అందరికీ అంటించింది.. తాను మాత్రం తేలింది

కరోనా…మూడక్షరాల ఈ మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాసేపు పక్కన పెడితే అనేక దేశాలు దాని దెబ్బకు తల్లడిల్లుతున్నాయి. [more]

Update: 2021-05-08 16:30 GMT

కరోనా…మూడక్షరాల ఈ మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాసేపు పక్కన పెడితే అనేక దేశాలు దాని దెబ్బకు తల్లడిల్లుతున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థలు కకావికలమవుతున్నాయి. చిన్నాభిన్నమవుతున్నాయి. అభివద్ధి చెందిన దేశాలు సైతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి) లు దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోదశ కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ లాక్ డౌన్ విధించేందుకు ఏ ఒక్క దేశమూ సుముఖంగా లేదు. దీనికి కారణం ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతుందేమోనన్న భయం కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ తప్ప వేరే ప్రత్యామ్నయాలపై వివిధ దేశాలు ఆలోచన చేస్తున్నాయి. భారత్ సైతం ఇదే బాటలో నడుస్తోంది.

చైనా ప్రగతిని చూసి….

ఇంతటి గడ్డు పరిస్థితులలోనూ ఆసియా అగ్రరాజ్యం చైనా సాధించిన జీడీపీని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18.3 శాతం జీడీపీ సాధించి అందరినీ నివ్వెర పరిచింది. ఈ మొత్తం దాదాపు రూ.2.84 కోట్ల కోట్లకు సమానం. 1992 తరవాత అంటే 28 సంవత్సరాల అనంతరం ఇంతటి అత్యధిక జీడీపీని చైనా నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇందులో పారిశ్రామిక ప్రగతి 14.1 శాతం, రిటైల్ విక్రయాల్లో అభివ్రుద్ధి 34.2 శాతంగా నమోదు అవడం గమనార్హం. గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ కేవలం 6.8శాతం నమోదైంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిటిక్స్ ఈ వివరాలను వెల్లడించింది. ఒకపక్క కరోనాతో అంతర్జాతీయ సమాజం అతలాకుతలమవుతున్న తరుణంలో చైనా సాధించిన ఈ ప్రగతి స్పూర్తిదాయకమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు.

డిసెంబర్ లో తొలి కేసు….

2019 చివరలో మొట్టమొదట కరోనా మహమ్మారి వెలుగు చూసింది చైనాలోనే. ఆ దేశంలోని వూహన్ నగరంలో కరోనా లక్షణాలు కనిపించాయి. అప్పటినుంచి కరోనా కట్టడికి బీజింగ్ యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా అధునాతాన వసతులతో వైద్యశాలను నిర్మించింది. రోగులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు దీనిని నిర్మించింది. మహమ్మారి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది. తద్వారా మరణాలను బాగా నియంత్రించింది. మరణాల సంఖ్య ఎంతన్నది చైనా చెప్పనప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే అక్కడ మరణాల సంఖ్య తక్కువన్నది వాస్తవం.

జపాన్ ను వెనక్కు నెట్టి….

తొలిరోజుల్లో అమెరికా తరవాత ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ నిలిచేది. చైనా మూడో స్థానంలో ఉండేది. 2010 తరవాత జపాన్ ను వెనక్కి నెట్టేసి అమెరికా తరవాత ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైా ఆవిర్భవించింది. ఇప్పుడు అమెరికా, చైనా, జపాన్ ,జర్మనీ, భారత్ అంతర్జాతీయంగా మొదటి అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు పొందాయి. చైనా అధిక జీడీపీ సాధించడానికి ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ లేవు. కరోనా కష్టకాలంలోనూ నిరాటంకంగా ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించింది. లాక్ డౌన్ వంటి ఆలోచనలకు దూరంగా ఉంది. ఒక పక్క కరోనా కట్టడి చర్యలు పకడ్బందీగా చేపడుతూనేమరోపక్క ఉత్పత్తి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత వంటి చర్యలను పకడ్బందీగా అమలు చేసింది. కరోనా ప్రభావం ఏ రంగంపైనా పడకుండా చర్యలు చేపట్టింది. మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఉత్పత్తికి విఘాతం కలిగించకుండా ఉండటమూ అంతే ముఖ్యమని భావించింది. ఈ ప్రణాళికే జీడీపీ పెరుగుదలకు దోహదపడింది. చైనా చేపట్టిన చర్యలపై ప్రపంచ దేశాలు లోతైన అధ్యయనం చేసి తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News