షర్మిలకు కాంగ్రెస్ ఇలా చెక్ పెడుతుందట

వైఎస్ షర్మిల పార్టీ పెడుతుండటంతో కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్, తెలంగాణలో సోదరి షర్మిల పార్టీని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ [more]

Update: 2021-04-14 12:30 GMT

వైఎస్ షర్మిల పార్టీ పెడుతుండటంతో కాంగ్రెస్ లో కొత్త టెన్షన్ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్, తెలంగాణలో సోదరి షర్మిల పార్టీని ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దీంతో కాంగ్రెస్ ముందస్తు చర్యలను ప్రారంభించిందంటున్నారు. కాంగ్రెస్ కు ప్రధాన ఓటు బ్యాంకు రెడ్డి సామాజికవర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు. వీటిని ఏపీలో జగన్ తన పార్టీకి తీసుకెళ్లిపోయారు.

రెడ్డి సామాజికవర్గం…..

తెలంగాణకు వచ్చే సరికి మైనారిటీలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు ఒకింత కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పాలి. వీరితో పాటు రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్ వైపే ఇప్పటి వరకూ ఉంది. బలమైన బీసీ ఓటు బ్యాంకు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉండటంతో రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఎస్సీ, ఎస్టీ ఓట్లతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓట్లకు గండిపడే ప్రమాదముందన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తమవుతుంది.

ఎవరూ అటు వెళ్లకుండా….

దీంతో రెడ్డి సామాజకవర్గం వారిచేతనే తొలుత కౌంటర్ ఇప్పించాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. మరోసారి కేసీఆర్ కు మేలు చేసేందుకే వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టారన్న ప్రచారాన్ని ఇప్పటికే కాంగ్రెస్ కిందిస్థాయిలోకి తీసుకెళ్లింది. బలమైన రెడ్డి సామాజికవర్గం నేతలు ఎవరూ వైఎస్ షర్మిల పార్టీ వైపు వెళ్లకుండా ముందుగా వారితో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ పై భరోసా కల్పించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును….

ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి నేతలకు షర్మిలకు వ్యతిరేకంగా గళం విప్పేలా చేయాలన్న యోచనలో ఉంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు సయితం కోల్పోకుండా కాంగ్రెస్ దళిత నేతలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. వైఎస్ షర్మిల పార్టీ వైపు పేరున్న నేతలు ఎవరూ వెళ్లకుండా చూడాలని ఇప్పటికే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. షర్మిలను రాజకీయంగా తొలినాళ్లలోనే కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News