలిసి వారు చొరవ చూపలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే ఓటమిని ఈ దశలో తట్టుకునే పరిస్థితి వైసీపీకి లేదు. పంచాయతీల్లో అయిదేళ్లు, అసెంబ్లీలో నాలుగేళ్ల అధికారం తర్వాత కూడా టీడీపీ పంచాయతీల్లో గెలుపు సాధిస్తే ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. వైసీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యం దిగజారిపోతుంది. పైపెచ్చు వైసీపీ కంటే స్థానిక నాయకత్వం టీడీపీకి పటిష్ఠంగా ఉంది. 35 సంవత్సరాలుగా పార్టీ వేళ్లూనుకుని ఉంది. 20 సంవత్సరాలు అధికారంలో ఉంది. దీంతో పంచాయతీ స్థాయిలో బలమైన నాయకులకు కొరత లేదు. పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అయినప్పటికీ పార్టీల వారీ లెక్క ఈజీగానే తేలిపోతుంది. అందువల్ల స్థానిక ఎన్నికలు ఇప్పుడు అనవసరమైన రిస్కు అని వైసీపీ భావిస్తోంది.

బరాబర్ బరిలోకి...

నాలుగు జిల్లాలను మినహాయిస్తే జనసేన రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. అయినా అధికారపార్టీకి సవాల్ విసురుతోంది. తమ పార్టీకి గ్రామప్రాంతాల్లో బలమైన మద్దతు లభిస్తుందని జనసేన విశ్వసిస్తోంది. సామాజికంగా కులపరమైన మద్దతూ బలంగా ఉంది. కులాలకతీతంగా యువతరం అండ దొరుకుతుందని భావిస్తోంది. వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుంటూ ఇకపై ఏ ఎన్నిక వచ్చినా బరిలోకి దిగాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తమకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును అంచనా వేసుకునేందుకు పంచాయతీ ఎన్నికలు కొలబద్దగా ఉపకరిస్తాయనుకుంటున్నారు. బలాలు,బలహీనతలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఇంతకుమించిన అవకాశం ఉండదని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. పోల్ మేనేజ్ మెంట్, ప్రచారం, ఆర్థిక వనరుల సమీకరణ , సమన్వయం వంటి విషయాల్లోనూ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తొలిసారిగా జనసేన రంగంలోకి దిగుతోంది. అసెంబ్లీకి సిద్దం కావాలంటే ట్రయల్ రన్ గా పంచాయతీ ఎన్నికలు ఉపకరిస్తాయని పవన్ నమ్ముతున్నారు. అందుకే బరాబర్ బరిలోకి దిగడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ సవాళ్లు విసురుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News