ఆరునెలల అడుగులు…

కుటుంబం నుంచి దేశం వరకూ ఒకటే ఫార్ములా. నేటి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే మార్గదర్శకంగా విధానాలు , ఆచరణ అమలు చేసుకోవాలి. రాష్ట్రంలో వైసీపీ [more]

Update: 2019-11-30 16:22 GMT

కుటుంబం నుంచి దేశం వరకూ ఒకటే ఫార్ములా. నేటి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే మార్గదర్శకంగా విధానాలు , ఆచరణ అమలు చేసుకోవాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచాయి. అసాధారణ మెజార్టీతో గెలిచిన ఈ ప్రభుత్వం పై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆకాంక్షలు ఉన్నాయి. అందుకే రికార్డు స్థాయి విజయాన్ని అందించారు. నిజానికి ఎంత పెద్ద ఘన విజయం సాధిస్తే అంతగానూ డిమాండ్లు పెరుగుతాయి. ప్రజలు పార్టీని సొంతం చేసుకున్న తీరుకు నిదర్శనమే 151 ఎమ్మెల్యే సీట్లు. వైసీపీ ప్రభుత్వానికి నిర్ణయాల అమలులో తిరుగులేని ఆధిక్యం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు చేసేంత స్వేచ్ఛ కూడా లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పునాదులను పటిష్టంగా నిర్మించుకుంటే ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంది. సర్కారుకు స్థిరత్వం లభిస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అభివ్రుద్ధి కార్యక్రమాలకు సైతం పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అప్పుడే రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాలు, అధికారపార్టీ సుదీర్ఘంగా పవర్ లో కొనసాగడానికి దోహదం చేస్తుంది.

సంక్షేమం..సంతృప్తి..

వైసీపీ ప్రభుత్వమంటేనే సంక్షేమం అన్న ముద్ర స్థిరపడిపోయింది. ఎన్నికల మేనిఫెస్టో మీదనే ఫోకస్ పెట్టి పథకాలను పట్టాల కెక్కిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు, హామీలను మించి సంక్షేమపథకాలను అమలు చేశారని చెప్పవచ్చు. నవరత్నాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా , దిక్సూచిగా మారాయి. పార్టీ వ్యవస్థాపనకు ప్రేరణగా నిలిచిన రాజశేఖరరెడ్డి కాంగ్రెసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని పథకాలు ఆయనకు శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. విద్యార్థులకు ఫీజుల తిరిగి చెల్లింపు, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు వై.ఎస్. మార్కు సంక్షేమానికి మారుపేరుగా స్థిరపడిపోయాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటిని మరింత విస్తరించి రాజన్న రాజ్యం అన్న ప్రచారానికి సార్థకత చేకూర్చే దిశలోనే ప్రయత్నిస్తోందని చెప్పాలి. విద్య,వైద్య రంగాల్లో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నించాలన్న ఆశయం కూడా మెచ్చదగినదే. నాడు – నేడు పేరుతో ఆయా రంగాల్లో తెస్తున్న మార్పులను ప్రజల ముంగిట్లో పెడతామని చెప్పడమూ స్వాగతించదగ్గ పరిణామమే. నిజానికి చాలా సంవత్సరాలుగా స్తబ్దత పేరుకునిపోయి, ఉదాసీనతకు మారుపేరుగా మారిపోయాయి ఈ రెండు రంగాలు. రాష్ట్ర ప్రగతికి ఆధారహేతువైన ఇటువంటి కీలక రంగాలపై శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తు అంధకారబంధురమవుతుంది.

నిధులు..అభివృద్ధి…

అధికాదాయ వర్గాలను మినహాయిస్తే ప్రతి కుటుంబానికి సర్కారు నుంచి ఏదో రూపంలో సాయం అందేలా రాష్ట్రంలో పథకాలకు రూపకల్పన చేశారు. అమ్మ ఒడి, ఆసరా, రైతు భరోసా, పింఛన్ , జగనన్న దీవెన వంటి స్కీముల ద్వారా అందిస్తున్న సంక్షేమం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్యాలు గుర్తించిన యంత్రాంగం కూడా ఈవిషయంలో వేగంగానే స్పందిస్తోంది. అయితే అభివ్రుద్ధి విషయంలో ప్రణాళిక ఇంకా రూపుదిద్దుకోలేదు. పునస్సమీక్షలతోనే కాలయాపన సాగుతోంది. గత ప్రభుత్వంలో అన్నిరకాల అభివ్రుద్ధి కార్యక్రమాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ఆరోపించింది. అందుకు అనుగుణంగానే దాదాపు పాతప్రభుత్వం చేపట్టిన పనులన్నిటినీ వైసీపీ సర్కారు అనుమానాస్పద ద్రుక్పథంతోనే చూస్తోంది. కొన్నిటిని నిలిపివేసింది. మరికొన్నిటి విషయంలో రీటెండరింగ్ ద్వారా కొత్త సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించింది. రాజధాని అమరావతి మొదలు, జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వరకూ సమీక్షల బారిన పడి స్తంభించాయి. అలాగని ఈ సర్కారు కొత్త ప్రాజెక్టులు పెద్దగా పట్టాలకు ఎక్కలేదు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిన మాట వాస్తవం. రాష్ట్రం విడిపోయే నాటికి ఉన్న అప్పులను రెట్టింపు చేసింది. ఇప్పుడు రాష్ట్రం తలపై వివిధ రూపాల్లో మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు రుణభారం ఉంది. అందులో టీడీపీ సర్కారు చేసిన అప్పులు లక్షన్నర కోట్ల రూపాయల వరకూ ఉంటాయని అంచనా. వైసీపీ సర్కారు సైతం భారీగానే అప్పులు చేయాల్సిన అనివార్యతలో పడింది. సంక్షేమ పథకాల అమలు, సర్కారు నిర్వహణ కు అయ్యే ఖర్చుకు వచ్చే ఆదాయానికి మధ్య పొంతన లేదు. అందువల్ల 2020 ఆర్థిక సంవత్సరం మొదలయ్యేనాటికి కనీస స్థాయిలో 50 వేల కోట్ల రూపాయలైనా రుణం దూసి తేవాల్సి ఉంటుందనేది అంచనా.

కేంద్రం అసంతృప్తి…

ఎన్నికలకు ముందువరకూ వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ, అప్పటి రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై, బీజేపీపై దాదాపు యుద్దం ప్రకటించినంత హడావిడి చేశాయి. దాంతో అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపిని కేంద్రం కరుణాకటాక్షాలతో వీక్షించిందనే చెప్పాలి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పోలవరం రీటెండర్లు, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కేంద్రం తీవ్ర అసంత్రుప్తిని వెలిబుచ్చింది. పార్లమెంటు సాక్షిగానే ఇది సరైన పద్ధతి కాదంటూ కేంద్రమంత్రులు ప్రకటించారు. ప్రతి ఒప్పందాన్ని తిరగదోడితే దేశంలోకి పెట్టుబడులు నిలిచిపోతాయనేది కేంద్రం ఆందోళన. అదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ శాఖ సైతం వైసీపీ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే కొన్ని విషయాల్లో బీజేపీనే ముందుగా ఆందోళనలకు దిగుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య, రాజధానిలో పనులు నిలిచినందుకు నిరసనగా అమరావతి పర్యటనల వంటివాటి విషయంలో బీజేపీనే ముందుగా చొరవ చూపింది. కేంద్రానికి, రాష్ట్రానికి, బీజేపీకి, వైసీపీకి మధ్య ఈ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అందువల్ల కేంద్రం సహకారంపైనా అనుమానాలు, సందేహాలు నెలకొంటున్నాయి.

సంతులనమే శరణ్యం…

మేధోవర్గాలు, పరిశీలకుల ద్రుష్టిలోంచి చూస్తే సంక్షేమం శ్రుతి మించింది. అభివ్రుద్ధి విషయంలో అడుగులు తడబడుతున్నాయనే వాదనలున్నాయి. పేద,బడుగు వర్గాలకు అవసరానికి మించి లబ్ధి చేకూర్చినా పర్వాలేదు. కానీ రాష్ట్ర భవిష్యత్తు, ఆదాయవనరుల సముపార్జనకు మౌలిక వసతులు, అభివ్రుద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేయాల్సిందేనని తటస్థులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు సైతం తప్పుపట్టే సాహసం చేయలేకపోతున్నాయి. అదొక పాజిటివ్ కోణం. ఆరునెలల స్వల్ప వ్యవధిలో ఈ ప్రభుత్వం సాధించిన విజయంగానే దానిని చెప్పుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ప్రగతికి ద్వారాలు తెరిచినట్లవుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు పూచీకత్తు లభిస్తుంది. అందుకు సంక్షేమం, అభివ్రుద్ధి మధ్య సంతులనమే శరణ్యం. ఈ ఆరునెలలు సంక్షేమంపై ద్రుష్టి పెట్టిన ప్రభుత్వం రానున్న కాలంలో ప్రగతిని పరుగులు పెట్టించే దిశలో పక్కా ప్రణాళికతో ముందు అడుగు వేస్తుందనే ఆశించాలి. అప్పుడే వైసీపీ సర్కారుకు , రాష్ట్రానికి శ్రేయోదాయకం.

Tags:    

Similar News