అఫ్గాన్ వనరులపై చైనా కన్ను

మధ్య ఆసియా దేశమైన అఫ్గాన్ పరిణామాలపై యావత్ అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అక్కడి ప్రజల భద్రత, ఆ దేశ మనుగడ, అక్కడి పరిణామాలు తమపై చూపే [more]

Update: 2021-08-25 16:30 GMT

మధ్య ఆసియా దేశమైన అఫ్గాన్ పరిణామాలపై యావత్ అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అక్కడి ప్రజల భద్రత, ఆ దేశ మనుగడ, అక్కడి పరిణామాలు తమపై చూపే ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నాయి. మున్ముందు జరగబోయే పరిణామాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. అఫ్గాన్ పరిస్థితులపై సంతోషంగా ఉన్న దేశాలు మూడే మూడు. అవి పొరుగునున్న చైనా, రష్యా, పాకిస్థాన్. ఇందుకు కారణాలు లేకపోలేదు. తాను పెంచి పోషించిన తాలిబన్లు పట్టు సాధించిడం పాక్ కు ఆనందదాయకం. తన శత్రువైన అమెరికా… అఫ్గాన్ నుంచి పెట్టాబేడా సర్దుకుని పలాయనం చిత్తగించడం రష్యాకు సంతోషం కలిగస్తుంది. తాలిబన్ల రాకతో అఫ్గాన్ లో భారత్ ప్రాధాన్యం కోల్పోవడం చైనాకు ఎక్కడ లేని మోదాన్ని కలిగిస్తుంది.

చైనాకు మిత్రులే…?

చైనాతో 57, పాకిస్థాన్ తో 2670 కిలోమీటర్ల సరిహద్దు అఫ్గాన్ కలిగి ఉంది. రష్యాతో నేరుగా సరిహద్దు లేదు. అయితే ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాలైన ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ తో 144 కిలోమీటర్ల సరిహద్దును అఫ్గాన్ పంచుకుంటోంది. అఫ్గాన్ పరిణామాలు చైనాకు ఎలా మేలు కలిగిస్తాయన్నది ఆసక్తికరం. నిజానికి రెండు దేశాల మధ్య ఎలాంటి సారూప్యతా లేదు. మతం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, అలవాట్ల మధ్య అసలు పొంతనే లేదు. కానీ శత్రువు శత్రువు మిత్రుడన్న సామెత ప్రకారం భారత వ్యతిరేక తాలిబన్లు బీజింగ్ కు సహజంగానే మిత్రులు. దీనికితోడు అఫ్గాన్ లోని వనరులపై కన్నేసిన చైనా ఆ దేశంపై ఎక్కడ లేని ప్రేమను ప్రదర్శిస్తోంది. తాలిబన్లు కాబూల్ ను వశం చేసుకున్న వెంటనే వారిని గుర్తిస్తున్నట్లు, అఫ్గాన్ జాతి పునర్నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ హడావుడిగా ప్రకటించారు.

సహజవనరులను….?

అఫ్గాన్ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను చైనా గౌరవిస్తుందని, అక్కడ ఇస్లామిక్ సమ్మిళిత సర్కారు ఏర్పాటు కావాలన్నదే తమ అభిమతని గంభీరంగా పేర్కొన్నారు. అఫ్గాన్ లోని విలువైన ‘రేర్ ఎర్స్త్’ పై కన్నేసిన కారణంగానే చైనా తాలిబన్లకు దగ్గరవుతుందని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. కంప్యూటర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, హైబ్రిడ్ కార్లు, టెలివిజన్లు, సూపర్ కండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీకి వీటి అవసరం ఎంతో ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపు 85 శాతం రేర్ ఎర్త్స్ ఖనిజాలను సొంతం చేసుకున్న చైనా చూపు ఇప్పుడు అఫ్గాన్ సహజ వనరులపై పడిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పెట్రోలియం బావులు, రాగి గనుల తవ్వకాలపై అఫ్గాన్ తో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్గాన్ సహజ వనరులను తరలించుకుపోయేందుకు అవసరమైన రవాణా మార్గాన్ని సైతం బీజింగ్ సిద్ధం చేసుకుంటోంది.

ఈ రహదారి పూర్తయితే….?

అఫ్గాన్ సరిహద్దులో గల బదక్షాన్ ప్రావిన్స్ లోని నజాక్ ప్రాంతంలో 50 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తోంది. దీని నిర్మాణాన్ని 2020లో నాటి అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రారంభించారు. ఇప్పటికే 20 శాతం పైగా పని పూర్తయింది. ఈ రహదారి పని పూర్తయితే చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ కు రాకపోకలు సులభతరమవుతాయి. అఫ్గాన్ సహజ వనరులపై ఎప్పుడో కన్నేసిన వ్యూహాత్మకంగా ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టింది, ఇప్పుడు తనకు మిత్రులైన తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంతో రహదారి పనిని వేగవంతం చేసింది. దీనివల్ల చైనాకు వాణిజ్యపరంగా మరింత మేలు చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయకోణంలో చూస్తే దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించడం, తన పట్టు పెంచుకోవడం చైనా అసలు ఉద్దేశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News