ముందుకో… వెనక్కో…త్వరగా తేల్చండి

నవ్యాంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనేక రకాల విమర్శలతో రాజకీయాస్త్రాలను సంధించింది వైఎస్సార్ కాంగ్రెసు [more]

Update: 2019-06-20 14:30 GMT

నవ్యాంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనేక రకాల విమర్శలతో రాజకీయాస్త్రాలను సంధించింది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ. పోలవరమే ప్రధానాంశంగా అధికార తెలుగుదేశం పార్టీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోని ఆరోపణలే కాళ్లకు అడ్డం పడబోతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అడుగులు ఈ ప్రాజెక్టుపై ఏరకంగా ముందుకు పడతాయనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ తీరుపై అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి, పునరావాసపనుల్లో అక్రమాలపై ఆరోపణలు చేసింది. అసలు ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేసింది. ముడుపుల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందని ఆరోపించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపుదలకు కేంద్రం ఆమోదం, పునరావాస బాధితుల తరలింపు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. నిర్మాణ బాధ్యత ఇకపై కేంద్రానిదా? రాష్ట్రానిదా? అనే అనుమానాలూ ఉన్నాయి. రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పట్నుంచి పనులు మందగించాయి. వీటన్నిటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెబుతూ నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవాల్సిన సమయం వచ్చింది.

పార్టీ వేరు..ప్రభుత్వం వేరు..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనిని అనుమానాస్పద ద్రుక్పథంతో చూడటం సహజం. అయితే రేపొద్దున్న తాము అధికారంలోకి వస్తే ఆ పనిని ఎలా పూర్తి చేస్తామనే విషయంపై స్పష్టత ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. తాము ఆరోపణలు గుప్పించిన పార్టీకి తామే అస్త్రాలు ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి అదే. పోలవరం నిర్మాణం విషయంలో ఎలా ముందుకెళ్లాలో తేల్చుకోలేకపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వం వాటాల కోసం, అవినీతి కోసమే అంచనాలు పెంచేసిందని తీవ్రమైన అభియోగాలు మోపింది వైసీపీ. అవినీతిని వెలికి తీసి రివర్స్ టెండరింగ్ చేస్తామనీ ప్రకటించింది. ఇప్పుడు పోలవరం విషయంలో అంచనాలను తగ్గిస్తారా? అవినీతిని వెలికి తీసేందుకు విచారణ జరిపిస్తారా? మరో కాంట్రాక్టర్ ను మారుస్తారా? చట్టపరంగా, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొంటారు? ఇవన్నీ సమస్యలే. మొండిగా తమ వాదనకే కట్టుబడి పోలవరం మొత్తం నిర్మాణ తంతును తిరగదోడాలనుకుంటే పనులు అటకెక్కే ప్రమాదం ఉంది. అలాగని పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తే తెలుగుదేశం రాజకీయ దాడి చేస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి తరహాలో మారింది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను మార్చాలనుకున్నా న్యాయపరంగా చిక్కులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రమా..? కేంద్రమా..?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రమే నిర్మించాల్సి ఉంది. కేంద్రప్రాధాన్యాలు వేరు. తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను తాను స్వీకరించింది. నిధులను మాత్రం కేంద్రమే సమకూరుస్తోంది. పూర్తయిన పనులకు దశలవారీగా బిల్లులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే పోలవరం పనుల నిమిత్తం నాలుగువేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది. అసలు ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలనే తమ డిమాండ్ కే వైసీపీకి కట్టుబడి ఉంటే నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను కేంద్రానికి బదలాయించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రాజెక్టు పనుల్లో అనివార్యంగా జాప్యం చోటు చేసుకుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది మొదలు పనులే నడవడం లేదు. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన తర్వాత మాత్రమే పనుల విషయంలో స్పష్టత రావాలి. ఈ ప్రాజెక్టును కేంద్రానికి వదిలిపెట్టి రాష్ట్రప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా? లేక నిర్మాణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు తరహాలో జగన్ మోహన్ రెడ్డి పూనిక వహిస్తారా? అన్నది ముందుగా తేలాల్సి ఉంది.

కేంద్రం హ్యాపీ…

ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ఎపిసోడ్ లో కేంద్రం హ్యాపీగా ఉంది. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్న చందంగా ఈ జాతీయ ప్రాజెక్టు క్రెడిట్ ను చంద్రబాబు తన సొంతం చేసుకుంటూ వచ్చారు. డబ్బులు కేంద్రం ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి వస్తోంది. గడచిన కొంతకాలంగా పనులు నిలిచిపోవడంతో నిధుల విడుదల కూడా నీరసించింది. రాజకీయ కారణాల రీత్యా పోలవరానికి చిక్కుముడులు పడటం కేంద్రానికీ సంతోషమే. ఒకవేళ వైసీపీ తాను అనుకున్నట్లుగా పంతానికి పోయి కేంద్రానికే పనులు అప్పగిస్తే కావాల్సిందేముంటుంది? కేంద్రం కాతాలో పోలవరం పనులు సాగుతాయి. కేంద్రం నేరుగా పర్యవేక్షణ చేస్తుంది. దానికి తగిన రాజకీయ ప్రయోజనం కూడా దక్కుతుంది. 2024 నాటికి పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. ఇదే అంచనాతో పోలవరాన్ని తమకే అప్పగిస్తే అభ్యంతరం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు సకాలంలో ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేస్తామనీ హామీ ఇస్తున్నారు. తెలంగాణలో ఎలాగూ బీజేపీ కాలుమోపింది. పోలవరం రూపంలో ఆంధ్రాలో సైతం పట్టు సాధించే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రం సొంతంగా చేపడితే పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా రూ.4వేల కోట్లు వరకూ ఉన్నాయి. సవరించిన నిర్మాణ వ్యయానికి కేంద్ర సాంకేతిక కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కానీ రూ. 56 వేల కోట్ల వ్యయంపై ఆర్థికశాఖ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉంది. ఒక వైపు తల ఊపి మరోవైపు నిరాకరించడం ద్వారా రాష్ట్రం ముందుకు వెళ్లకుండా కేంద్రం పాచికలు కదుపుతోంది. అనేక రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉండటంతో తనవంతు వాటా ఏమిటన్నదే బీజేపీ ప్రశ్న. జగన్ మోహన్ రెడ్డి ఈ చిక్కుముడిని ఛేదించి ప్రాజెక్టును సకాలంలో ఎలా పూర్తి చేస్తారన్నదే వేచి చూడాలి.

Tags:    

Similar News