సెంటిమెంటే సిఎంను చేస్తుందట

ప్రతి మనిషి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు (నమ్మకాలు) ఉంటాయి. అవే వారిని నడిపిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు ఇటువంటి సెంటిమెంట్లు (నమ్మకాలు) మరీ ఎక్కువ. వాటిని వారు [more]

Update: 2019-10-23 16:30 GMT

ప్రతి మనిషి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు (నమ్మకాలు) ఉంటాయి. అవే వారిని నడిపిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు ఇటువంటి సెంటిమెంట్లు (నమ్మకాలు) మరీ ఎక్కువ. వాటిని వారు పూర్తిగా విశ్వసిస్తారు. ఎట్టి పరిస్థితిల్లోనూ విస్మరించరు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చూస్తే ఈ విషయంలో ఇట్టే అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించి కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఆ సెంటిమెంట్లు నిజమవుతాయని బీజేపీ, శివసేన కూటమి బలంగా విశ్వసిస్తోంది. ఆ మేరకు రేపటి ఎన్నికల్లో తమ విజయం తధ్యమని భారతీయ జనతా పార్టీ – శివసేన కూటమి ఢంకా భజాయిస్తోంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావడం అనివార్యమని కమలం పార్టీ ధీమాగా ఉంది. శివసేన కూడా ఇదే అభిప్రాయంతో ఉంది.

సెంటిమెంట్ ఏంటంటే….?

ఇంతకీ ఏమిటా సెంటిమెంట్? ఇది ఎంతవరకు నిజం? అన్న ప్రశ్నలు సమజంగానే ఉత్పన్నమవుతాయి. వివరాల్లోకి ఒకసారి వెళితే ఆసక్తిగా ఉంటాయి. దేశంలో సంపన్న రాష్ట్రం, పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. యూపీ తరువాత 288 స్థానాలతో రెడో పెద్ద రాష్ట్రంగా గుర్తింపుపొందింది. లోక్ సభ ఎన్నికలు జరిగిన నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇది మూడు దఫాలుగా జరుగుతోంది. ఇక కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ రాష్ట్రంలో విజయం సాధించడం సంప్రదాయంగా వస్తోంది. గత పదేళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ మేరకు ఈ దఫా తమ విజయం తధ్యమని బీజేపీ, శివసేన కూటమి బలంగా భావిస్తోంది. కేంద్రంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. సెంటిమెంట్ ప్రకారం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి. పరిస్థితులు కూడా ఆ దిశగానే సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడు దఫాలుగా….

ప్రస్తుత పరిస్తితుల్లో ఫడ్నవిస్ ప్రభుత్వం మరో అధికారం చేపట్టడం నివార్యమన్నది విశ్లేషకుల అంచనా. ఈ సంప్రదాయానికి 2004లో తొలిసారి బీజం పడింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో కొలువుదీరింది. 1996లో పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి అంనంతరం 2004 మే నెలలో యూపీఏ సర్కార్ ఏర్పాటైంది. అనంతరం అదే ఏడాది అక్టోబర్, నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో గెలవడం ప్రారంభమైంది. అప్పుడే నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న శరద్ పవార్ సారధ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ కు చెందిన దళిత నాయకుడు సుశీల్ కుమార్ షిండే పగ్గాలు చేపట్టారు. తరువాత రోజుల్లో రాజకీయ పరిస్థితులు మారడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పగ్గాలను విలాస్ రావు దేశ్ ముఖ్ చేపట్టారు.

2009 ఎన్నికల్లోనూ రిపీట్….

ఇదే సెంటిమెంట్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రుజువైంది. అప్పట్లో మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ సర్కార్ విజయం సాధించింది. అనంతరం అదే ఏడాది అక్టోబర్, నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ (నమ్మకం) నిజమైంది. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి రెండోసారి గెలుపొందింది. విలాస్ రావు దేశ్ ముఖ్ మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. తరువాత రోజుల్లో ముఖ్యమంత్రి పదవి నాందేడ్ ప్రాంతానికి చెందిన అశోక్ చవాన్ చేపట్టారు. ఆయన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్.బి.చవాన్ కుమారుడు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.

మూడోసారి కూడా….

2014లో కూడా వరుసగా ముచ్చటగా మూడోసారి ఈ సెంటిమెంట్ నిజమైంది. ఆ ఏడాది మే నెలలోజరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ విజయదుంధుబి మోగించింది. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచడంతో ఆ పార్టీ సొంతంగా అధికారాన్ని చేపట్టింది. అనంతరం అదే ఏడాది అక్టోబర్, నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ, శివసేన ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఇదే తరహాలో ముందుకు సాగాయి. రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ 120కి పైగా స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. శివసేన 60కి పైగా స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్, ఎన్సీపీ లది కూడా ఇదే పరిస్థితి. వేర్వేరుగా పోటీ చేసినందున నష్టం ఏమిటో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనుభవ పూర్వకంగా గ్రహించాయి. చివరకు బీజేపీ, శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. నాగ్ పూర్ (వెస్ట్) నియోజకవర్గం నుంచి ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అయ్యారు. అయిదేళ్లు విజయవంతంగా పనిచేశారు. వసంత్ దాదా పాటేల్ తరువాత అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన రెండో సీఎం ఫడ్నవిస్ కావడం విశేషం. మరాఠాల ప్రబల్యంగల రాష్ట్రానికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవిస్ సీఎం కావడం విశేషం. ఇక పాత సెంటిమెంట్ ప్రకారం కాషాయ కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని ఎన్నికల ప్రచారతీరుతెన్నులు తెలియజేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అంతర్గత పరిస్థితుల కారణంగా కనీసం గట్టి పోటీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు. శరద్ పవార్ ఈడీ కేసులో చిక్కుకోవడం, కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉండడంతో బీజేపీ, శివసేన కూటమికి తిరుగు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరాఠా పీఠాన్ని మళ్లీ దక్కించుకోగలమన్న ధీమా బీజేపీ, శివసేన వ్యక్తం చేస్తోంది. దీని కాదనే పరిస్థితి కూడా లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News