అసలు జరుగుతున్నదిదే….!!!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలల దాటుతోంది. ముఖ్యమంత్రి పదవిలోకి జగన్మోహన్‌ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోను రాలేడని భావించిన వాళ్లంతా జనం తీర్పుతో విస్తుబోయారు. [more]

Update: 2019-07-30 13:30 GMT

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలల దాటుతోంది. ముఖ్యమంత్రి పదవిలోకి జగన్మోహన్‌ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోను రాలేడని భావించిన వాళ్లంతా జనం తీర్పుతో విస్తుబోయారు. పాలనలో కుదురుకోక ముందే ముఖ్యమంత్రి ప్రదర్శిస్తోన్న దూకుడుతో ప్రత్యర్ధులకు మింగుడు పడటం లేదు. వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఎదురయ్యే పరిణామాలు ఏమిటన్నది పక్కన పెడితే ముఖ్యమంత్రిని బలంగా ఢీకొట్టాలనే అకాంక్ష మాత్రం ప్రత్యర్ధుల్లో అంతకంతకు పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాల్లో కీలకమైనవి నదీ జలాల వినియోగం., పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు., రాజధాని నిర్మాణం, రివర్స్‌ టెండరింగ్‌ వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రాజధాని నిర్మాణంలో….

వీటిలో మొదట రాజధాని నిర్మాణం….. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం సందిగ్ధంలో పడిందని నెలన్నరగా చర్చ జరుగుతోంది. అమరావతి భవిష్యత్తు అగమ్యగోచరమైందని గగ్గోలు పెట్టేస్తున్నారు. వేల కోట్ల రుపాయల పనుల్లో ప్రతిష్టంభన ఏర్పండిందని ప్రపంచ బ్యాంకు రుణ మంజూరులో కూడా వెనక్కి తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమనేది ప్రధాన స్రవంతి మీడియా వాదన. అమరావతి మీద అంతులేని ప్రేమ కురిపించే వారంతా మొదట ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి….. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది ఇంద్రుడి అమరావతా…., బుద్దుడి అమరావతినా…? రాజధానికి అమరావతి పేరు పెట్టాలని తాము డిమాండ్ చేయడం వల్లే ప్రభుత్వం తలొగ్గిందని గతంలో కొన్ని ప్రకటనలు కూడా పత్రికల్లో వచ్చాయి. బౌద్ధం మీదో., బుద్దుడి మీదో అభిమానంతో రాజధానికి అమరావతి పేరు పెట్టడం సత్యదూరం….. పేరు మీద ఇంత రాద్ధాంతం ఎందుకనే సందేహం నివృత్తి చేసే ప్రయత్నం సర్కారు ఎప్పుడు చేయలేదు.

భూముల ధరలు అమాంతం….

ఇక రాజధాని ప్రకటనకు ముందు రాజధానిలో భాగంగా ప్రకటించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం మినహా మిగిలిన 26 గ్రామాల్లో భూముల ధరలు 10 – 25లక్షల లోపు ఉండేవి. అవి కూడా కృష్ణా నదికి దగ్గరలో ఉన్న వాటికి కరకట్టకిరువైపులా ఉన్న భూములకు ఎక్కువ ఖరీదు ఉండేది 2014 డిసెంబర్‌లో రాజధాని ప్రకటన చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తయ్యే లోపు ఈ భూమి ధర రెండు, మూడు కోట్లకు చేరింది. రాజధానిలో అయాచిత లబ్ది పొందాలనుకున్న వాళ్లు ఇలా పెట్టుబడులు పెట్టారు. ఎన్‌ఆర్‌ఐలు., భూమి మీద పెట్టుబడి పెట్టేంత స్తోమత ఉన్న వారు., అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తోందనే ముందస్తు సమాచారం ఉన్న వారు ప్రభుత్వ ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేశారు. రాజధాని విజయవాడ గుంటూరు మధ్య వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాక., కృష్ణా జిల్లాలో విస్తారంగా అటవీ భూములు ఉన్న నూజివీడులో రాజధాని వస్తుందని విస్తృత ప్రచారం జరిగింది. అయితే కృష్ణానది వెంబడి ఇబ్రహీం పట్నం-నందిగామ మధ్యలో రాజధాని వస్తుందని కృష్ణా జిల్లాకు చెందిన అప్పటి అధికార పార్టీ నాయకుడు చెప్పిన కొద్ది నెలలకే అమరావతి ప్రకటన వెలువడింది. పారిశ్రామిక వేత్త కూడా అయిన సదరు నాయకుడికి రాజధాని మీద పూర్తి అవగాహనతోనే మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే దీనిని ఎవరు గ్రహించలేకపోయారు. 2015చివరికి ల్యాండ్ పూలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి దాదాపు 28వేల మంది రైతుల నుంచి 33వేల ఎకరాల భూమిని సిఆర్‌డిఏ సేకరించింది. అన్ని రకాల ప్రణాళికలు పూర్తయ్యాక, మౌలిక సదుపాయాలు., ప్రభుత్వ అవసరాలు., భూములిచ్చిన రైతుల వాటా పోగా ప్రభుత్వం దగ్గర 6వేల ఎకరాల భూమి మిగిలి ఉంటుదని అంచనా….. ఈ భూమి ధర ఎకరా మూడు కోట్లు లెక్కించిన ప్రభుత్వానికి 18వేల కోట్ల రుపాయల ఆదాయం నికరంగా వస్తుంది కాబట్టి ఏ దశలోను నష్టం ఉండదని మంత్రి నారాయణ తరచూ చెప్పేవారు.

కృత్రిమ అభివృద్ధి కాదా…?

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయి. రాజధాని నగరాన్ని అమరావతి నుంచి తరలించేస్తారనే ప్రచారాన్నిముఖ్యమంత్రి ఇప్పటికే ఖండించారు. మరి రాజధాని విషయంలో ఎందుకు స్తబ్ధత కొనసాగుతోందనే సందేహం అందరికి కలుగుతుంది. దీనికి వచ్చే ఒకే ఒక సమాధానం….రాజధానిలో అందరి భాగస్వామ్యం లేకపోవడమే…. రాజధాని కోసం ఎంపిక చేసుకున్న ప్రాంతం., రాజధానికి భూములిచ్చిన రైతులు, తిరిగి వారికి అభివృద్ధి చేసిన స్థలాల కేటాయింపు( రైతుల వాటా భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కార్యరూపం దాల్చలేదు) ఇదంతా సామాజిక ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలోనే జరిగాయనేది అధికార వైసీపీ అనుమానం. మరోవైపు రాజధాని నిర్మాణంలో భాగంగా 35వేల కోట్లకు పైచిలుకు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో ప్రధానంగా పరిపాలనా నగర నిర్మాణం మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగింది. అసెంబ్లీ, సచివాలాయాలకు అనుబంధంగా ఎమ్మెల్యే క్వార్టర్లు., ఆలిండియా సర్వీస్‌ అధికారులు నివాసాలు., న్యాయమూర్తుల నివాసాలు., గజిటెడ్‌ నుంచి క్లాస్‌ 4 వరకు వివిధ క్యాటగిరీల్లో ఉద్యోగులు నివాసాలను నిర్మిస్తున్నారు. ఇవి ఎన్నికల నాటికే ఓ రూపుకొచ్చాయి. అంతకు మించి నివాస యోగ్యమైన నగరంగా మాత్రం ఈ ప్రాంతం రూపుదిద్దుకోలేదు. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలు., విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని., రియల్‌ ఎస్టేట్‌ నేల చూపులు చూస్తోందని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం లబ్ది పొందనుందని., ఇది రాష్ట్ర్ర అభివృద్ధికి సవాలు కానుందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి విచిత్ర వాదనలు చేసే వాళ్ళెవరు ఆంధ్రాలో ఉండరు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌లో ఉంటూ ఏపీ కోసం బాధపడుతుంటారు. ఇక రియల్‌ ఎస్టేట్‌., భూముల విలువ సామాన్యులు కలలో కూడా ఊహించని స్థాయికి ఎప్పుడో చేరిపోయింది. గజం ఐదు వేలు కూడా చేయని రాజధాని ప్రాంతంలో రైతుల వాటాగా ఇచ్చిన కమర్షియల్‌ ఫ్లాట్లకు ముఖ్యమంత్రి సమీప బంధువు ఒకరు గజం 40వేల కొనడమే అక్కడ జరిగిన కృత్రిమ అభివృద్ధికి నిదర్శనం. భూముల ధరలు దిగిరావాలన్నా., అసహజంగా పెరిగిపోయిన విలువలు తగ్గాలన్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మంచివిగానే పరిగణించాలి.

పిన్ కోడ్ కూడా లేదే….

నిజానికి రాజధాని నిర్మాణం ఐదేళ్లలో జరిగే పని కాదు. దశల వారీగా., అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, విస్తరణ జరగాలి. అందుకు భిన్నంగా విజయవాడకు 20కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తోన్న నగరం మీద పెద్దపెద్ద ఆశలు పెట్టుకోవడం కూడా తప్పే. ఎన్నికల్లో ప్రభుత్వం మారకుండా టీడీపీ కొనసాగి ఉన్నా ఈ స్తబ్ధత ఇలాగే ఉండేది. కాకపోతే ప్రచార ఆర్భాటం హోరేత్తేది. ఈ పాటికి రెండు మూడు అంతర్జాతీయ ఫెస్టివల్స్‌ అమరావతి పేరుతో విజయవాడ స్టార్‌ హోటళ్లలో జరిగేవి. చివరకు అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది అనే వాళ్లు అమరావతి పిన్‌కోడ్‌ ఏదంటే ఏమి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి నగరానికి కనీసం పిన్ కోడ్‌ను కూడా పాలకులు తీసుకురాలేకపోయారు.

ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం….

మొన్నటి క్యాబినెట్ భేటీలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి మీద సీఎం అసహనం వ్యక్తం చేశారని, సీఎం చెప్పినా చేయరా ? అని నిలదీయడంతో అధికారులు మనస్తాపం చెందారని వాట్సాప్ మెసేజ్ హల్చల్ చేస్తోంది….. ముఖ్యమంత్రి వ్యవహార శైలితో అధికారులు భయంతో వణికి పోతున్నారని, ఎదురు చెప్పలేక సతమతం అవుతున్నారని వాపోతున్నారు. నిజానికి పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సీఎం చెప్పిన దాంట్లో తప్పు ఏముంటుంది. ఓ కులానికో, తమ పార్టీ వాళ్లకో ఉద్యోగాలు ఇవ్వమని చెబితే తప్పు కాని పరిశ్రమల కోసం భూములు ఇచ్చే నిర్వాసితులకు, ఆ భూములపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉండే ప్రజలకు ఉద్యోగాల్లో మెజారిటీ వాటా ఇవ్వాలంటే అది పెట్టుబడులకు అడ్డం అవుతాయా….?

ఈకలు పీకే ప్రయత్నాలు….

ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పేరుతో అడ్డ గోలు విధానాలు అమలు అవుతుంటే ఓ మంచి ఆలోచనకు ఇలా ఈకలు పీకే ప్రయత్నాలు విచారకరం. ఉద్యోగాలు- స్థానికత మీద చర్చించే క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ ఒకరు గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణం జరిగే సమయంలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, మొత్తం శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు చేయడంతో నాన్ స్కిల్డ్, సెమి స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని వైఎస్ చెప్పడంతో, జిఎంఆర్ మొదట తటపటాయించినా తర్వాత ఏడెనిమిది నెలలు శిక్షణ ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించిన సంగతి చెప్పారు. పరిశ్రమల కోసం ఇచ్చే పరిహారం భూ యజమానికి అందుతుంది. ఆ భూమి మీద పరోక్షంగా ఆధారపడి బతికే వాళ్ళకి ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా మేలు చేస్తాయి. అధికారుల్లో ఉండే సహజమైన ధోరణి అభ్యంతరాలకు ఓ కారణం అయితే… జగన్ సీఎం అవ్వడాన్ని తట్టుకోలేని వర్గం ఈ తరహా లీకులను ప్రచారంలోకి తెచ్చి జనంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News