మంచి సీఎం… ముంచే సీఎం ?

జగన్ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి సభలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు, ఆరు నెలల కాలంలో తాను మంచి సీఎం గా [more]

Update: 2019-11-30 16:02 GMT

జగన్ ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి సభలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు, ఆరు నెలల కాలంలో తాను మంచి సీఎం గా జనం చేత అనిపించుకుంటానని. కరెక్ట్ గా నవంబర్ 30కి ఆరు నెలలు నిండాయి. మరి జగన్ మంచి సీఎం అయ్యారా. ఇకపోతే జగన్ అన్న మాటనే కాస్తా తిప్పి ఆయన ముంచే సీఎం అని టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. అవును, టీడీపీ ప్రతిపక్షం అలాగే అంటుంది, అనాలి కూడా లేకపోతే తమ సీటు లాగేసి, పార్టీని పాతాళానికి పడేసిన ప్రత్యర్ధి పార్టీపై ఇంతకంటే ఎలా స్పందిస్తారు. రాజకీయంగా శత్రువులుగా ఉన్న వైసీపీ, టీడీపీల మధ్య మాటలు ఇలాగే ఉంటాయి. అందువల్ల దానికి పెద్దగా ప్రాధ్యానతను జనం కూడా ఇవ్వరు కానీ జగన్ ఆరు నెలల పాలనలో మంచి సీఎం గా అనిపించుకున్నారా అంటే వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం ఓ బ్రహ్మాండంగా అంటున్నారు. జగన్ పేరు జాతీయ స్థాయిలో మారు మోగుతోంది అని వ్యవసాయ మంత్రి కన్నబాబు అంటూంటే మిగిలిన మంత్రులు జగన్ పాలనలో అతి పెద్ద విప్లవాన్ని తెచ్చారు అంటున్నారు.

జనమేమంటున్నారు :

ఏ ప్రభుత్వానికైనా కొలమానం ప్రజలే. విపక్ష పార్టీలు ఎపుడు మెచ్చుకోవు, మేకతోలు కప్పవు. ఆ విధంగా చూసుకున్నపుడు జగన్ మీద జనానికి నమ్మకం అయితే అలాగే ఉంది. జగన్ తలచుకుంటే చేస్తారన్నది జనం మాటగా ఉంది. గత ఆరు నెలలుగా వివిధ సమస్యల మీద చిన్నా చితకా ఆందోళనలు చేసిన వారు సైతం జగన్ కనుక హామీ ఇస్తే తమకు మంచి రోజులు వచ్చినట్లేనని అన్నారు, అంటే జగన్ మాట ఇస్తే తప్పరు అన్నది జన సామాన్యంలో ఉంది. దాన్ని మరింతగా పెంచుకోవడానికి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక జగన్ నవరత్నాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఆయన తాను పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరాలని తపన పడుతున్నారు. ఈ సంగతి జనానికి కూడా చేరడమే జగన్ కి పెద్ద అనుకూల అంశం. అందుకే విపక్షం కనీసమాత్రమైన సమయం ఇవ్వకుండా జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయినా కూడా జనంలో స్పందన పెద్దగా మాత్రం రాలేదు.

సంకల్పం గట్టిదే :

జగన్ సంకల్పం విషయంలో ప్రతిపక్షాలకు కూడా పెద్దగా అనుమానాలు లేవనుకోవాలి. ఆ తాపత్రయం కనబడుతోంది కానీ ఆయన ఇస్తున్న హామీలకు నిధులేవీ అంటున్నారు. అంటే ఒకవేళ హామీలు ఏవైనా అమలు కాకపోయినా నిధులు లేకపోవడం వల్లనే తప్ప జగన్ అవకాశం ఉంటే చేస్తారన్నది ప్రతిపక్షాలకు తెలుసు. అందువల్లనే కేంద్రంలోని బీజేపీ సైతం ఎక్కడ బంధించాలో అక్కడే కట్ చేయాలనుకుంటోందని టాక్ నడుస్తోంది. అయితే జగన్ కూడా ఈ రాజకీయం మీద అవగాహన ఉన్న వారే కాబట్టి ప్రభుత్వ భూములు అమ్మైనా హామీలు నెరవేరుస్తానని అంటున్నారు. దీని మీద కూడా పెద్ద రాధ్ధాంతం అవుతోంది. బిల్డ్ ఆంధ్ర పేరిట ప్రభుత్వ భూములు అమ్మేస్తే రేపటి రోజున ఆస్తులు ఎక్కడ నుంచి వస్తాయని కామ్రేడ్స్ ఓ వైపు కన్నెర్ర చేస్తున్నారు. అదంత సులువుగా జరగదేమోనని అంతా అనుకుంటున్నారు. అందువల్ల అయితే గియితే జగన్ ఆర్ధిక ఇబ్బందులోనే పడతారు కాబట్టి అక్కడే ఆయన పొలిటికల్ గ్రాఫ్ దెబ్బతింటుందని విపక్షం కాసుకుకూర్చుంది. మరి జగన్ హామీలు అయితే బాగున్నాయి. అవి ఆచరణలో ఎంతమేరకు నోచుకుంటాయన్నది రాజకీయ పరిశీలకుకు కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

అవినీతి దిగజారింది :

ఇక జగన్ పాలనలో అవినీతి ర్యాంక్ బాగా వెనక్కు వెళ్ళడాన్ని కూడా మేధావులు తటస్థులు మెచ్చుకుంటున్నారు. గత ఏడాది ఇదే నవంబర్ నాటికి అవినీతిలో ఏపీ అయిదవ ర్యాంక్ ఉంటే ఈసారి 13కి దిగజారింది. అందువల్ల అవినీతి కట్టడి బాగానే ఉంది అంటున్నారు. మొత్తానికి జగన్ పాలన మీద ప్రజల్లో ఆశలు, నమ్మకం ఆరు నెలలైనా ఎక్కడా సడలలేదు కాబట్టి ఆయన మంచి సీఎం అని ఇప్పటికైతే అనుకోవాలి. మరి ముందు ముందు వైసీపీ సర్కార్ పాలన ఎలా సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News