జగనైనా...? బాబు అయినా... కేసీఆర్ అయినా...?

Update: 2018-07-30 15:30 GMT

అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంటాయి ప్రాంతీయపార్టీలు. పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు సైతం శాసనసభ స్థానాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయి. జాతీయ పార్టీల ప్రాథమ్యాలు వేరు. లోక్ సభ స్థానాలు ఎక్కువ తెచ్చుకోవడంపై దృష్టి పెడతాయి. మిత్రపక్షాలతో కలిసినప్పుడు ఎంపీ స్థానాలపైనే ఎక్కువగా బేరసారాలు సాగిస్తాయి. 1999 నుంచి వివిధ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొనసాగుతూ వస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయపార్టీలు తమ అవసరాలకోసం కలిసి నడుస్తున్నాయి. సీట్ల పంపకాల్లో ప్రాంతీయపార్టీలు లోక్ సభ స్థానాల విషయంలో కొంత రాజీపడినా అసెంబ్లీ స్థానాలపై తమ పట్టు కొనసాగిస్తూ ఉండేవి. 1999, 2004 లో బీజేపీ, టీడీపీ కూటమి, 2004లో కాంగ్రెసు,టీఆర్ఎస్,వామపక్షాలు, 2009లో వామపక్షాలు, టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి, 2014లో బీజేపీ,టీడీపీ పొత్తులు కట్టి పోటీ చేశాయి. 20 ఏళ్ల తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఎటువంటి పొత్తు లేకుండా తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే వాతావరణం కనిపిస్తోంది. 2019లో బీజేపీ, కాంగ్రెసు, వామపక్షాలతో ప్రధాన ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టు సూచనలు లేవు. దీంతో ఎంపీ సీట్లపై పట్టు బిగించాలనుకుంటున్నాయి ప్రాంతీయపార్టీలు. గంపగుత్తగా తమ పార్టీలకే సీట్లన్నీ వచ్చేయాలని ఆశపడుతున్నాయి.

స్వీట్ సిక్స్ టీన్...

రాజకీయాల్లో కేసీఆర్ రూటే సెపరేటు. ఎంఐఎం తో పొ్త్తు కాని పొత్తు కొనసాగుతుంది. హైదరాబాదులో అసదుద్దీన్ నెగ్గేందుకు పరోక్ష సహకారం ఉంటుంది. బీజేపీతో సంబంధాలు బాగానే ఉంటాయి. దానికి ఏ ఒక్క సీటు వదలకుండా ఓడించాలనే లక్ష్యమూ కొనసాగుతుంది. తెలంగాణలోని 17 సీట్లకుగాను హైదరాబాదు మినహాయించి 16 సీట్లు టీఆర్ఎస్ కే దక్కాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. చిన్న రాష్ట్రం కావడం వల్ల తెలంగాణ ప్రాధాన్యం కేంద్రంలో కొనసాగాలంటే అన్ని సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవాల్సిందేనని సీఎం పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. పక్కనున్న ఏపీలో పాతికసీట్లున్నాయి. 15 నుంచి 16 సీట్లు అక్కడ పెద్ద పార్టీకి దక్కుతాయి. వివిధాంశాలపై ఆంధ్రాకు దీటుగా లోక్ సభలో వాణి వినిపించాలంటే మొత్తం సీట్లు టీఆర్ ఎస్ కు వచ్చినప్పుడే సాధ్యమవుతుందనే వాదనను లేవనెత్తుతున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిలో బలమైన నాయకులను ఎంపీలుగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కేసీఆర్, హరీశ్, కడియం శ్రీహరి, తుమ్మలనాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటల రాజేందర్, మహేందర్ రెడ్డి లు ఈసారి ఎంపీ స్థానాలకు పోటీ చేస్తారనేది పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ ఎమ్మెల్యేగానూ పోటీ చేస్తారు. అవసరాన్ని బట్టి సీఎంగా ఉండటమా? లేక హస్తినను ఎంచుకోవడమా? అన్నది నిర్ణయించుకుంటారు.

పాతిక సీట్ల పారాయణం....

ఆంధ్రాలో పార్టీలకు పాతిక సీట్ల పారాయణం గడచిన ఏడాదిగా సాధారణ తంతుగా మారింది. ‘పాతికమంది ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. మేము సిద్దం . మీరు రెడీనా? ’ అంటూ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి పదేపదే సవాల్ విసురుతూ వచ్చారు. టీడీపీ ముందుకు రాలేదు. తమ ఎంపీలు మాత్రమే రాజీనామాలు సమర్పించారు. పాతికసీట్లను తనకు ఇవ్వాలని కేంద్రంలో ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికి తాము మద్దతు ఇస్తామంటూ జగన్ తన విధానాన్ని ప్రకటించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత క్రమేపీ విమర్శల దాడిని పెంచుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు. తాజాగా పాతిక ఎంపీ సీట్లు టీడీపీకి ఇవ్వాల్సిందేనంటూ ప్రజలను గట్టిగా డిమాండు చేస్తున్నారు. ఇది తనకోసం కాదు. రాష్ట్రప్రజల భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం అంటూ ప్రతిసభలో హోరెత్తిస్తున్నారు. ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటూ చెప్పేస్తున్నారు. అటు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగు ద్వారా లొంగదీసి ఓట్లు కొల్లగొట్టాలని యత్నిస్తున్నారంటున్నారు రాజకీయ విమర్శకులు. పునర్విభజన తర్వాత సీట్ల పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం బాగా కుచించుకుపోయింది. రాష్ట్ర అవసరాలు, రాజకీయ అవసరాల నిమిత్తం ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఈరెండు పార్టీలకూ ఉంది. అయితే అది ఎన్నికల తర్వాత మాత్రమే.

పొమ్మనకుండా...

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ బలమైన నాయకులను కేంద్రానికి పంపాలని తలపోస్తున్నారు. దీంట్లో ద్విముఖ వ్యూహం దాగి ఉందంటున్నారు. కచ్చితంగా గెలుపు సాధించడం ఒక లక్ష్యమైతే రానున్న తరానికి అడ్డు తొలగించడం అంతర్గత వ్యూహం. కేసీఆర్ ఆలోచన భిన్నం. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి మంత్రులైన వారు కొందరు తనకు సమకాలికులు, సమఉజ్జీలు, మరికొందరు తనకంటే సీనియర్ మంత్రులు. 2019 తర్వాత కచ్చితంగా యువనాయకత్వానికి పగ్గాలు ఇవ్వాలనే డిమాండు టీఆర్ఎస్ లో పెరుగుతోంది. చేయాలనుకున్న కార్యక్రమాలు అన్నీ తాను పూర్తి చేశాననే కేసీఆర్ భావిస్తున్నారు. మిషన్ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి సాకారమైతే ఇప్పటికి అమలు చేస్తున్న సంక్షేమ , అభివ్రుద్ధి పథకాలను కొనసాగిస్తే చాలు. టీఆర్ ఎస్ అధికారానికి రానున్న 20 ఏళ్లలో ఢోకా లేదని కేసీఆర్ ఇటీవల పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో చెబుతూ వస్తున్నారు. ఒక రకంగా రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. దీనిని విమర్శకులు మరో కోణంలో చూస్తున్నారు. తాను, హరీశ్, మరికొందరు సీనియర్ మంత్రులు హస్తిన బాట పడితే రాజకీయాధికార మార్పిడి సులభంగా సాగిపోతుందనే భావన అయి ఉండొచ్చనేది అంచనా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News