కేఈ యాక్టివ్ అయ్యారు.. కోట్ల దూకుడు పెంచారు.. బాబుకి జండూబామ్

జండూబామ్‌.. జండూబామ్‌.. నొప్పి నివారిణి బామ్..! అంటూ.. టీడీపీ నేత‌లు పాడుతున్నారు. అదేంటి కీల‌క పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు ఎందుకిలా వ్యవ‌హ‌రిస్తున్నారు ? అనే [more]

Update: 2021-02-06 06:30 GMT

జండూబామ్‌.. జండూబామ్‌.. నొప్పి నివారిణి బామ్..! అంటూ.. టీడీపీ నేత‌లు పాడుతున్నారు. అదేంటి కీల‌క పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు ఎందుకిలా వ్యవ‌హ‌రిస్తున్నారు ? అనే సందేహం రావ‌డం ఖాయం. విష‌యానికి వ‌స్తే.. నిన్న మొన్నటి వ‌ర‌కు పార్టీలో ఉన్నారో.. లేదో .. కూడా తెలియ‌ని నాయ‌కులు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రావ‌డంతో మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇది మంచి ప‌రిణామ‌మే. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తామంటే.. మెజారిటీ పంచాయ‌తీలు సాధిస్తామంటే.. పార్టీ అధి నేత చంద్రబాబు మాత్రం కాదంటారా? ఆయ‌న కోరుకునేది కూడా ఇదే క‌దా?! కానీ.. ఇక్కడే అస‌లు చిక్కంతా ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు కూడా సార్వత్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న విష‌యం తెలిసిందే.

పంచాయతీ ఎన్నికలు రావడంతో….

ఈ స‌మయంలో నిన్న మొన్నటి వ‌ర‌కు మూల‌న‌బ‌డ్డ టీడీపీ సీనియ‌ర్ నేత‌లు ఒక్కసారిగా రంగంలోకి దిగడం కూడా పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్నూలు రాజ‌కీయాలు చూసుకుంటే.. ఈ జిల్లాలో టీడీపీ గ‌త ఐదేళ్ల చంద్రబాబు పాల‌న‌లో బాగానే ఉంది. అయితే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. కోట్ల కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారు. దీంతో కేఈ కుటుంబం ముందు వ్యతిరేకించినా.. త‌ర్వాత మాత్రం చంద్రబాబు చేసిన రాజీతో.. స‌ర్దుబాటు ధోర‌ణిని ప్రద‌ర్శించింది. చంద్రబాబు కేఈ కుటుంబానికి రెండు సీట్లు, కోట్ల కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. కానీ, ప్రజ‌లు మాత్రం ఈ రెండు కుటుంబాల రాజ‌కీయాల‌ను హ‌ర్షించ‌లేదు. దీంతో ఇరు ప‌క్షాలు.. గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయాయి.

కేఈ కుటుంబం….

ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైన క్రమంలో.. కేఈ ప్రభాక‌ర్ దూకుడు పెంచారు. డోన్ స‌హా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో అంతా త‌నే అయి.. వ్యవ‌హ‌రించేందుకు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి గ‌త ఏడాది పార్టీకి కూడా ప్రభాక‌ర్ రాజీనామా చేశారు. కోట్ల కుటుంబం ఎంట్రీతోనే తాను రిజైన్ చేస్తున్నాన‌ని అనుచ‌రులకు చెప్పారు. ఇక‌, అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు రెడీ కావడం.. మ‌రోవైపు కోట్ల కుటుంబం ఇనాక్టివ్‌గా ఉండ‌డంతో కేఈ ఎంట్రీ ఇచ్చారు. దీనికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కోట్ల సయితం…?

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో డోన్‌లో స‌మావేశం నిర్వహించారు. తాను పార్టీలోనే ఉన్నాన‌ని.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ఆయ‌న శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. దీంతో మ‌ళ్లీ టీడీపీలో విభేదాలు ఖాయ‌మ‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్రబాబుకు మ‌ళ్లీ త‌ల‌పోటు త‌ప్పద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. గ‌తంలోనూ ఈ రెండు కుటుంబాలు క‌లిసిన‌ట్టే క‌లిసినా.. పార్టీకి ప్రయోజ‌నం లేకుండా పోయింది. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News