ఇప్పుడిప్పుడే అసహనం….ఎంతెంత దూరం…?

లాక్ డౌన్ రెండుతో ప్రజల్లో ఇప్పుడిప్పుడే కాసింత అసహనం మొదలైంది. మరో పదిరోజుల్లో ఎత్తేసి ప్రజల దైనందిన కార్యకలాపాలకు అనుమతించాల్సి ఉంది. కానీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. [more]

Update: 2020-04-24 16:30 GMT

లాక్ డౌన్ రెండుతో ప్రజల్లో ఇప్పుడిప్పుడే కాసింత అసహనం మొదలైంది. మరో పదిరోజుల్లో ఎత్తేసి ప్రజల దైనందిన కార్యకలాపాలకు అనుమతించాల్సి ఉంది. కానీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి ఈనెల 27 న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారనేది సమాచారం. దీంతో మరోసారి ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ప్రధానితో ముఖ్యమంత్రులు ఏం చెబుతారో, ఆయన ఏవిధంగా స్పందిస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రధాని వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఆయన చేసే సూచన, చెప్పే మాట శిరోధార్యమన్నట్లుగా ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తున్నారు. తమ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూలంకషంగా వివరించేందుకు ప్రయత్నించడం లేదు. కొందరైతే నేలవిడిచి సాము చేస్తూ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించాలి. రేషన్ కార్డులు, ఏదో ఒక గుర్తింపు ఉన్నవాళ్లకు ఫర్వాలేదు. కానీ ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్లకు మాత్రం లాక్ డౌన్ నిజంగా నరకం చూపిస్తోంది. ఇదిలా ఉండగా పరిస్థితులను మదింపు చేసుకుంటున్న పార్టీలు రాజకీయంగా యాక్టివేట్ అవుతున్నాయి.

అధ్యయనంతో అడుగులు…

కాంగ్రెసు పార్టీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అంశాన్ని అధ్యయనం చేసేందుకు, పార్టీ పరంగా తమ స్టాండ్ ఎప్పటికప్పుడు ప్రకటించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తనవంతు రాజకీయ వైఖరి తీసుకుంది. అవసరమైన సాంకేతిక విషయాలను మన్మోహన్ బృందం అందిస్తే దానికనుగుణంగా స్పందించేందుకు సిద్దమవుతోంది. లాక్ డౌన్ కంటే తదనంతర పరిస్థితులే భయం పుట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఏం జరుగుతుందో పెద్దగా తెలియడం లేదు. ఒక్కసారిగా జనజీవన స్రవంతి మొదలైన తర్వాత రెక్కడితే కానీ డొక్కాడని జీవుల సంగతేమిటన్న ప్రశ్న వెన్నాడుతోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాలు పేదలకు బియ్యం, పప్పు ఉప్పు వంటి తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత ఇంటి అద్దెలు మొదలు అన్ని చెల్లింపులకు వెదుకులాట తప్పదు. అందుకే వాట్ నెక్స్ట్ అన్నదే భయపెడుతోంది.

ప్రతి కుటుంబానికి…..

కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తన విధానాన్ని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి ఏడువేల అయిదువందల రూపాయలు ఇస్తే తప్ప ప్రజలు తమ దైనందిన వ్యవహారాలను పున: ప్రారంభించి కోలుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన వివిధ పథకాలు మధ్యతరగతికి తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తున్నాయి, తప్పితే భారాన్ని తగ్గించడం లేదు. దీనిపై రాజకీయ పార్టీలు తమదైన పంథా అనుసరించే అవకాశం ఉంది. ఇంతవరకూ ప్రజలు కేంద్రంతో కలిసి నడుస్తున్నారనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు కూడా కేంద్రానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. పెద్దగా ఆందోళన స్వరం వినిపించకుండా సంయమనం పాటిస్తున్నాయి. కానీ ప్రజల్లో అలజడి కనిపిస్తే దానిని తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకోవడానికి రాజకీయం ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పటికే అధికారపార్టీపై కారాలు మిరియాలు నూరుతోంది. తెలంగాణ కంటే ఏపీలోనే కరోనా రాజకీయం సెగలు కక్కుతోంది. బీజేపీ, వైసీపీలు సైతం వేడి రగిలిస్తున్నాయి.

ప్రచార యావ…

కొందరు నాయకుల ప్రచారయావ కరోనా విషయంలో సీరియస్ నెస్ ను తగ్గించేస్తోంది. తాము చేసే ప్రతి పని ప్రజల్లోకి వెళ్లితీరాలనే కోరికతో కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వందల మందిని పోగేయడం వంటివి చేస్తున్నారు. అధికారులు వీటిని అదుపు చేయలేకపోతున్నారు. అగ్రనాయకత్వాలు కట్టడి చేయడం లేదు. లాక్ డౌన్ ముందు అందరూ సమానమే. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. క్వారంటైన్, ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు వసతి సదుపాయాలు సరిగా ఉన్నాయో లేదో, వైద్యులకు రక్షణ పరికరాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలి. నిత్యావసర సరుకులు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ, వాడ వాడకీ పంపిణీ అయ్యేలా జాగ్రత్త వహించాలి. ఆ పనులను మానేసి ఎమ్మెల్యేలు, నాయకులు పబ్లిసిటీ గిమ్మిక్కులకు పాల్పడితే ప్రజారోగ్యానికే ప్రమాదకరం. ప్రజలు ఇంతవరకూ అధికారులకు, పోలీసులకు చాలమేరకు సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు భిన్నంగా ప్రవర్తిస్తే చెడు సంకేతాలు పంపినట్లవుతుంది. రాజకీయ రచ్చ సంగతి ఎలాగూ ఉండనే ఉంటుంది.

ఇంకెన్నాళ్లు..?

మనమింకా ఇంకెన్నాళ్లు? ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రశ్న ప్రజలను తీవ్రంగానే వేధిస్తోంది. ఉద్యోగ, ఉపాధి సంగతులు పక్కన పెట్టినా సామాజిక జీవనానికి అలవాటు పడిన ప్రజలు తీవ్రమైన మానసిక సంకోచానికి గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరో రెండు నెలల వరకూ సాధారణ జన జీవనానికి ఆస్కారం ఉండక పోవచ్చనేది వైద్యరంగం వేస్తున్న అంచనా. ప్రభుత్వానికి సైతం అంతటి దీర్ఘకాలం ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం లేదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా చైనాను కొంత మేరకు దూరం పెట్టాలనే యత్నాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి, ఎగుమతుల రంగంలో భారత్ కు అపారమైన అవకాశాలున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు వెలువడుతున్నాయి. అయితే దీర్ఘకాలం లాక్ డౌన్ లో ఉండిపోతే అందివచ్చే మార్గాలు మూసుకుపోతాయి. సంక్షోభాన్ని సవాల్ గా, సదవకాశంగా మలచుకోగలిగితే భారత్ అభివృద్ధి చెందిన దేశం హోదాను సగర్వంగా క్లెయిం చేయగలుగుతుంది. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచుతూ పకడ్బందీ ప్రణాళికతో లాక్ డౌన్ ను ఎత్తేయడానికి ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటేనే ఇండియన్ డ్రీమ్ నెరవేరుతుంది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News