మళ్ళీ పవన్ బాబు కలుస్తారా?

రీల్ హీరోలకు, రియల్ హీరోలకు మధ్య తేడా తాజా ఎన్నికలు నిరూపించాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా నాయకులు ప్రయత్నం చేస్తారు. [more]

Update: 2019-06-21 06:30 GMT

రీల్ హీరోలకు, రియల్ హీరోలకు మధ్య తేడా తాజా ఎన్నికలు నిరూపించాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా నాయకులు ప్రయత్నం చేస్తారు. అదే రీల్ హీరోలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారన్న భావన జనంలో ఉంది. పైగా వారికీ జనానికీ మధ్య వెండి తెర ఇనుప తెరలా అడ్డుతగులుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఎంత హీరోయిజం చూపించినా, మరెంతగా అభిమానించినా కూడా సినిమా వారిని జనం పెద్దగా నమ్మడంలేదు. అయితే వారి వల్ల ఉపయోగం ఉంది. వారికి పైసా ఖర్చు లేకుండా జనం తరలివస్తారు. అదే విధంగా వారు చెప్పిన విషయాలు జనంలోకి సూటిగా వెళ్తాయి. నమ్మడం, నమ్మకపోవడం వారి నడతను బట్టి ఉంటుంది కానీ క్రౌడ్ పుల్లర్స్ గా సినీ జీవులు రాజకీయాల్లో ఇప్పటికీ బాగానే పనికొస్తున్నారు.పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ ఇలానే ఉపయోగ పడింది

అప్పట్లో హిట్ :

సరిగ్గా అయిదేళ్ళ క్రితం సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఇలాగే రెండు పెద్ద రాజకీయ పార్టీలకు ఉపయోగపడ్డారు. అప్పట్లో గట్టిగా పోరు సాగింది. అటు బలంగా వైసీపీ ఉంటే ఇటు టీడీపీ ఉంది. తులసీదళంలా మధ్యలో పవన్ వచ్చి తులాభారాన్ని టీడీపీ వైపు మొగ్గేలా చేశారు. దాంతో సైకిల్ యమ జోరుగా పరుగులు తీసింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు పదేళ్ళ విరామం తరువాత అధికారాన్ని పట్టేశారు. తన సినీ గ్లామర్ కి తోడు, సామాజిక వర్గం బలం కూడా పవన్ కళ్యాణ్ టీడీపీకి బదిలీ చేయగలిగారు. దాన్ని ఒడుపుగా అందిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లుగా మార్చుకోగలిగింది. ఇలా పవన్ చరిష్మా అయిదేళ్ళ క్రితం వూరూ వాడా మారుమోగిపోయింది.

సొంతంగా జీరోనే :

అయితే ఇదంతా తన సొంత బలం అనుకుని అహానికి పోయిన పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నుంచి పోటీకి దిగారు. తాజా ఎన్నికల్లో 135 ఎమ్మెల్యే సీట్లకు పోటీ పడితే పవన్ కళ్యాణ్ పార్టీకి దక్కింది ఒకే ఒక్క సీటు. అదీ 1500 ఓట్ల తేడాతో. రాజోలు నుంచి గెలిచిన రాపాక వర ప్రసాద్ కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. అ గెలుపు పూర్తిగా ఆయన ఖాతాలోనే వేయాలి. ఇక పవన్ పోటీ చేసిన రెండు సీట్లలో కూడా దారుణంగా ఓటమి పాలు అయ్యారు. అంటే పెరటి చెట్టు మందు ఇంటి వాడకానికి పనికి రాదు అని పవన్ కళ్యాణ్ రుజువు చేశారన్నమాట. అయితే పవన్ కి ఇప్పటికీ 2014 నాటి గ్లామర్ ఉంది. ఆయన సినీ జనం, కులబలం అలాగే ఉన్నాయి. కానీ వాటిని ఓట్లుగా మలచుకునే నైపుణ్యం మాత్రం పవన్ కళ్యాణ్ వద్ద లేకపోవడమే ఓటమికి దారి తీసిందని అంటున్నారు.

సరిగ్గా దీన్ని గుర్తించిన చంద్రబాబు పవన్ని మరో మారు తన వైపుకు తిప్పుకుని వచ్చే ఎన్నికల నాటికి కొత్త బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ , బాబు విడిగా పోటీ చేస్తే 2024లో కూడా తాజా ఫలితాలే రిపీట్ అవుతాయి. ఈ సంగతి చెప్పడానికి పెద్దగా రాజకీయ అనుభవం కూడా అవసరం లేదు. అదే ఈ ఇద్దరూ కలిస్తే మాత్రం కోస్తా రాజకీయం రూపురేఖలు మారుతాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇపుడు జగన్ కి బాగా బలం ఉంది, జనంలో మోజు కూడా ఉంది. అందువల్ల కొన్నాళ్ళు టైం ఇచ్చి బాబు పవన్ కళ్యాణ్ తమ రాజ‌కీయ ఎత్తుగడలకు పదును పెడతారని అంటున్నారు. అదే జరిగితే జగన్ జాగ్రత్త పడడం మంచిదని కూడా విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News