వారు సైకిలెక్కేది డౌటే .. అందుకు రీజన్ ఇదే

దళితులు ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఉనికి రాజకీయాల్లో ఎంత ఉంది అనే కంటే వారి అవసరం రాజకీయ జీవులకు ఎంతో ఉంది అనుకోవడం [more]

Update: 2020-05-21 12:30 GMT

దళితులు ఈ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఉనికి రాజకీయాల్లో ఎంత ఉంది అనే కంటే వారి అవసరం రాజకీయ జీవులకు ఎంతో ఉంది అనుకోవడం మాత్రం సబబు. స్వాతంత్ర్యం భారత్ కి ఇచ్చే ముందు ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని మహమ్మద్ ఆలీ జిన్నా పట్టుపడ్డి పాకిస్థాను సాధించాడు. అదే సమయంలో అంబేద్కర్ దళితస్థాన్ కావాలని డిమాండ్ చేశారని అంటారు. అయితే ఈ దేశ జీవన విధానానికి ఆదిగా ఉంటూ సంస్కృతిలో భాగమైన దళితులు విడిపోతే భారత్ కి అర్ధమేలేదు. అందుకే అంబేద్కర్ ని ఒప్పించి ఆయన్ని దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిని చేశారని చెబుతారు. ఆయనకు భారత రాజ్యాంగం రాసే ఉన్నత గౌరవాన్ని కూడా కల్పించారు. అయితే అంబేద్కర్ భావజాలం వేరు. ఆయన దళితులు శాసించాలి కానీ, దేబిరించకూడదు అని గట్టిగా కోరుకునేవారు.

ఓటు బ్యాంక్ గా…

ఇక అంబేద్కర్ భావజాలాన్ని దళితులు ఎలా అర్ధం చేసుకున్నారో కానీ రాజకీయ జీవులు మాత్రం వారిని ఓటు బ్యాంక్ గానే ఇప్పటివరకూ కూడా చూశారు. ఎప్పటికపుడు రిజర్వేషన్లు పెంచుతూ పోయారు. వారిని పదవులు ఇస్తూ తమ వద్దనే ఉంచుకునేట్లు చేశారు. ఇది డెబ్బై అయిదేళ్ళుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కి దళితులు దశాబ్దాలుగా ఓటు బ్యాంక్ గా ఉన్నారు. ఆ తరువాత దళితులు ప్రాంతీయ పార్టీలు పెడితే వారి వైపు మళ్ళారు. లేక బీసీలు బలంగా ఉంటే అటు వైపూ చూశారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో మొదటి నుంచి దళితుల మద్దతు తక్కువే.

కాంగ్రెస్ వెంటే ….

1983లో ఎన్టీరామారావు అఖండ మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు కూడా కాంగ్రెస్ పునాదులు కదిలిపోలేదంటే దానికి కారణం దళితులే. ఆ తరువాత వైఎస్సార్ చనిపోయేంతవరకూ దళితులు కాంగ్రెస్ వెంటనే ఉన్నారు. ఆ తరువాత వారంతా ఆయన కుమారుడు జగన్ వైపు మళ్ళారు. ఓ విధంగా వైఎస్సార్ కుటుంబానికి దళితులకు మధ్య ఉన్నది రాజకీయ బంధం మాత్రమే కాదు, సామాజిక బంధం కూడా. వైఎస్సార్ కుటుంబంలోని వారు దళితులను మనువు చేసుకుని బంధాలు కలుపుకున్నారు. మరో వైపు వారు క్రైస్తవ మతం పుచ్చుకోవడం వల్ల కూడా ఎక్కువ శాతం దళితులు వైఎస్సార్ అంటే ఇష్టపడేవారు. జగన్ కి ఆ ఓటు బ్యాంక్ అలా వచ్చి చేరింది.

కారంచేడు దెబ్బ….

ఇక తెలుగుదేశం పట్ల దళితులు పెద్దగా మొగ్గు చూపని పరిస్థితుల్లోనే కారంచేడు ఘటన జరగడం, అక్కడ పెత్తందార్లు, భూస్వాములు అయినా తెలుగుదేశం సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లో దళితులు అణచివేతకు గురి కావడం, దాని పరిణామాలు మండి చివరికి కారంచేడు ఘటన‌తో దళిత జాతి మొత్తం టీడీపీకి దూరం అయింది. ఆ తరువాత మళ్ళీ దాని పునరుద్ధరణ జరగలేదు. ఆ ఆగాధాన్ని పూడ్చే పని ఎన్టీయార్ వల్లనే కాలేదు, అల్లుడు చంద్రబాబుకు అసలు కుదరలేదు. దాంతో టీడీపీకి దళితుల మద్దతు ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది.

దండెత్తినా :

ఇపుడు ఏపీలో జరుగుతున్న అనేక పరిణామాలు, జగన్ సర్కార్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పేదలు, దళితులకు ఉపయోగంగా ఉంటున్నాయి. ఇంగ్లీష్ మీడియం సర్కార్ బడుల్లో ప్రవేశపెట్టినా, అమరావతి రాజధాని భూముల్లో అయిదు శాతం దళితులకు కేటాయించినా అది జగన్ వారి పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ దళితులు అని కూడా చూడకుండా ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించింది. అలాగే, రాజధానిలో దళిత పేదలకు అయిదు శాతం ఇళ్ళ స్థలాలను కూడా అడ్డుకుంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో దళితలకు పెద్ద వాటా ఇవ్వడం కానీ, ఏకంగా హోంమంత్రిగా ఒక దళిత మహిళను నియమించినా ఇవన్నీ కూడా జగన్ తీసుకున్న విప్లవాత్మక చర్యలే. అయితే ఇన్ని చేసిన జగన్ ని దళితులకు వ్యతిరేకంగా చూపించాలనుకోవడమే తెలుగుదేశం బరితెగింపు రాజకీయంగా చూడాలి.

మత్తు ఎవరిది..?

ఆయన మత్తు డాక్టరు, పైగా మద్యం తాగి అల్లరి చేస్తే పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశామని అంటున్నారు. ఆయన మానసిక స్థితి బాలేదని చెప్పింది కూడా కేజీ హెచ్ లోని దళిత వైద్యుడే. ఇక ఆ వైద్యుడి ట్రాక్ రికార్డ్ చూస్తే గతంలో వివాదాస్పదుడు అని, ఫిర్యాదులు ఉన్నాయని చెబుతారు. ఇక ఆయన మాస్కులు ప్రభుత్వాన్ని అడగడంలో తప్పులేదు కానీ ఏకంగా ఏకవచనంతో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని దూసించినదీ వీడియోల్లో రికార్డు అయింది. తాజాగా విశాఖ ఘటనలో కూడా ఆయన నేరుగా సీఎంని నానా దుర్భాషలు ఆడారని పోలీసులు చెబుతున్నారు. ఇంత చేసిన తరువాతనే ఆ డాక్టర్ మీద కేసులు పెట్టారు. దీన్ని దళిత కార్డు తో రాజకీయం చేద్దామనుకున్నపుడే టీడీపీ ఇతర పార్టీల దిగజారుడు రాజకీయం ఏంటో బయటపడిపోయింది. తాము దళిత ఉద్ధరణకు ఉన్నామని చెప్పుకునే ఈ పార్టీలు అమరావతిలో దళితులకు అయిదు శాతం భూములు ఇస్తే ఎందుకు ఒప్పుకోవు అన్నది ఇక్కడ ప్రశ్న. మొత్తం మీద దళిత కార్డు పేరిట ఎంతలా దండెత్తినా దళితులు ఎవరూ సైకిలెక్కరన్నది యాగీ చేస్తున్న పార్టీలకు అందరి కంటే బాగా తెలుసు. అయినా మత్తు ఎక్కిన రాజకీయం కాబట్టి ఇది ఎప్పటికీ ఇంతే అనుకోవాలేమో.

Tags:    

Similar News