ఇక్కడ ఇలా చేస్తుంటే … అక్కడ తగులుతుందే ?

ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు నిర్ణయాలు టి సర్కార్ కి కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోగా ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలు పిలిచేలా తమ [more]

Update: 2019-06-16 12:00 GMT

ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు నిర్ణయాలు టి సర్కార్ కి కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోగా ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలు పిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రమాణ స్వీకారం చేస్తూనే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అనుకున్నట్లే ఆయన అనితర సాధ్యమైన కొన్ని నిర్ణయాలు ప్రకటించి సంచలనం సృష్ట్టించారు. ఎప్పటికి ఇది జరిగేది కాదనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు తెరతీసి సంచలనం సృష్ట్టించారు జగన్. ఇక ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించడం మారో సంచలనం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు ఉపక్రమించి మరో చరిత్ర లిఖించారు జగన్. ఆశా వర్కర్లకు మూడు వేల రూపాయలనుంచి ఒక్కసారిగా పదివేల రూపాయలకు జీతాన్ని పెంచడం చిన్నవో పెద్దవో రెండులక్షలమంది గ్రామ సేవకులకు ఉద్యోగ కల్పన ఆగస్టు లోగా చేస్తా అని ప్రకటించడం తో నవయువ ముఖ్యమంత్రి దూకుడే దూకుడు గా సాగుతున్నారని తెలుగు రాష్ట్రల్లో ప్రశంసల వర్షం కురుస్తుంది. వీటన్నిటికీ నిధులు ఎలా సమకూరుస్తారన్నది దేవుడెరుగేమో కానీ ఇది పక్క రాష్ట్రం పై తీవ్ర ప్రభావం పడేలా మాత్రం చేస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం పై వత్తిడి పెరుగుతుంది …

దేశం లోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు టి సిఎం కెసిఆర్. అయితే ఆయన ఇలాంటి దూకుడు ప్రదర్శించే మిగులు నిధులతో వున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న విమర్శలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు తలపెట్టడంతో పాటు తొలిసారి అధికారం చేపట్టిన వెంటనే అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించి ఇప్పుడు నిధుల సమస్య ను కొని తెచ్చుకున్నారు. మరో పక్క జగన్ ప్రకటించిన వరాలు ధనిక రాష్ట్రం లో అమలు చేయరా అని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి దాపురించింది. ఉద్యోగులకు 20 శాతం మించి ఐఆర్ ప్రకటించేందుకు అవకాశం లేదని ఇప్పటికే అక్కడి ఆర్ధిక సంఘం హెచ్చరించింది. మరో పక్క సిపిఎస్ రద్దు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం వంటివి టి సర్కార్ నెత్తిన గుదిబండలు అయ్యే ప్రమాదం వుంది. దాంతో జగన్ తీసుకుంటున్న చర్యలు పరోక్షంగా తెలంగాణ సర్కార్ తో పోలిక గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు విశ్లేషకులు. గతంలో కేసీఆర్ తెలంగాణ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చే నడిచేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మరి దీనికి గులాబీ బాస్ ఎలాంటి స్టెప్స్ వేసి తన ఉనికిని కాపాడుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News