తనఖాకు రెడీ అంటున్న దేవుడి బంగారం ….?

కరోనా దెబ్బతో దేవాలయాలు అప్పులపాలు అయిపోతున్నాయి. దాదాపు ఆరునెలలుగా భక్తులు ఇచ్చే కానుకలు లేకపోవడంతో సిబ్బంది జీతభత్యాలు ధూప, దీప నేవైద్యాలకు సైతం సొమ్ములు లేక ఆలయ [more]

Update: 2020-09-03 11:00 GMT

కరోనా దెబ్బతో దేవాలయాలు అప్పులపాలు అయిపోతున్నాయి. దాదాపు ఆరునెలలుగా భక్తులు ఇచ్చే కానుకలు లేకపోవడంతో సిబ్బంది జీతభత్యాలు ధూప, దీప నేవైద్యాలకు సైతం సొమ్ములు లేక ఆలయ నిర్వహణ కమిటీలు చేతులు ఎత్తేస్తున్నాయి. దీనికి పెద్ద చిన్నా ఆలయాలని తేడా ఏమీ లేదు. పెద్ద ఆలయాలకు కోట్ల రూపాయల నిర్వహణ వ్యయం అవసరం అవుతూ ఉంటే చిన్న వాటికి లక్షల రూపాయల్లో ఖర్చులకు కావాలిసి వస్తుంది. అయితే భక్తుల రాకకు కరోనా అడ్డంకిగా మారడంతో కిం కర్తవ్యం అన్నది పాలకమండళ్ళకు పెను సవాల్ గా మారింది. నిత్యం లక్షమంది వరకు భక్తుల దర్శనం కోట్ల రూపాయల ఆదాయం వచ్చే తిరుమల వెంకన్న దర్శనానికి ప్రస్తుతం ఐదు వేలనుంచి 10 వేల లోపు మాత్రమే భక్తులు వస్తూ ఉండగా హుండీ ఆదాయం 50 లక్షల వరకు లభిస్తుంది. గతంలో నిత్యం వచ్చే ఆదాయమే కోట్ల రూపాయల్లో టిటిడి కి ఉండేది. ప్రస్తుత ఆదాయం వేలమంది ఉద్యోగులు పని చేసే తిరుమలకు ఏ మాత్రం సరిపోదు.

కేరళలోను అదే పరిస్థితి …

అలాగే కోట్లమంది భక్తులు వచ్చే శబరిమల ఆలయానిది ఇదే పరిస్థితి అక్కడ కూడా జీతాలకే ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ ఆదాయం గుండు సున్నా అయిపొయింది. ఇక కేరళలో గురు వాయుర్ నుంచి వెయ్యి కి పైగా ఉన్న ఆలయాల ఆర్థికపరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ కష్టాలనుంచి గట్టెక్కే దారిలేక ఇక భక్తులు ఇచ్చిన బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ లో తనఖా పెట్టాలని ట్రావెన్ కొర్ దేవస్థానం సహా పలు ఆలయ కమిటీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బిజెపి వర్గాలు మాత్రం బంగారాన్ని కుదవ పెట్టడానికి ససేమిరా అంటున్నాయి. అటు బంగారం తాకట్టు పెట్టకుండా ఇటు సాధారణ స్థితికి ఎప్పటికి చేరతామో తెలియక ఏమి చేయాలన్న బెంగతో ఆలయ పాలకమండళ్ళు అల్లాడిపోతున్నాయి.

వ్యాపారాలు కూడా దెబ్బతిని….

కొన్ని దేవాలయాల సమీపంలో వ్యాపారాలు చేసుకునేవారు తమ పాట డబ్బు తిరిగి చెల్లించాలని భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయి బిజినెస్ తీవ్రంగా దెబ్బతిందని పాలకమండళ్ళపై వత్తిడి తెస్తున్నారు. ఇది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని కమిటీలు వాపోతున్నాయి. ప్రభుత్వాలే ఆదుకోవాలని పదేపదే కోరుతున్నాయి. అయితే అటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఆర్ధిక కష్టాలు అందరికి ఒకేలా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చేవరకు ఆలయాలకు పూర్వ వైభవం కష్టమే అని తేలిపోతుంది.

Tags:    

Similar News